డాక్టర్ మోసం చేశారు.. లావాటి మహిళ కోలుకోలేదు!!
ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళకు తాము చికిత్స చేశామని, ఆమె సగానికి సగం తగ్గిపోయిందని.. అన్ని రకాల సమస్యల నుంచి కూడా కోలుకుంటోందని ముంబై వైద్యులు చెప్పిన విషయాన్ని ఆమె చెల్లెలు ఖండించింది. ముంబై సైఫీ ఆస్పత్రికి చెందిన డాక్టర్ ముఫజల్ లక్డావాలా తమను మోసం చేశారని తెలిపింది. ఇమాన్ అహ్మద్ అబ్దులాటి ఆరోగ్యం గురించి డాక్టర్ లక్డావాలా చెబుతున్నదంతా అబద్ధమని, తన అక్క అసలు కోలుకోలేదని ఆరోపించింది. డాక్టర్ లక్డావాలా అబద్ధాలకోరు అని, తన అక్క కొంచెం కూడా బాగుపడలేదని ఇమాన్ సోదరి సైమా చెప్పింది.
కానీ డాక్టర్ లక్డావాలా మాత్రం సైమా ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇమాన్ బ్రహ్మాండంగా ఉందని, ఆమె నరాల పరిస్థితిని అంచనా వేయడానికి ఒక సీటీస్కాన్ చేయాల్సి ఉందని అన్నారు. ఆర్థిక కారణాల వల్ల తన అక్కను తిరిగి ఈజిప్టు తీసుకెళ్లలేకపోవడం వల్లనే సైమా ఇప్పుడు లేనిపోని సీన్ క్రియేట్ చేస్తోందని చెప్పారు. సైమా కూడా మొదటి 15 రోజులు బాగానే ఉందని, కానీ ఆమె అక్క కోలుకుందని, ఇక ఈజిప్టు తీసుకెళ్లచ్చని చెప్పినప్పటినుంచే గొడవ చేస్తోందని అన్నారు. వార్డు నుంచి ఇమాన్‌ను సీటీస్కాన్ రూంకు తీసుకెళ్లే సమయంలో సైమా చెప్పేది ఎంతవరకు నిజమో అందరికీ తెలుస్తుందని కూడా డాక్టర్ తెలిపారు.
వచ్చినప్పుడు 500 కిలోలకు పైగా బరువున్న ఇమాన్ అహ్మద్.. సైఫీ ఆస్పత్రిలో సర్జరీ తర్వాత 250 కిలోల వరకు తగ్గారు. ఆమె ఇంత త్వరగా అంత తగ్గుతారని తాము కూడా అనుకోలేదని, ఆరునెలల్లో 200 కిలోల వరకు తగ్గొచ్చని భావించామని ఆస్పత్రిలోని ఒబెసిటీ సర్జన్ డాక్టర్ లక్డావాలా అన్నారు. బరువు తగ్గడం వల్ల ఆమె ఆరోగ్యం ఆచలా బాగుపడిందని, గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు అన్నీ బాగా పనిచేస్తున్నాయని వివరించారు. సరిగా ఫిజియోథెరపీ చేయించుకుని, నడవాలనుకుంటే ఆమె తన సొంత ప్రయత్నం కూడా చాలా చేయాలన్నారు. ఆమె 200 కిలోల కంటే తక్కువ బరువుకు వచ్చిన తర్వాత బరువు చూస్తామని తెలిపారు.