ఇక దుబాయి ఆస్పత్రిలో లావాటి మహిళ
దుబాయి: ముంబయిలో చికిత్స చేయించుకొని వెళ్లిన ఈజిప్టుకు చెందిన స్థూలకాయురాలు ఎమన్ అహ్మద్ అబుదాబిలోని ఆస్పత్రిలో చేరింది. ఈ ఆస్పత్రిలో ఆమెకు ధీర్ఘకాలంపాటు శారీరక, మానసిక వైద్యాన్ని అందించనున్నారు. దాదాపు అరటన్ను బరువుతో ప్రపంచంలోనే అతి లావాటి మహిళగా రికార్డుల్లోకి ఎక్కిన ఎమన్‌ను ఒక సవాల్‌గా తీసుకొని ముంబయి వైద్యులు ప్రత్యేక శ్రద్ధతో ఆమెను ఈజిప్టు నుంచి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
అనంతరం ఆమె సర్జరీ చేసి దాదాపు 323 కిలోల బరువు తగ్గించారు. ప్రస్తుతం ఆమె బరువు 176.6కేజీలు. దీంతో తిరిగి ఆమెను పంపించేశారు. ప్రస్తుతం ఏడాదిపాటు చికిత్స పొందేందుకు ఎమన్ అబుదాబిలోని వీపీఎస్ బుర్జీల్ ఆస్పత్రిలో చేరింది. ఈ సందర్భంగా యాసిన్ శహత్ అనే వైద్యుడు మాట్లాడుతూ తన ప్రయాణం సౌకర్యాంగానే సాగినట్లు ఎమన్ తెలిపిందన్నారు. ఆమె కోసం ప్రత్యేకంగా ఇటలీ నుంచి హైడ్రాలిక స్ట్రెచర్ తీసుకొచ్చామని, 20మంది వైద్యులను ఆమెకు కేటాయించి వైద్యం చేయబోతున్నట్లు ప్రకటించారు.