థ్రిల్ కోసం హత్య చేసిన కొత్త జంట!
పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం నానుడిని నిజం చేసింది. అమెరికాకు చెందిన ఓ కొత్త జంట. థ్రిల్ కోసం ఓ మనిషి ప్రాణాలు తీశారు. మూడు వారాల క్రితమే పెళ్లి చేసుకున్న ఓ జంట అత్యంత కర్కశంగా ఓ వ్యక్తిని హత్య చేసింది. ఆన్లైన్ ప్రకటన ఇచ్చి మరి మర్డర్ చేశారు. ఫిలడెల్పియాకు చెందిన ఎలిటీ బాబర్(22), మిరిండా బాబర్(18) ఈ కిరాతకానికి పాల్పడ్డారు. వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి హత్యానేరం మోపారు.
ఫిలడెల్పియాకు ఈశాన్యంగా 100 మైళ్ల దూరంలో ఉన్న సన్బరీ పట్టణంలో నవంబర్ 12న ట్రాయ్ లా ఫెరారా అనే వ్యక్తి హత్యకు గురైనట్టు పోలీసులు గుర్తించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అవాక్కయ్యే నిజాలు తెలిశాయి. నిందితుడు ఎలిటీ బాబర్ అరెస్ట్‌ను చేయడంతో హత్యోదంతం వెల్లడయింది. చాలా రోజుల నుంచి హత్య చేయాలని భావించినా లా ఫెరారా దొరికే వరకు తమ ప్రయత్నాలు ఫలించలేదని పోలీసులతో ఎలిటీ చెప్పాడు.
ఆన్లైన్లో తామిచ్చిన కంపానియన్(తోడు కోసం) ప్రకటన చూసి స్పందించిన లా ఫెరారాను నవంబర్ 11న ఓ షాపింగ్ మాల్ దగ్గర కారులో ఎక్కించుకున్నామని తెలిపాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత తన భార్య సైగ చేయడంతో కారు ముందు సీట్లో కూర్చున్న లా ఫెరారా మెడకు వెనక నుంచి వైరు బిగించి పట్టుకున్నానని తెలిపాడు. అదే సమయంలో అతడిని తన భార్య కత్తితో పొడిచిందని వివరించాడు. 42 ఏళ్ల లా ఫెరారా ఒంటిపై 20 కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
లా ఫెరారా ఎవరో తనకు తెలియదని మొదట్లో బుకాయించిన మిరాండ తర్వాత నేరం ఒప్పుకుంది. హత్య చేసిన తర్వాత క్లబ్ వెళ్లి తన భర్త పుట్టినరోజును సెలబ్రేట్ చేసింది. అక్టోబర్ 22న తమ పెళ్లైన నాటి నుంచి మిరాండ ఆన్లైన్లో 'కంపానియన్' ప్రకటనలు ఇస్తోందని ఎలిటీ బాబర్ తెలిపారు. అయితే తన భార్య వేశ్య కాదని స్పష్టం చేశాడు. కేసుపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఇంకా ఎన్ని సంగతులు వెలుగు చూస్తాయో చూడాలి.