heaviest woman
-
500 కిలోల నుంచి 176కు బరువు తగ్గింది
ముంబై: అత్యధిక బరువుతో బాధపడుతున్న ఈజిప్ట్ మహిళ ఎమాన్ అహ్మద్‌ను త్వరలోనే యూఏఈలోని అబుదాబి ఆస్పత్రికి మార్చనున్నారు. ముంబైలోని సైఫీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె భారీగా బరువు తగ్గినట్టు వైద్యులు తెలిపారు. గతేడాది సెప్టెంబర్ 23న ఎమాన్ 500 కిలోల బరువు ఉండగా, ఇప్పుడు (శుక్రవారం) 176.6 కిలోలకు తగ్గినట్టు వైద్యులు చెప్పారు. ఆమెను ప్రత్యేకంగా కార్గో విమానంలో ముంబైకు తీసుకురాగా, ఇప్పుడు రెగ్యులర్ విమానంలో బిజినెస్ క్లాస్‌లో వెళ్లవచ్చని తెలిపారు. ఇక్కడ ఆమెకు చికిత్స పూర్తయ్యిందని, యూఏఈలోని బుర్జీల్ ఆస్పత్రికి తరలించనున్నట్టు సైఫీ ఆస్పత్రి వైద్యులు చెప్పారు. మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి దీపక్ సావంత్ ఆస్పత్రికి వచ్చి ఎమాన్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ వివరాలను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు తెలియజేశారు. ఎమాన్ సోదరిపై కేసు: తమపై తప్పుడు ఆరోపణలు చేయడంతో పాటు చికిత్స విషయంలో జోక్యం చేసుకుంటోందంటూ ఎమాన్ సోదరి షైమా సెమిల్పై సైఫీ ఆస్పత్రి వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్యులకు సమాచారం ఇవ్వకుండా ఆమె ఎమాన్‌కు మంచినీళ్లు ఇచ్చారని వైద్యులు చెప్పారు. ఎమాన్ నేరుగా మంచి నీళ్లు తాగలేరని, ఆమెకు ట్యూబ్ ద్వారా అందించాలని వైద్యులు వివరించారు. కాగా ఎమాన్‌కు దాహం వేయడంతో తాను నీళ్లు ఇచ్చానని, వైద్యులు పోలీసులను పిలిపించారని, పరాయి దేశంలో తమకు తెలిసినవాళ్లు ఎవరూ లేరని, ఆమె బాగోగులు తానే చూసుకోవాలని షైమా చెప్పింది. -
సగం బరువు తగ్గిపోయింది!
ఎక్కడో ఈజిప్టు దేశానికి చెందిన ఇమాన్ అహ్మద్ అబ్దులాటి.. తన బరువు తగ్గించుకోవాలని ముంబై వచ్చింది. అది కూడా ఏదో సాధారణ ప్రయాణికులు ప్రయాణించే విమానంలో కాదు, ఒక కార్గో విమానంలో. ఆస్పత్రిలో పై అంతస్తుకు తీసుకెళ్లడానికి కూడా ఆమెను ఒక క్రేన్ సాయంతో మోసుకుని వెళ్లాల్సి వచ్చింది. అలాంటిది ఇప్పుడామె బరువు సరిగ్గా సగానికి సగం తగ్గిపోయింది. వచ్చేటప్పుడు దాదాపు 500 కిలోల బరువున్న ఆమె ఇప్పుడు దాదాపు 242 కిలోలు తగ్గిందని ఆమెకు చికిత్స చేస్తున్న ప్రముఖ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ ముఫజల్ లక్డావాలా తెలిపారు. దాదాపు 20 ఏళ్ల నుంచి ఆమె ఇంటి నుంచి బయటకు కాలు పెట్టలేదు. మళ్లీ ఆమెను తన సొంత కాళ్ల మీద నడిపించాలన్నదే తమ లక్ష్యమని లక్డావాలా అంటున్నారు. ఫిబ్రవరి 11వ తేదీన ముంబైలో దిగే సమయానికి ఇమాన్ బరువు సరిగ్గా 490 కిలోలు. తొలుత కేవలం ద్రవాహారం, ఫిజియోథెరపీ ఇవ్వడంతో వచ్చిన కొన్ని రోజుల్లోనే దాదాపు వంద కిలోల వరకు తగ్గింది. మార్చి 7వ తేదీన ఆమెకు లాప్రోస్కోపిక్ స్లీవ్ గాస్ట్రెక్టమీ (ఆమె తీసుకునే ఆహారాన్ని తగ్గించడానికి