మళ్లీ ఎంపీ మాగంటి బాబు అలక
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ఏలూరు ఎంపీ మాగంటి బాబు బుధవారం అలకబూనారు. సీఎం కాన్వాయ్‌ను దాటి వెళుతున్న ఎంపీ మాగంటి వాహనాన్ని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో సెక్యూరిటీపై మాగంటి బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్‌ను పక్కన పెట్టి తానే స్వయంగా డ్రైవ్ చేసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చిన చాలా సందర్భాల్లో అధికారులపై అలిగి మాగంటి బాబు మాట్లాడకుండా వెళ్లిపోయిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చారు. అయితే సీఎం సభాస్థలికి రాకముందే ఎంపీ మాగంటి అక్కడకు చేరుకున్నారు. సభావేదికపైకి వెళ్లిన ఆయన ఎంపీపీలు, జెడ్పీటీసీలను వేదికపైకి రావాల్సిందిగా పిలిచారు. అక్కడే ఉన్న పోలీసు అధికారులు ఇందుకు అభ్యంతరం చెప్పారు. ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం వారిని వేదికపైకి అనుమతించలేమన్నారు. దీంతో మాగంటి బాబు ‘నేను చెబుతున్నాను. పంపించండి’ అని పదేపదే అడిగినా ఫలితం లేకపోయింది. దీంతో ఎంపీ మాగంటి చేతిలోని మైక్ కిందపడేసి విసురుగా వేదిక దిగి వెళ్లిపోయారు.