డేటింగ్‌కు రావడం లేదని..!
అమెరికాలో ఉన్మాది కాల్పులు
వాహనంలో వెళ్తూ ఘాతుకం; ఆరుగురి మృతి
అమ్మాయిలు ప్రేమించడం లేదన్న నిస్పృహతో దుశ్చర్య!
లాస్ఏంజెలిస్: అమెరికాలో ఓ దుండగుడు బీభత్సం సృష్టించాడు. దక్షిణ కాలిఫోర్నియాలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా క్యాంపస్ ఉన్న ఇస్లావిస్టా పట్టణంలో శుక్రవారం రాత్రి(స్థానిక కాలమానం ప్రకారం) నలుపు రంగు బీఎండబ్ల్యూ వాహనంలో ప్రయాణిస్తూ.. పాదచారులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఆరుగురి నిండుప్రాణాలు తీశాడు. దాదాపు తొమ్మిది ప్రాంతాల్లో కాల్పులకు తెగబడ్డాడు. ఆ కాల్పుల్లో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ వాహనాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో వారిపై కూడా కాల్పులు జరిపాడు. ప్రతిగా పోలీసులు కూడా కాల్పులు జరిపారు. అలా రెండు సార్లు పోలీసుల నుంచి తప్పించుకుని చివరగా ఒక ఆగి ఉన్న కారును ఢీ కొని ఆగిపోయాడు.
వాహనం దగ్గరికి వెళ్లి పరిశీలించిన పోలీసులకు తలపై బులెట్ గాయంతో ఉన్న అతడి మృతదేహం కనిపించింది. వారికి ఆ వాహనంలో ఒక సెమీ ఆటోమేటిక్ హ్యాండ్‌గన్ లభించింది. కాల్పులకు కారణం ఇంకా తెలియరాలేదని, ఘటనకు సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరిస్తున్నామని స్థానిక సాంటా బార్బరా కౌంటీ పోలీస్ అధికారి బిల్ బ్రౌన్ వెల్లడించారు. స్థానికంగా పరిస్థితి సామూహిక హత్యాకాండ జరిగినట్లుగా ఉందన్నారు. ఇస్లావిస్టా పట్టణ వాసులను ఇళ్లల్లోంచి బయటకు రావద్దని సూచించారు. ఆ దుండగుడు ఒక బెదిరింపు వీడియోను కూడా యూట్యూబ్‌లో అప్లోడ్ చేసినట్లు అందిన సమాచారంపై కూడా దర్యాప్తు జరుపుతున్నామన్నారు. దుండగుడి పేరును మాత్రం అధికారులు వెల్లడించలేదు.
ఈ ఘాతుకానికి పాల్పడింది 22 ఏళ్ల ఇలియట్ రోడ్జర్ అని భావిస్తున్నారు. రోడ్జర్ అప్లోడ్ చేశాడంటున్న వీడియో దాన్ని ధ్రువీకరిస్తోంది. 22 ఏళ్లు వచ్చినా తనకు శృంగారానుభవం లేదని, ఏ అమ్మాయినీ ముద్దు కూడా పెట్టుకోలేదని, తనతో డేటింగ్‌కు ఒప్పుకోని అమ్మాయిలపై ప్రతీకారం తీర్చుకుంటానని ‘రోడ్జర్ ప్రతీకారం’ అనే పేరుతో ఉన్న ఆ వీడియోలో రోడ్జర్ హెచ్చరించాడు. ‘కాలేజ్ రోజుల్లోనే అంతా అద్భుతమైన శృంగార అనుభవాల్ని పొందుతారు.
నాకు అవేమీ లభించలేదు. అమ్మాయిలు మంచివాడైన నన్ను కాదని దుర్మార్గులకు దగ్గరవుతున్నారు.. అందమైన అమ్మాయిలుండే ‘యూఎస్సీబీ’కి వెళ్లి కనిపించిన వారినందరినీ కాల్చి చంపేస్తాను.. అని ఆ వీడియోలో హెచ్చరించాడు. అతని ఇతర సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లలోనూ ఒంటరితనానికి, ప్రతీకారానికి సంబంధించిన వ్యాఖ్యలే ఉన్నాయి. రోడ్జర్ సాంటా బార్బరా సిటీ కాలేజ్ విద్యార్థి అని, హంగర్ గేమ్స్ అనే సినిమాకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేసిన పీటర్ రోడ్జర్ కుమారుడని సమాచారం.