ఆర్టీసీలో సొమ్ము స్వాహా
-ఉద్యోగి ఘనకార్యం
-విధులకు గైర్హాజరు
-విజిలెన్స్ అధికారుల విచారణ
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) ఏలూరు డిపో పరిధిలో రూ. 8 లక్షల అవినీతి జరిగింది. దీనిపై ఉద్యోగులు, కార్మికుల్లో చర్చ జరుగుతోంది. ఏలూరు డిపో పరిధిలోని కొత్త బస్టాండు, పాత బస్టాండుల్లో ఏర్పాటు చేసిన దుకాణాల ద్వారా సంస్థకు అద్దెల రూపంలో వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని ఒక ఉద్యోగి వాడుకుని అప్పటి నుంచి విధులకు గైర్హాజరయ్యాడు.
అసలేం జరిగిందంటే..
ఏలూరు ఆర్టీసీ డిపో పరిధిలో కొత్త బస్టాండులో 49, పాత బస్టాండులో 39, పెదపాడు బస్‌స్టేçÙన్లో 5, చింతలపూడి బస్ స్టేషన్లో 8, ద్వారకా తిరుమల బస్ స్టేషన్లో 8 కలిపి మొత్తం 109 దుకాణాలు ఉన్నాయి. వీటిని వ్యాపారులకు అద్దెకు ఇచ్చారు. వీటి ద్వారా సంస్థకు ప్రతినెలా రూ. 9.31 లక్షల ఆదాయం రావాల్సి ఉంది. అయితే కొంతమంది దుకాణదారులు ప్రతినెలా అద్దెలు చెల్లించకుండా రెండుమూడు నెలలకొకసారి చెల్లిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కొంతకాలంగా ఈ ఆదాయంలో ప్రతినెలా రూ.12లక్షల లోటు కనిపిస్తోంది.
జూనియర్ అసిస్టెంట్ పాత్రపై అనుమానం
ప్రతినెలా వస్తున్న లోటుపై ఎట్టకేలకు అధికారులకు అనుమానం వచ్చింది. సంబంధిత పద్దులు చూసే జూనియర్ అసిస్టెంట్ పాత్రపై నిఘాపెట్టారు. సుమారు ఏడాదిన్నర క్రితం కష్ణాజిల్లాలో కండక్టర్‌గా పని చేస్తూ పదోన్నతిపై ఇక్కడికి వచ్చిన శ్రీనివాస్ ఈ దుకాణాలపై వచ్చే అద్దెలు, బకాయిలు, ఖాళీగా ఉన్న దుకాణాలు వంటి పద్దులు చూసే జూనియర్ అసిస్టెంట్‌గా బాధ్యతలు స్వీకరించాడు. దుకాణదారులు ప్రతినెలా అద్దెలు చెల్లించకుండా బకాయిలు పెట్టడాన్ని నిశితంగా పరిశీలించిన అతను దానిని అవకాశంగా తీసుకుని ప్రతినెలా వస్తున్న అద్దెమొత్తంలో కొంత పక్కదారి పట్టిస్తూ వచ్చాడు. ఆ మొత్తం ఇప్పటివరకూ సుమారు రూ.8లక్షలకు చేరుకున్నట్టు అంచనా.
రెండు నెలలుగా గైర్హాజరు
ఈ నేపథ్యంలో ప్రతినెలా కనిపిస్తున్న లోటుపై ఆ ఉద్యోగిని అధికారులు ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగు చూసింది. దుర్వినియోగమైన మొత్తాన్ని చెల్లించాలని అతనిపై అధికారులు ఒత్తిడి పెంచారు. దీంతో ఆ ఉద్యోగి విధులకు డుమ్మాకొట్టాడు. అయినా పట్టువదలని అధికారులు అతనిపై ఇంకా ఒత్తిడిపెంచారు. తొలుత ఆ మొత్తాన్ని చెల్లించివేస్తానని అధికారులకు చెప్పిన ఆ ఉద్యోగి గత నెలలో తిరిగి విధులకు హాజరయ్యాడు. కేవలం రెండు రోజులు మాత్రమే పనిచేసి తిరిగి అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా గైర్హాజరయ్యాడు. దీంతో అధికారులు అతనిస్థానంలో మరో ఉద్యోగికి బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారంపై ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు ఇప్పటికే విచారణ ప్రారంభించినట్టు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి ఉన్నతాధికారుల దష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం.
గుంబనంగా అధికారులు..
ఈ వ్యవహారంపై అధికారులు మాత్రం గుంబనంగా వ్యవహరిస్తున్నారు. విషయాన్ని బయటకు పొక్కకుండా చూడడానికి నానా తంటాలూ పడుతున్నట్టు తెలుస్తోంది. సదరు ఉద్యోగి దుర్వినియోగానికి పాల్పడిన మొత్తాన్ని తిరిగి వసూలు చేసేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డిపో మేనేజర్‌తో పాటు మరికొందరు రీజనల్ కార్యాలయ అధికారులపైనా చర్యలు తీసుకునే అవకాశమున్నట్టు కార్మికవర్గాల్లో, దుకాణదారుల్లోనూ చర్చ జరుగుతోంది.
2 నెలల క్రితమే గుర్తించాం..
దుకాణాల అద్దెకు సంబంధించిన డబ్బు దుర్వినయోగమవుతున్నట్టు రెండు నెలలకు ముందే గుర్తించాం. వెంటనే ఆ గుమాస్తాని విచారించి రూ.5 లక్షలు వసూలు చేశాం. మరో రూ.1.80 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. ఈ విషయంపై విచారణ చేస్తున్నాం. గుమాస్తా విచారణకు హాజరు కావడం లేదు. విచారణకు హాజరైతే పూర్తి వివరాలు తీసుకుని అతనిని విధుల నుంచి తొలగిస్తాం.
ఎస్.ధనుంజయరావు, రీజనల్ మేనేజర్