కృషి, అనుభవం భవిష్యత్‌కు సోపానం
- బీఎఫ్ఎస్సీ ఫైనల్ ఇయర్లోనే ‘ఉపాధి’
- పచ్చళ్ల తయారీలో విద్యార్థులు
- రంగు చేపల పెంపకంలో శిక్షణ
- అమ్మకాల ద్వారా అనుభవం
ముత్తుకూరు (సర్వేపల్లి) : ముత్తుకూరులోని మత్స్యకళాశాల బీఎఫ్ ఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు చివరి సెమిస్టర్లో భాగంగా ‘ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రొగ్రాం(ఈఎల్పీ–కృషి అనుభవ పథకం)లో భాగస్వామ్యులవుతున్నారు. బీఎఫ్ఎస్సీ పూర్తి చేసినప్పటికీ భవిష్యత్‌లో ఉద్యోగాలు లభించని వారు వ్యాపార రంగంలో రాణించేందుకు దేశంలోనే ప్రప్రథమంగా ఇక్కడ ఏడేళ్ల క్రితం ఈ పథకం అమల్లో పెట్టారు. ఆక్వా ఫార్మింగ్, ఆర్నమెంటల్ ఫిష్, అక్వా క్లినిక్, వాల్యూ యాడెడ్ ఫిష్ ప్రొడెక్టŠస్ తదితర 4 రంగాల్లో అనుభవం గడించాలి. కళాశాలల్లో ప్రస్తుతం 28 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులున్నారు.
ఒక్కొక్క రంగంలో ఏడుగురు విద్యార్థులు 150 రోజుల పాటు అనుభవం గడించడంలో పాటుపడుతున్నారు. రొయ్యల పచ్చళ్లు, చేపల ఊరగాయల తయారీలో కొందరు శిక్షణ పొందుతున్నారు. రంగు చేపల పెంపకం, రొయ్యలు–చేపల పెంపకం, వ్యాధులు–నివారణ పద్ధతులపై మిగిలిన వారు వివిధ ప్రాంతాల్లో స్వయంగా అధ్యయనం చేస్తున్నారు.
పెట్టుబడులు–ఆదాయాలు
ఈఎల్పీ పథకంలో విద్యార్థులు అనుభవం గడించేందుకు కావాల్సిన పరికరాలు, సామగ్రి కొనుగోలు కోసం ఎస్వీవీయూ కొంత మొత్తం పెట్టుబడి నిధిగా ఇస్తుంది. నాలుగు రంగాల్లో నాలుగు బృందాలుగా ఏర్పడిన విద్యార్థులు ఈ పెట్టుబడితో వారి వారి రంగాల్లో వ్యాపారం చేయాలి. పథకం పూర్తయ్యే లోపు సంపాదించిన మొత్తంలో పెట్టుబడి తిరిగి చెల్లించి, వచ్చిన లాభాలు పంచుకుంటారు. చేపలు, రొయ్యలు కొనుగోలు చేసి, వాటితో ఊరగాయలు, పచ్చళ్లు తయారు చేస్తారు, కళాశాల ద్వారం వద్ద స్టాల్లో పెట్టి వాటి అమ్మకాలు సాగిస్తారు. కళాశాలలోనే(ఆర్నమెంటల్ ఫిష్) రంగు చేపల పెంపకం చేసి, వాటిని అమ్మకాలు చేస్తారు.
రూ.9 లక్షలతో రిటైల్ ఔట్లెట్
ఈఎల్పీ పథకంలో విద్యార్థులు తయారు చేసిన ఉత్పత్తుల అమ్మకాల కోసం కళాశాల ఆవరణలో రిటైల్ ఔట్లెట్ ఏర్పా టు కానుంది. రూ.9 లక్షలు ఖర్చు అవుతుందని ఎస్వీవీయూకి ప్రతిపాదనలు పంపాం. ఉద్యోగాలు లభించకున్నా వ్యాపారాల ద్వారా విజయవంతం కావచ్చన్న ఆత్మ విశ్వా సం విద్యార్థుల్లో కలిగించేందుకే పథకాన్ని అమలు చేస్తున్నాము. –డాక్టర్ ధనపాల్, ఇన్చార్జ్, ఈఎల్పీ