ఉదరభాగంలో 75 శాతం వరకు తీసేయడం) చికిత్స చేశారు. దాంతో మార్చి 29 నాటికి ఆమె బరువు 340 కిలోలకు తగ్గింది. కేవలం 13 రోజుల్లోనే మళ్లీ 98 కిలోలు తగ్గడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచిందని వైద్యులు తెలిపారు. దాదాపు ఏడాదిన్నర సమయంలో ఆమె 150 కిలోలు తగ్గుతుందని వైద్యులంతా అనుకున్నారు. అయితే అనుకున్నదాని కంటే వేగంగా బరువు తగ్గడం వల్ల ఆమె ఆరోగ్యం కూడా గణనీయంగా మెరుగుపడింది. ఆమె గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు అన్నీ సాధారణ స్థితికి చేరుకున్నాయి. అయితే కుడివైపు మాత్రం ఇంకా కదల్లేకపోవడం, మూడేళ్ల క్రితం వచ్చిన బ్రెయిన్ స్ట్రోక్ ఫలితంగా అప్పుడప్పుడు మూర్ఛ రావడం లాంటి సమస్యలున్నాయి. -
భారీ కాయాన్ని మోయలేక..
ఆమె ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళ. ఆమె శరీరం బరువు 500 కిలోలు. ఈ భారీ శరీరంతో కష్టాలు భరించలేక.. బరువు తగ్గించుకునే చికిత్స చేయించుకోడానికి ఇమాన్ అహ్మద్ అబ్దులాటి ముంబైలోని సైఫీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఈజిప్టుకు చెందిన ఈమె తన సోదరితో పాటు అక్కడి విమానయాన సంస్థకు చెందిన ఎయిర్‌బస్ ఫ్రైటర్ విమానంలో వచ్చారు. ఇది సాధారణ ప్రయాణికులు వచ్చేది కాకుండా... కార్గో విమానం కావడం విశేషం. ఆ విమానం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలోని కార్గోసెక్షన్ గేట్ నెం.5 వద్ద తెల్లవారుజామున దిగింది. భారీ పోలీసు భద్రత నడుమ ఆమెను ఒక తాత్కాలిక అంబులెన్సులోకి దించారు. వాస్తవానికి అది ఒక ఓపెన్ టాప్ టెంపో. దానికి మూడువైపులా వస్త్రంతో కప్పి, లోపల ఇమాన్, ఆమె సోదరి, నలుగురు వైద్యులు కూర్చున్నారు. కార్గో విమానం నుంచి ఆమెను దించడానికి 40 నిమిషాల సమయం పట్టింది. ఆమె చికిత్సకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు సైఫీ ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.జె. బాపాయ్ తెలిపారు. ఈజిప్టు కాన్సులేట్ జనరల్ అహ్మద్ ఖలీ కూడా విమానాశ్రయం నుంచి ఆస్పత్రి వరకు ఆమెతో వచ్చారు. ఆస్పత్రి వద్ద కూడా పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆమె భద్రత కోసం ట్రక్కును సాధారణ వేగంతో కాకుండా నెమ్మదిగా తీసుకొచ్చారు. ఆమెను చూసేందుకు ఆస్పత్రి వద్దకు భారీ సంఖ్యలో జనం గుమిగూడారు. ఆస్పత్రి మొదటి అంతస్తులో ఉన్న ప్రత్యేకమైన గదిలోకి ఆమెను తీసుకెళ్లేందుకు కూడా ఏర్పాట్లు భారీగానే చేయాల్సి వచ్చింది. పేషెంటు బెడ్‌కు గట్టి తాళ్లను కట్టి, క్రేన్ సాయంతో ఆ బెడ్‌ను మొదటి అంతస్తు వరకు తీసుకెళ్లారు. సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీద నుంచి ప్రజలు ఈ మొత్తం తతంగాన్ని ఆసక్తిగా గమనించారు. రాబోయే ఆరు నెలల పాటు ఇమాన్ ఇక్కడే ఉంటారు. డాక్టర్ లక్డావాలా ఆమెకు శస్త్రచికిత్స చేసి తదుపరి జాగ్రత్తలు కూడా పర్యవేక్షిస్తారు.