saifee hospital
-
భారత్‌లోనే ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవి!
-
భారత్‌లోనే ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవి!
సాక్షి, ముంబై : ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళగా పేరొందిన ఎమాన్ అహ్మద్ చనిపోవడంపై ముంబైలో ఆమెకు చికిత్స అందించిన వైద్యులు స్పందించారు. ఎమాన్‌ను భారత్ నుంచి అబుదాబికి తీసుకెళ్లడమే ఆమె మృతికి కారణమైందని బేరియాట్రిక్ సర్జన్ అపర్ణా గోవిల్ భాస్కర్ ఆరోపించారు. ఆరోగ్యం పూర్తిగా కోలుకుని మామూలు మనిషి అయ్యేవరకూ ఎమాన్‌ను ఇక్కడే ఉంచి ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పినా కుటుంబసభ్యులు మమ్మల్ని నమ్మలేదని చెప్పారు. ఎమాన్ చనిపోవడాన్ని సైఫీ ఆస్పత్రి వైద్యులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. 20 మంది డాక్టర్ల బృందం ఎమాన్‌కు మెరుగైన సేవలు అందించినా చివరివరకూ ఇక్కడే ఉండకపోవడం ఎమాన్ ప్రాణాల్ని బలితీసుకుందన్నారు. ఈజిప్టు, భారత్, గల్ఫ్ ఎమిరేట్స్ దేశాల్లో అధిక బరువుకు చికిత్స తీసుకున్న ఎమాన్ నిన్న (సోమవారం) అబుదాబిలోని బుర్జీల్ ఆస్పత్రిలో చనిపోయారు. అధిక బరువుతో సతమతమవుతున్న 37 ఏళ్ల ఎమాన్.. గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీలు పనిచేయకపోవడం వంటి సమస్యలు ఆమె మృతికి ప్రధాన కారణాలయ్యాయి. ట్రీట్మెంట్ కోసం గత ఫిబ్రవరిలో ఈజిప్ట్ నుంచి ముంబైకి వచ్చిన ఆమె బేరియాట్రిక్ సర్జరీతో దాదాపు 330 కిలోల బరువు తగ్గారు. చికిత్స పూర్తికాకముందే ఆమె సోదరి షైమా సెలీమ్ మే నెలలో యూఏఈకి తీసుకెళ్లారు. చికిత్స పొందుతున్న ఎమాన్ దురృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయి వార్తల్లో నిలిచారు. ఈజిప్టులోని అలెగ్జాండ్రి యాలో మంగళవారం ఎమాన్‌కు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఎమాన్ మృతితో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. -
మొన్న క్రేన్.. ఇప్పుడు వీల్ చెయిర్!
ఆమె వయసు కేవలం 36 సంవత్సరాలు.. బరువు మాత్రం 500 కిలోలకు పైమాటే. ఆ భారీ శరీరంతో కష్టాలు భరించలేక.. బరువు తగ్గించుకునే చికిత్స చేయించుకోడానికి ఇమాన్ అహ్మద్ అబ్దులాటి ఫిబ్రవరి రెండో వారంలో ముంబైలోని సైఫీ ఆస్పత్రిలో చేరారు. ఈజిప్టుకు చెందిన ఈమెను అక్కడి నుంచి సాధారణ విమానంలో తీసుకురావడం సాధ్యం కాకపోవడంతో.. కార్గో విమానంలో తెచ్చారు. అక్కడినుంచి టెంపోలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి మొదటి అంతస్తుకు ఆమెను మామూలుగా తీసుకెళ్లడం సాధ్యం కాకపోవడంతో.. పేషెంటు బెడ్‌కు గట్టి తాళ్లను కట్టి, భారీ క్రేన్ సాయంతో ఆ బెడ్‌ను మొదటి అంతస్తు వరకు తీసుకెళ్లారు. ఇదంతా రెండు నెలల క్రితం మాట. ఇప్పుడు ఆమె బరువు బాగా తగ్గిపోయింది. దాదాపు సగానికి పైగా బరువును ఆమె కోల్పోవడంతో.. ఇప్పుడు వీల్‌చెయిర్‌లో కూడా కూర్చునే పరిస్థితికి చేరుకుంది. ఎక్కువ సేపు కూర్చోడానికి కూడా ఆమె శరీరం అనువుగా ఉందని ఆమెకు చికిత్స అందించిన సైఫీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. గతంతో పోలిస్తే చాలా సన్నగా.. సంతోషంగా ఉన్న ఇమాన్ అహ్మద్ అబ్దులాటి వీడియో ఒకదాన్ని ఆస్పత్రి వైద్యులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మూడు నెలల క్రితం కనీసం ఆమె ఎప్పటికైనా కూర్చోగలదా అన్న అనుమానం తమకు ఉండేదని, కానీ ఇప్పుడు వీల్‌చెయిర్‌లో ఎక్కువసేపు కూర్చోగల సామర్థ్యం ఆమెకు వచ్చిందని డాక్టర్ అపర్ణా గోవిల్ తెలిపారు. ఇంతకుముందు కంటే ఆమె చాలా అప్రమత్తంగా ఉంటోందని, క్రమం తప్పకుండా ఆమెకు ఫిజియోథెరపీ కూడా జరుగుతోందని వివరించారు. ఆమెకు ముందునుంచి ఉన్న నరాల సమస్యల గురించే వైద్యులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. మూడేళ్ల క్రితం ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దాని తాలూకు ప్రభావం ఇప్పటికీ ఇమాన్ మీద కనిపిస్తోంది. చదవండి: భారీ కాయాన్ని మోయలేక.. -
చాలా ఏళ్ల తర్వాత చేతులు కదిలించింది!
