భారీ కాయాన్ని మోయలేక..
భారీ కాయాన్ని మోయలేక..
Published Sat, Feb 11 2017 9:35 AM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM
ఆమె ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళ. ఆమె శరీరం బరువు 500 కిలోలు. ఈ భారీ శరీరంతో కష్టాలు భరించలేక.. బరువు తగ్గించుకునే చికిత్స చేయించుకోడానికి ఇమాన్ అహ్మద్ అబ్దులాటి ముంబైలోని సైఫీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఈజిప్టుకు చెందిన ఈమె తన సోదరితో పాటు అక్కడి విమానయాన సంస్థకు చెందిన ఎయిర్‌బస్ ఫ్రైటర్ విమానంలో వచ్చారు. ఇది సాధారణ ప్రయాణికులు వచ్చేది కాకుండా... కార్గో విమానం కావడం విశేషం. ఆ విమానం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలోని కార్గోసెక్షన్ గేట్ నెం.5 వద్ద తెల్లవారుజామున దిగింది. భారీ పోలీసు భద్రత నడుమ ఆమెను ఒక తాత్కాలిక అంబులెన్సులోకి దించారు. వాస్తవానికి అది ఒక ఓపెన్ టాప్ టెంపో. దానికి మూడువైపులా వస్త్రంతో కప్పి, లోపల ఇమాన్, ఆమె సోదరి, నలుగురు వైద్యులు కూర్చున్నారు. కార్గో విమానం నుంచి ఆమెను దించడానికి 40 నిమిషాల సమయం పట్టింది.
ఆమె చికిత్సకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు సైఫీ ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.జె. బాపాయ్ తెలిపారు. ఈజిప్టు కాన్సులేట్ జనరల్ అహ్మద్ ఖలీ కూడా విమానాశ్రయం నుంచి ఆస్పత్రి వరకు ఆమెతో వచ్చారు. ఆస్పత్రి వద్ద కూడా పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆమె భద్రత కోసం ట్రక్కును సాధారణ వేగంతో కాకుండా నెమ్మదిగా తీసుకొచ్చారు. ఆమెను చూసేందుకు ఆస్పత్రి వద్దకు భారీ సంఖ్యలో జనం గుమిగూడారు.
ఆస్పత్రి మొదటి అంతస్తులో ఉన్న ప్రత్యేకమైన గదిలోకి ఆమెను తీసుకెళ్లేందుకు కూడా ఏర్పాట్లు భారీగానే చేయాల్సి వచ్చింది. పేషెంటు బెడ్‌కు గట్టి తాళ్లను కట్టి, క్రేన్ సాయంతో ఆ బెడ్‌ను మొదటి అంతస్తు వరకు తీసుకెళ్లారు. సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీద నుంచి ప్రజలు ఈ మొత్తం తతంగాన్ని ఆసక్తిగా గమనించారు. రాబోయే ఆరు నెలల పాటు ఇమాన్ ఇక్కడే ఉంటారు. డాక్టర్ లక్డావాలా ఆమెకు శస్త్రచికిత్స చేసి తదుపరి జాగ్రత్తలు కూడా పర్యవేక్షిస్తారు.
Advertisement
Advertisement