dr lakdawala
-
డాక్టర్ మోసం చేశారు.. లావాటి మహిళ కోలుకోలేదు!!
ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళకు తాము చికిత్స చేశామని, ఆమె సగానికి సగం తగ్గిపోయిందని.. అన్ని రకాల సమస్యల నుంచి కూడా కోలుకుంటోందని ముంబై వైద్యులు చెప్పిన విషయాన్ని ఆమె చెల్లెలు ఖండించింది. ముంబై సైఫీ ఆస్పత్రికి చెందిన డాక్టర్ ముఫజల్ లక్డావాలా తమను మోసం చేశారని తెలిపింది. ఇమాన్ అహ్మద్ అబ్దులాటి ఆరోగ్యం గురించి డాక్టర్ లక్డావాలా చెబుతున్నదంతా అబద్ధమని, తన అక్క అసలు కోలుకోలేదని ఆరోపించింది. డాక్టర్ లక్డావాలా అబద్ధాలకోరు అని, తన అక్క కొంచెం కూడా బాగుపడలేదని ఇమాన్ సోదరి సైమా చెప్పింది. కానీ డాక్టర్ లక్డావాలా మాత్రం సైమా ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇమాన్ బ్రహ్మాండంగా ఉందని, ఆమె నరాల పరిస్థితిని అంచనా వేయడానికి ఒక సీటీస్కాన్ చేయాల్సి ఉందని అన్నారు. ఆర్థిక కారణాల వల్ల తన అక్కను తిరిగి ఈజిప్టు తీసుకెళ్లలేకపోవడం వల్లనే సైమా ఇప్పుడు లేనిపోని సీన్ క్రియేట్ చేస్తోందని చెప్పారు. సైమా కూడా మొదటి 15 రోజులు బాగానే ఉందని, కానీ ఆమె అక్క కోలుకుందని, ఇక ఈజిప్టు తీసుకెళ్లచ్చని చెప్పినప్పటినుంచే గొడవ చేస్తోందని అన్నారు. వార్డు నుంచి ఇమాన్‌ను సీటీస్కాన్ రూంకు తీసుకెళ్లే సమయంలో సైమా చెప్పేది ఎంతవరకు నిజమో అందరికీ తెలుస్తుందని కూడా డాక్టర్ తెలిపారు. వచ్చినప్పుడు 500 కిలోలకు పైగా బరువున్న ఇమాన్ అహ్మద్.. సైఫీ ఆస్పత్రిలో సర్జరీ తర్వాత 250 కిలోల వరకు తగ్గారు. ఆమె ఇంత త్వరగా అంత తగ్గుతారని తాము కూడా అనుకోలేదని, ఆరునెలల్లో 200 కిలోల వరకు తగ్గొచ్చని భావించామని ఆస్పత్రిలోని ఒబెసిటీ సర్జన్ డాక్టర్ లక్డావాలా అన్నారు. బరువు తగ్గడం వల్ల ఆమె ఆరోగ్యం ఆచలా బాగుపడిందని, గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు అన్నీ బాగా పనిచేస్తున్నాయని వివరించారు. సరిగా ఫిజియోథెరపీ చేయించుకుని, నడవాలనుకుంటే ఆమె తన సొంత ప్రయత్నం కూడా చాలా చేయాలన్నారు. ఆమె 200 కిలోల కంటే తక్కువ బరువుకు వచ్చిన తర్వాత బరువు చూస్తామని తెలిపారు. -
సగం బరువు తగ్గిపోయింది!
ఎక్కడో ఈజిప్టు దేశానికి చెందిన ఇమాన్ అహ్మద్ అబ్దులాటి.. తన బరువు తగ్గించుకోవాలని ముంబై వచ్చింది. అది కూడా ఏదో సాధారణ ప్రయాణికులు ప్రయాణించే విమానంలో కాదు, ఒక కార్గో విమానంలో. ఆస్పత్రిలో పై అంతస్తుకు తీసుకెళ్లడానికి కూడా ఆమెను ఒక క్రేన్ సాయంతో మోసుకుని వెళ్లాల్సి వచ్చింది. అలాంటిది ఇప్పుడామె బరువు సరిగ్గా సగానికి సగం తగ్గిపోయింది. వచ్చేటప్పుడు దాదాపు 500 కిలోల బరువున్న ఆమె ఇప్పుడు దాదాపు 242 కిలోలు తగ్గిందని ఆమెకు చికిత్స చేస్తున్న ప్రముఖ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ ముఫజల్ లక్డావాలా తెలిపారు. దాదాపు 20 ఏళ్ల నుంచి ఆమె ఇంటి నుంచి బయటకు కాలు పెట్టలేదు. మళ్లీ ఆమెను తన సొంత కాళ్ల మీద నడిపించాలన్నదే తమ లక్ష్యమని లక్డావాలా అంటున్నారు. ఫిబ్రవరి 11వ తేదీన ముంబైలో దిగే సమయానికి ఇమాన్ బరువు సరిగ్గా 490 కిలోలు. తొలుత కేవలం ద్రవాహారం, ఫిజియోథెరపీ ఇవ్వడంతో వచ్చిన కొన్ని రోజుల్లోనే దాదాపు వంద కిలోల వరకు తగ్గింది. మార్చి 7వ తేదీన ఆమెకు లాప్రోస్కోపిక్ స్లీవ్ గాస్ట్రెక్టమీ (ఆమె తీసుకునే ఆహారాన్ని తగ్గించడానికి ఉదరభాగంలో 75 శాతం వరకు తీసేయడం) చికిత్స చేశారు. దాంతో మార్చి 29 నాటికి ఆమె బరువు 340 కిలోలకు తగ్గింది. కేవలం 13 రోజుల్లోనే మళ్లీ 98 కిలోలు తగ్గడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచిందని వైద్యులు తెలిపారు. దాదాపు ఏడాదిన్నర సమయంలో ఆమె 150 కిలోలు తగ్గుతుందని వైద్యులంతా అనుకున్నారు. అయితే అనుకున్నదాని కంటే వేగంగా బరువు తగ్గడం వల్ల ఆమె ఆరోగ్యం కూడా గణనీయంగా మెరుగుపడింది. ఆమె గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు అన్నీ సాధారణ స్థితికి చేరుకున్నాయి. అయితే కుడివైపు మాత్రం ఇంకా కదల్లేకపోవడం, మూడేళ్ల క్రితం వచ్చిన బ్రెయిన్ స్ట్రోక్ ఫలితంగా అప్పుడప్పుడు మూర్ఛ రావడం లాంటి సమస్యలున్నాయి.