ముంబై: ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళగా గుర్తింపు పొందిన ఈజిప్టుకు చెందిన ఇమాన్ అహ్మద్(36)కు ముంబై వైద్యులు అందిస్తున్న వైద్యం మంచి ఫలితాన్ని ఇస్తోంది. ఆమె బరువు తగ్గించేందుకు ముంబైలోని సైఫీ ఆస్పత్రి డాక్టర్లు చేస్తున్న ప్రయత్నాలు సజావుగా సాగుతున్నాయి. మూడు వారాల్లో 108 కిలోల బరువు తగ్గిన ఇమాన్ అహ్మద్ మరో ఇప్పుడు తన చేతులను కూడా కదిలించగిలిగింది. తన చేతులను పైకి లేపి ముఖాన్ని పట్టుకోగలిగిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు తన వైద్యం అందిస్తున్న బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ ముఫజల్ లక్డావాలాకు గాల్లో ముద్దులు విసిరిందని తెలిపాయి. ఆహార నియమాలు కచ్చితంగా పాటించడంతో పాటు ఆమెతో ప్రతిరోజు ఫిజియోథెరపీ చేయిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. వచ్చే రెండు వారాల్లో మెదడు సిటీ స్కాన్ తీస్తామని వెల్లడించారు. ఆమె 150 కిలోలకుపైగా తగ్గిందని, ఇప్పుడు ఆమె బరువు 340 కిలోలని డాక్టర్లు చెప్పారు. ఫిజియోధెరపీకి ఆమె స్పందిస్తోందని, చాలా ఏళ్ల తర్వాత మొదటిసారి ఆమె తన ముఖాన్ని చేతులతో అందుకోగలిగిందని తెలిపారు. మరికొన్ని రోజుల్లోనే ఇమాన్ అహ్మద్ బరువు తగ్గి ఇంటికి వెళుతుందన్న ఆశాభావాన్ని వైద్యులు వ్యక్తం చేశారు. -
మూడు వారాల్లో 108 కిలోలు తగ్గింది!
ఆమె ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళ. పేరు ఇమాన్ అహ్మద్. తన శరీర బరువు తానే మోసుకోలేకపోవడంతో.. దాన్ని తగ్గించుకోవాలని ఎక్కడో ఇరాన్ నుంచి ప్రత్యేకంగా కార్గో విమానంలో బయల్దేరి మరీ ముంబైలోని సైఫీ ఆస్పత్రిలో వాలింది. ఆమె ఇక్కడికొచ్చి మూడు వారాలు అయ్యిందో లేదో.. అప్పుడే 108 కిలోల బరువు తగ్గిపోయింది!! దాంతో ఇప్పుడు 380 కిలోలకు వచ్చింది. గత పాతికేళ్లలో ఆమె బరువు తగ్గడం ఇదే మొదటిసారి. ఇక ఆమె లేచి తనంతట తానుగా నిలబడటమే మిగిలింది. ఇప్పుడు ఆమె శస్త్రచికిత్సకు సిద్ధం అవుతుండంటంతో.. అది కూడా పెద్ద కష్టం కాబోదని ముంబై వైద్యులు అంటున్నారు. వాస్తవానికి వైద్యుల అంచనా ప్రకారం ఆమె 25 రోజుల్లో 50 కిలోలు తగ్గాలి. అందుకు రోజుకు రెండు కిలోల చొప్పున తగ్గించాలనుకున్నారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆమె ఏకంగా వంద కిలోలకు పైగా తగ్గిపోయిందని ఆస్పత్రి బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ ముఫజల్ లక్డావాలా చెప్పారు. ఆమె శరీర బరువులో దాదాపు వంద కిలోల వరకు నీరే ఉంది. ప్రతిరోజూ ఫిజియోథెరపీ, ద్రవాహారం మాత్రమే తీసుకోవడం ద్వారా ఆమె తన శరీరంలో అదనంగా ఉన్న నీటిని తొలగించుకుని, ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీకి సిద్ధమయ్యారు. త్వరలోనే