500 కిలోల నుంచి 176కు బరువు తగ్గింది
ముంబై: అత్యధిక బరువుతో బాధపడుతున్న ఈజిప్ట్ మహిళ ఎమాన్ అహ్మద్‌ను త్వరలోనే యూఏఈలోని అబుదాబి ఆస్పత్రికి మార్చనున్నారు. ముంబైలోని సైఫీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె భారీగా బరువు తగ్గినట్టు వైద్యులు తెలిపారు. గతేడాది సెప్టెంబర్ 23న ఎమాన్ 500 కిలోల బరువు ఉండగా, ఇప్పుడు (శుక్రవారం) 176.6 కిలోలకు తగ్గినట్టు వైద్యులు చెప్పారు. ఆమెను ప్రత్యేకంగా కార్గో విమానంలో ముంబైకు తీసుకురాగా, ఇప్పుడు రెగ్యులర్ విమానంలో బిజినెస్ క్లాస్‌లో వెళ్లవచ్చని తెలిపారు. ఇక్కడ ఆమెకు చికిత్స పూర్తయ్యిందని, యూఏఈలోని బుర్జీల్ ఆస్పత్రికి తరలించనున్నట్టు సైఫీ ఆస్పత్రి వైద్యులు చెప్పారు. మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి దీపక్ సావంత్ ఆస్పత్రికి వచ్చి ఎమాన్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ వివరాలను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు తెలియజేశారు.
ఎమాన్ సోదరిపై కేసు: తమపై తప్పుడు ఆరోపణలు చేయడంతో పాటు చికిత్స విషయంలో జోక్యం చేసుకుంటోందంటూ ఎమాన్ సోదరి షైమా సెమిల్‌పై సైఫీ ఆస్పత్రి వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్యులకు సమాచారం ఇవ్వకుండా ఆమె ఎమాన్‌కు మంచినీళ్లు ఇచ్చారని వైద్యులు చెప్పారు. ఎమాన్ నేరుగా మంచి నీళ్లు తాగలేరని, ఆమెకు ట్యూబ్ ద్వారా అందించాలని వైద్యులు వివరించారు. కాగా ఎమాన్‌కు దాహం వేయడంతో తాను నీళ్లు ఇచ్చానని, వైద్యులు పోలీసులను పిలిపించారని, పరాయి దేశంలో తమకు తెలిసినవాళ్లు ఎవరూ లేరని, ఆమె బాగోగులు తానే చూసుకోవాలని షైమా చెప్పింది.