Eman Ahmad Abdulati
-
డాక్టర్ మోసం చేశారు.. లావాటి మహిళ కోలుకోలేదు!!
ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళకు తాము చికిత్స చేశామని, ఆమె సగానికి సగం తగ్గిపోయిందని.. అన్ని రకాల సమస్యల నుంచి కూడా కోలుకుంటోందని ముంబై వైద్యులు చెప్పిన విషయాన్ని ఆమె చెల్లెలు ఖండించింది. ముంబై సైఫీ ఆస్పత్రికి చెందిన డాక్టర్ ముఫజల్ లక్డావాలా తమను మోసం చేశారని తెలిపింది. ఇమాన్ అహ్మద్ అబ్దులాటి ఆరోగ్యం గురించి డాక్టర్ లక్డావాలా చెబుతున్నదంతా అబద్ధమని, తన అక్క అసలు కోలుకోలేదని ఆరోపించింది. డాక్టర్ లక్డావాలా అబద్ధాలకోరు అని, తన అక్క కొంచెం కూడా బాగుపడలేదని ఇమాన్ సోదరి సైమా చెప్పింది. కానీ డాక్టర్ లక్డావాలా మాత్రం సైమా ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇమాన్ బ్రహ్మాండంగా ఉందని, ఆమె నరాల పరిస్థితిని అంచనా వేయడానికి ఒక సీటీస్కాన్ చేయాల్సి ఉందని అన్నారు. ఆర్థిక కారణాల వల్ల తన అక్కను తిరిగి ఈజిప్టు తీసుకెళ్లలేకపోవడం వల్లనే సైమా ఇప్పుడు లేనిపోని సీన్ క్రియేట్ చేస్తోందని చెప్పారు. సైమా కూడా మొదటి 15 రోజులు బాగానే ఉందని, కానీ ఆమె అక్క కోలుకుందని, ఇక ఈజిప్టు తీసుకెళ్లచ్చని చెప్పినప్పటినుంచే గొడవ చేస్తోందని అన్నారు. వార్డు నుంచి ఇమాన్‌ను సీటీస్కాన్ రూంకు తీసుకెళ్లే సమయంలో సైమా చెప్పేది ఎంతవరకు నిజమో అందరికీ తెలుస్తుందని కూడా డాక్టర్ తెలిపారు. వచ్చినప్పుడు 500 కిలోలకు పైగా బరువున్న ఇమాన్ అహ్మద్.. సైఫీ ఆస్పత్రిలో సర్జరీ తర్వాత 250 కిలోల వరకు తగ్గారు. ఆమె ఇంత త్వరగా అంత తగ్గుతారని తాము కూడా అనుకోలేదని, ఆరునెలల్లో 200 కిలోల వరకు తగ్గొచ్చని భావించామని ఆస్పత్రిలోని ఒబెసిటీ సర్జన్ డాక్టర్ లక్డావాలా అన్నారు. బరువు తగ్గడం వల్ల ఆమె ఆరోగ్యం ఆచలా బాగుపడిందని, గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు అన్నీ బాగా పనిచేస్తున్నాయని వివరించారు. సరిగా ఫిజియోథెరపీ చేయించుకుని, నడవాలనుకుంటే ఆమె తన సొంత ప్రయత్నం కూడా చాలా చేయాలన్నారు. ఆమె 200 కిలోల కంటే తక్కువ బరువుకు వచ్చిన తర్వాత బరువు చూస్తామని తెలిపారు. -
మొన్న క్రేన్.. ఇప్పుడు వీల్ చెయిర్!