సర్జరీ చేస్తామని డాక్టర్ ముఫజల్ చెప్పారు. తాము మందుల ద్వారానే చాలావరకు బరువును తగ్గించాలని అనుకున్నామని, కానీ ఇప్పుడు మందుల వల్ల ఉపయోగం ఏమీ ఉండదని అన్నారు. మిగిలిన లక్ష్యాన్ని సర్జరీ ద్వారా మాత్రమే చేరుకోగలమని వివరించారు. ముందుగా ఆమెకు స్లీవ్ బేరియాట్రిక్ సర్జరీ చేస్తారు. ఆ తర్వాత ఆమెను అలెగ్జాండ్రియాకు పంపి, అక్కడ కొంతకాలం పరిశీలనలో ఉంచి ఆ తర్వాత మళ్లీ ఇక్కడకు తీసుకొచ్చి తదుపరి చికిత్సలు చేస్తారు. ఇమాన్ అహ్మద్‌కు చికిత్స కోసం విరాళాల ద్వారా ముంబై ఆస్పత్రి వర్గాలు రూ. 60 లక్షలు సేకరించాయి. -
భారీ కాయాన్ని మోయలేక..
ఆమె ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళ. ఆమె శరీరం బరువు 500 కిలోలు. ఈ భారీ శరీరంతో కష్టాలు భరించలేక.. బరువు తగ్గించుకునే చికిత్స చేయించుకోడానికి ఇమాన్ అహ్మద్ అబ్దులాటి ముంబైలోని సైఫీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఈజిప్టుకు చెందిన ఈమె తన సోదరితో పాటు అక్కడి విమానయాన సంస్థకు చెందిన ఎయిర్‌బస్ ఫ్రైటర్ విమానంలో వచ్చారు. ఇది సాధారణ ప్రయాణికులు వచ్చేది కాకుండా... కార్గో విమానం కావడం విశేషం. ఆ విమానం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలోని కార్గోసెక్షన్ గేట్ నెం.5 వద్ద తెల్లవారుజామున దిగింది. భారీ పోలీసు భద్రత నడుమ ఆమెను ఒక తాత్కాలిక అంబులెన్సులోకి దించారు. వాస్తవానికి అది ఒక ఓపెన్ టాప్ టెంపో. దానికి మూడువైపులా వస్త్రంతో కప్పి, లోపల ఇమాన్, ఆమె సోదరి, నలుగురు వైద్యులు కూర్చున్నారు. కార్గో విమానం నుంచి ఆమెను దించడానికి 40 నిమిషాల సమయం పట్టింది. ఆమె చికిత్సకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు సైఫీ ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.జె. బాపాయ్ తెలిపారు. ఈజిప్టు కాన్సులేట్ జనరల్ అహ్మద్ ఖలీ కూడా విమానాశ్రయం నుంచి ఆస్పత్రి వరకు ఆమెతో వచ్చారు. ఆస్పత్రి వద్ద కూడా పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆమె భద్రత కోసం ట్రక్కును సాధారణ వేగంతో కాకుండా నెమ్మదిగా తీసుకొచ్చారు. ఆమెను చూసేందుకు ఆస్పత్రి వద్దకు భారీ సంఖ్యలో జనం గుమిగూడారు. ఆస్పత్రి మొదటి అంతస్తులో ఉన్న ప్రత్యేకమైన గదిలోకి ఆమెను తీసుకెళ్లేందుకు కూడా ఏర్పాట్లు భారీగానే చేయాల్సి వచ్చింది. పేషెంటు బెడ్‌కు గట్టి తాళ్లను కట్టి, క్రేన్ సాయంతో ఆ బెడ్‌ను మొదటి అంతస్తు వరకు తీసుకెళ్లారు. సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీద నుంచి ప్రజలు ఈ మొత్తం తతంగాన్ని ఆసక్తిగా గమనించారు. రాబోయే ఆరు నెలల పాటు ఇమాన్ ఇక్కడే ఉంటారు. డాక్టర్ లక్డావాలా ఆమెకు శస్త్రచికిత్స చేసి తదుపరి జాగ్రత్తలు కూడా పర్యవేక్షిస్తారు.