న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత భారీకాయంతో రికార్డులకు ఎక్కిన ఎమ్మాన్ అహ్మద్ అబూదాబిలోని బుర్జీల్ ఆసుపత్రిలో సోమవారం ఉదయం మృతి చెందారు. తన 37వ బర్త్‌డే వేడుకలను పూర్తి చేసుకున్న వారానికే ఆమె కన్నుమూశారు. ఎమ్మాన్ మృతిని బుర్జీల్ ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. కిడ్నీలు పనిచేయకపోవడం, గుండె సంబంధిత వ్యాధులతో ఆమె బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. వివిధ విభాగాలకు చెందిన 20 మంది నిపుణులైన వైద్యులు ఆమెను నిత్యం పర్యవేక్షించారని బుర్జీల్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ఈజిఫ్టుకు చెందిన ఎమ్మాన్ అహ్మద్ అరుదైన వ్యాధివల్ల శరీరం భారీగా పెరిగిపోయింది. మొదట చికిత్స కోసం ఎమ్మార్ ముంబైలోని సైఫీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో గోడలను బద్దలు కొట్టాల్సి వచ్చింది. అంతేకాక ప్రత్యేక విమానంలో ఆమెను ముంబై తరలించారు. ఆమెను క్రేన్ల సాయంతో సైఫీ ఆసుపత్రి లోని ప్రత్యేక గదికి తరలించారు. కొంతకాలం ముంబైలోని చికిత్స తీసుకున్నారు. అనంతరం ఆమెను అబుదాబిలోని బుర్జీల్ ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా బుర్జీల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఎమ్మాన్ అక్కడే మృతి చెందారు.