ఆమె వయసు కేవలం 36 సంవత్సరాలు.. బరువు మాత్రం 500 కిలోలకు పైమాటే. ఆ భారీ శరీరంతో కష్టాలు భరించలేక.. బరువు తగ్గించుకునే చికిత్స చేయించుకోడానికి ఇమాన్ అహ్మద్ అబ్దులాటి ఫిబ్రవరి రెండో వారంలో ముంబైలోని సైఫీ ఆస్పత్రిలో చేరారు. ఈజిప్టుకు చెందిన ఈమెను అక్కడి నుంచి సాధారణ విమానంలో తీసుకురావడం సాధ్యం కాకపోవడంతో.. కార్గో విమానంలో తెచ్చారు. అక్కడినుంచి టెంపోలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి మొదటి అంతస్తుకు ఆమెను మామూలుగా తీసుకెళ్లడం సాధ్యం కాకపోవడంతో.. పేషెంటు బెడ్‌కు గట్టి తాళ్లను కట్టి, భారీ క్రేన్ సాయంతో ఆ బెడ్‌ను మొదటి అంతస్తు వరకు తీసుకెళ్లారు. ఇదంతా రెండు నెలల క్రితం మాట. ఇప్పుడు ఆమె బరువు బాగా తగ్గిపోయింది. దాదాపు సగానికి పైగా బరువును ఆమె కోల్పోవడంతో.. ఇప్పుడు వీల్‌చెయిర్‌లో కూడా కూర్చునే పరిస్థితికి చేరుకుంది. ఎక్కువ సేపు కూర్చోడానికి కూడా ఆమె శరీరం అనువుగా ఉందని ఆమెకు చికిత్స అందించిన సైఫీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. గతంతో పోలిస్తే చాలా సన్నగా.. సంతోషంగా ఉన్న ఇమాన్ అహ్మద్ అబ్దులాటి వీడియో ఒకదాన్ని ఆస్పత్రి వైద్యులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మూడు నెలల క్రితం కనీసం ఆమె ఎప్పటికైనా కూర్చోగలదా అన్న అనుమానం తమకు ఉండేదని, కానీ ఇప్పుడు వీల్‌చెయిర్‌లో ఎక్కువసేపు కూర్చోగల సామర్థ్యం ఆమెకు వచ్చిందని డాక్టర్ అపర్ణా గోవిల్ తెలిపారు. ఇంతకుముందు కంటే ఆమె చాలా అప్రమత్తంగా ఉంటోందని, క్రమం తప్పకుండా ఆమెకు ఫిజియోథెరపీ కూడా జరుగుతోందని వివరించారు. ఆమెకు ముందునుంచి ఉన్న నరాల సమస్యల గురించే వైద్యులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. మూడేళ్ల క్రితం ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దాని తాలూకు ప్రభావం ఇప్పటికీ ఇమాన్ మీద కనిపిస్తోంది. చదవండి: భారీ కాయాన్ని మోయలేక.. -
భారీ కాయాన్ని మోయలేక..
ఆమె ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళ. ఆమె శరీరం బరువు 500 కిలోలు. ఈ భారీ శరీరంతో కష్టాలు భరించలేక.. బరువు తగ్గించుకునే చికిత్స చేయించుకోడానికి ఇమాన్ అహ్మద్ అబ్దులాటి ముంబైలోని సైఫీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఈజిప్టుకు చెందిన ఈమె తన సోదరితో పాటు అక్కడి విమానయాన సంస్థకు చెందిన ఎయిర్‌బస్ ఫ్రైటర్ విమానంలో వచ్చారు. ఇది సాధారణ ప్రయాణికులు వచ్చేది కాకుండా... కార్గో విమానం కావడం విశేషం. ఆ విమానం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలోని కార్గోసెక్షన్ గేట్ నెం.5 వద్ద తెల్లవారుజామున దిగింది. భారీ పోలీసు భద్రత నడుమ ఆమెను ఒక తాత్కాలిక అంబులెన్సులోకి దించారు. వాస్తవానికి అది ఒక ఓపెన్ టాప్ టెంపో. దానికి మూడువైపులా వస్త్రంతో కప్పి, లోపల ఇమాన్, ఆమె సోదరి, నలుగురు వైద్యులు కూర్చున్నారు. కార్గో విమానం నుంచి ఆమెను దించడానికి 40 నిమిషాల సమయం పట్టింది. ఆమె చికిత్సకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు సైఫీ ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.జె. బాపాయ్ తెలిపారు. ఈజిప్టు కాన్సులేట్ జనరల్ అహ్మద్ ఖలీ కూడా విమానాశ్రయం నుంచి ఆస్పత్రి వరకు ఆమెతో వచ్చారు. ఆస్పత్రి వద్ద కూడా పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆమె భద్రత కోసం ట్రక్కును సాధారణ వేగంతో కాకుండా నెమ్మదిగా తీసుకొచ్చారు. ఆమెను చూసేందుకు ఆస్పత్రి వద్దకు భారీ సంఖ్యలో జనం గుమిగూడారు. ఆస్పత్రి మొదటి అంతస్తులో ఉన్న ప్రత్యేకమైన గదిలోకి ఆమెను తీసుకెళ్లేందుకు కూడా ఏర్పాట్లు భారీగానే చేయాల్సి వచ్చింది. పేషెంటు బెడ్‌కు గట్టి తాళ్లను కట్టి, క్రేన్ సాయంతో ఆ బెడ్‌ను మొదటి అంతస్తు వరకు తీసుకెళ్లారు. సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీద నుంచి ప్రజలు ఈ మొత్తం తతంగాన్ని ఆసక్తిగా గమనించారు. రాబోయే ఆరు నెలల పాటు ఇమాన్ ఇక్కడే ఉంటారు. డాక్టర్ లక్డావాలా ఆమెకు శస్త్రచికిత్స చేసి తదుపరి జాగ్రత్తలు కూడా పర్యవేక్షిస్తారు.