తెరపైకి ‘ఎంబ్రాయర్’ స్కాం..
►యూపీఏ హయాంలో కుదిరిన రూ. 14 వేల కోట్ల ఒప్పందం
► విమానాల కొనుగోలులో ముడుపులు: అమెరికా విచారణ సంస్థ
►15 రోజుల్లో వివరాలివ్వండి: ఎంబ్రాయర్‌కు డీఆర్డీవో ఆదేశం
న్యూఢిల్లీ: మొన్నటి వరకు దేశాన్ని కుదిపేసిన అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం మరవక ముందే యూపీఏ హయాంలో జరిగిందని భావిస్తున్న మరో విమాన కుంభకోణం తెరపైకి వచ్చింది. యూపీఏ ప్రభుత్వ పాలనలో బ్రెజిల్ విమాన సంస్థ ఎంబ్రాయర్తో కుదిరిన ఒప్పందంలో అవినీతిపై సమాచారం కోసం కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. 208 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.14వేలకోట్లు) విలువైన ఈ ప్రాజెక్టులో భారీ స్థాయిలో ముడుపులు చేతులు మారాయంటూ అమెరికా న్యాయశాఖ విచారణ జరుపుతోంది.
ప్రపంచవ్యాప్తంగా 8 దేశాల్లో కాంట్రాక్టులు పొందేందుకు ఎంబ్రాయర్ సంస్థ ఆయా ప్రభుత్వాలకు ముడుపులు ముట్టజెప్పిందనే ఆధారాలున్నాయని తెలిపింది. దీనిపై సమాచారం అందుకున్న డీఆర్డీవో (రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ) మరిన్ని వివరాలు అందుకునేందుకు విచారణ జరపనుందని.. భారత రక్షణ శాఖ వెల్లడించింది. 15 రోజుల్లో ఈ కాంట్రాక్టుతోపాటు అవినీతికి సంబంధించిన ఆరోపణలపై పూర్తి సమాచారాన్ని ఇవ్వాలంటూ ఎంబ్రాయర్ విమాన తయారీ సంస్థను డీఆర్డీవో కోరింది. అయితే బ్రెజిల్ సంస్థ నుంచి వచ్చే సమాచారం ఆధారంగా తదుపరి చర్యలుంటాయని రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
బీజేపీ చేతికి మరో అస్త్రం
అగస్టా కుంభకోణంలో మధ్యవర్తి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యులకు ముడుపులందాయని భావిస్తున్న కేసులో ముందు హడావుడిగా విచారణ మొదలైంది. అయితే దీనిపై కాంగ్రెస్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావటం.. దీని ప్రభావం జీఎస్టీకి ఆమోదముద్ర ను ఆలస్యం చేస్తుండటంతో.. కేంద్రం కాస్త వెనక్కు తగ్గింది. ఇప్పుడు కేంద్రం అనుకున్న పనులు పూర్తవటంతోపాటు యూపీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ‘ఎంబ్రాయిర్’పై బీజేపీ దృష్టి పెట్టింది. ‘యూపీఏ హయాంలో జరిగిన ప్రతి డీల్‌లోనూ ఏదో మరక కనబడుతోంది. 2014లో అధికార మార్పిడి తర్వాత గత ప్రభుత్వాల ఒక్కో కేసు బయటపడుతోంది’ అని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
అసలు ‘ఎంబ్రాయర్’ డీల్ ఏంటి?
యూపీఏ హయాంలో 2008లో బ్రెజిల్ సంస్థ ఎంబ్రాయర్, డీఆర్డీవో మధ్య మూడు విమానాలు (స్వదేశీ రాడార్ వ్యవస్థను అనుసంధానం చేసి) కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరింది. మొత్తం రూ. 14వేల కోట్లతో ఒప్పందం కుదిరింది. అయితే ఎంబ్రాయర్ సంస్థ కాంట్రాక్టు దక్కించుకునేందుకు అప్పటి ప్రభుత్వంలో కొందరికి (ఎవరికి అనేది తెలియదు) ముడుపులిచ్చిందని అమెరికా విచారణ సంస్థలు గుర్తించాయి. దీనిపై ఇప్పుడు భారత్ వివరాలు సేకరించే పనిలో పడింది.