సాక్షి, ముంబై : ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళగా పేరొందిన ఎమాన్ అహ్మద్ చనిపోవడంపై ముంబైలో ఆమెకు చికిత్స అందించిన వైద్యులు స్పందించారు. ఎమాన్‌ను భారత్ నుంచి అబుదాబికి తీసుకెళ్లడమే ఆమె మృతికి కారణమైందని బేరియాట్రిక్ సర్జన్ అపర్ణా గోవిల్ భాస్కర్ ఆరోపించారు. ఆరోగ్యం పూర్తిగా కోలుకుని మామూలు మనిషి అయ్యేవరకూ ఎమాన్‌ను ఇక్కడే ఉంచి ట్రీట్‌మెంట్ ఇప్పించాలని చెప్పినా కుటుంబసభ్యులు మమ్మల్ని నమ్మలేదని చెప్పారు. ఎమాన్ చనిపోవడాన్ని సైఫీ ఆస్పత్రి వైద్యులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. 20 మంది డాక్టర్ల బృందం ఎమాన్‌కు మెరుగైన సేవలు అందించినా చివరివరకూ ఇక్కడే ఉండకపోవడం ఎమాన్ ప్రాణాల్ని బలితీసుకుందన్నారు.
ఈజిప్టు, భారత్, గల్ఫ్ ఎమిరేట్స్ దేశాల్లో అధిక బరువుకు చికిత్స తీసుకున్న ఎమాన్ నిన్న (సోమవారం) అబుదాబిలోని బుర్జీల్ ఆస్పత్రిలో చనిపోయారు. అధిక బరువుతో సతమతమవుతున్న 37 ఏళ్ల ఎమాన్.. గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీలు పనిచేయకపోవడం వంటి సమస్యలు ఆమె మృతికి ప్రధాన కారణాలయ్యాయి. ట్రీట్‌మెంట్ కోసం గత ఫిబ్రవరిలో ఈజిప్ట్ నుంచి ముంబైకి వచ్చిన ఆమె బేరియాట్రిక్ సర్జరీతో దాదాపు 330 కిలోల బరువు తగ్గారు.
చికిత్స పూర్తికాకముందే ఆమె సోదరి షైమా సెలీమ్ మే నెలలో యూఏఈకి తీసుకెళ్లారు. చికిత్స పొందుతున్న ఎమాన్ దురృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయి వార్తల్లో నిలిచారు. ఈజిప్టులోని అలెగ్జాండ్రి యాలో మంగళవారం ఎమాన్‌కు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఎమాన్ మృతితో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.