చాలా ఏళ్ల తర్వాత చేతులు కదిలించింది!
ముంబై: ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళగా గుర్తింపు పొందిన ఈజిప్టుకు చెందిన ఇమాన్ అహ్మద్(36)కు ముంబై వైద్యులు అందిస్తున్న వైద్యం మంచి ఫలితాన్ని ఇస్తోంది. ఆమె బరువు తగ్గించేందుకు ముంబైలోని సైఫీ ఆస్పత్రి డాక్టర్లు చేస్తున్న ప్రయత్నాలు సజావుగా సాగుతున్నాయి. మూడు వారాల్లో 108 కిలోల బరువు తగ్గిన ఇమాన్ అహ్మద్ మరో ఇప్పుడు తన చేతులను కూడా కదిలించగిలిగింది. తన చేతులను పైకి లేపి ముఖాన్ని పట్టుకోగలిగిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు తన వైద్యం అందిస్తున్న బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ ముఫజల్ లక్డావాలాకు గాల్లో ముద్దులు విసిరిందని తెలిపాయి.
ఆహార నియమాలు కచ్చితంగా పాటించడంతో పాటు ఆమెతో ప్రతిరోజు ఫిజియోథెరపీ చేయిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. వచ్చే రెండు వారాల్లో మెదడు సిటీ స్కాన్ తీస్తామని వెల్లడించారు. ఆమె 150 కిలోలకుపైగా తగ్గిందని, ఇప్పుడు ఆమె బరువు 340 కిలోలని డాక్టర్లు చెప్పారు. ఫిజియోధెరపీకి ఆమె స్పందిస్తోందని, చాలా ఏళ్ల తర్వాత మొదటిసారి ఆమె తన ముఖాన్ని చేతులతో అందుకోగలిగిందని తెలిపారు. మరికొన్ని రోజుల్లోనే ఇమాన్ అహ్మద్ బరువు తగ్గి ఇంటికి వెళుతుందన్న ఆశాభావాన్ని వైద్యులు వ్యక్తం చేశారు.