సాక్షి, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆమె కామాంధుల బాధితురాలన్న కనికరంలేదు.. ఆమెకు కరోనా సోకిందన్న దయ లేదు.. ఆమెను తండావాసులు నిర్దాక్షిణ్యంగా వెలివేశారు. చుట్టూ కారుచీకటి.. చుట్టుపక్కల కానరాని మనిషి జాడ.. ఎటువైపు నుంచి ఏ అడవి జంతువు వచ్చి దాడి చేస్తుందోనన్న భయం.. మరోవైపు వర్షం.. రక్షణ ఇవ్వలేని గుడారం.. ఏం చేయాలో తెలియని అయోమయస్థితిలో మూడురోజులపాటు కొట్టుమిట్టాడింది ఓ అభాగ్యురాలు.
ఈ హృదయ విదారకమైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రాశిగుట్ట తండాలో చోటుచేసుకుంది. వివరాలు... రాశిగుట్ట తండాకు చెందిన ఓ బాలిక గతనెల 18న లైంగికదాడికి గురైంది. బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించగా, నిందితులను అదే నెల 20న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం సిరిసిల్లలోని సఖీ కేంద్రంలో బాలికకు వసతి కల్పించారు. అక్కడ అనారోగ్యానికి గురికావడంతో మంగళవారం ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్‌గా వచ్చింది. దీంతో అదేరోజు ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు.
అప్పటికే తల్లికి కూడా కరోనా సోకింది. ఐసోలేషన్ కేంద్రంలో పట్టించుకునేవారు లేకపోవడంతో తల్లీకూతుళ్లు తండాకు చేరుకున్నారు. అప్పటికే సగం సచ్చి బతుకుతున్న ఆ కుటుంబంపట్ల సానుభూతి చూపకపోగా, తమకు కరోనా వస్తుందనే కారణంతో తండావాసులు వారిని వెలివేశారు. దీంతో ఊరుకు దూరంగా వారి సొంతపొలం వద్ద గుడారం ఏర్పాటు చేసుకున్నారు. బుధవారం ఉదయం నుంచి శుక్రవారం సాయంత్రం వరకూ అక్కడే బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ఈ విషయం మీడియాలో ప్రచారం కావడంతో స్పందించిన జిల్లా అధికారులు వెంటనే తండాకు చేరుకుని తల్లీకూతుళ్లను మళ్లీ సిరిసిల్లలోని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు.
చదవండి: మొక్కలు ఎందుకు ఎండిపోయాయ్.. కొత్తవి నాటండి: కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment