జీఎం బేబీస్‌కు బ్రిటన్ అనుమతి
లండన్: తరతరాలుగా జన్యుపరంగా సంక్రమించే జబ్బులను శాశ్వతంగా నివారించేందుకు దోహదపడే విధంగా మానవ పిండాల్లో జన్యుపరమైన మార్పులు, చేర్పుల ప్రక్రియపై పరిశోధనలు చేసేందుకు బ్రిటన్ సోమవారం అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. ఇలాంటి ప్రక్రియపై పరిశోధనలు సాగించేందుకు ప్రపంచంలో అనుమతి మంజూరు చేసిన తొట్టతొలి దేశం బ్రిటన్ కావడం విశేషం.
క్రిమ కీటకాదులు, జంతువుల పిండాలపై శాస్త్రవేత్తలు ఇదివరకే జన్యుపరమైన మార్పులు, చేర్పులు చేశారు. మానవ పిండాలపై ఇలాంటి పరిశోధనలు కొంతకాలం జరిగినా ఏ దేశం కూడా ఇంతవరకు అధికారికంగా ప్రయోగాల ప్రోత్సాహానికి అనుమతించలేదు. ఎందుకంటే ఇలాంటి మార్పులు చేయడం ప్రకృతి విరుద్ధమని, మానవ పిండాల్లో జన్యుపరమైన మార్పులు తీసుకరావడం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుందన్న వాదనలు ఉన్నాయి.
ఇలాంటి జన్యుపరమైన మార్పుల వల్ల జన్యుపరంగా సంక్రమించే జబ్బులను నివారించవచ్చని శాస్త్రవేత్తలే చెబుతున్నప్పటికీ విపరీత పరిణామాలు కూడా ఉంటాయన్నది వారి వాదనే. క్లోనింగ్ ద్వారా ఒకరిని పోలిన మనుషులను ఎంత మందినైనా సృష్టించే అవకాశం ఉండడంతో ఇప్పటికి కూడా మానవ క్లోనింగ్‌ను ఏ దేశం అనుమతించలేదు. అలాగే మానవ పిండాల్లో కూడా జన్యు మార్పులతో తాము కోరుకున్న విధంగా ఆ పిండాలను మానవ రూపాలుగా తీర్చిదిద్దవచ్చని, అదే విపరీత పరిణామాలకు దారితీయవచ్చన్నది శాస్త్రవేత్తల్లో ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ. మంచే ఎక్కువ జరుగుతుందన్నది కొందరి వాదనైతే, చెడే ఎక్కువ జరుగుతుందన్నది మరి కొందరి వాదన. మంచి చెడుల మధ్య సమతుల్యత పాటిస్తూ ఇలాంటి మానవ జన్యు ప్రయోగాలను అనుమతించవచ్చన్నది ఇంకొందరి వాదన.
అలాగే ఇప్పుడు బ్రిటన్ తీసుకున్న నిర్ణయంపై కూడా శాస్త్రవేత్తలు పరస్పర భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అనైతికమని కూడా కొందరు వాదిస్తున్నారు. మానవ పిండాల జన్యు మార్పిడి ప్రయోగాలకు ఫాన్సిస్ క్రిక్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ కేథీ నియాకన్ అనే డాక్టరుకు బ్రిటన్‌కు చెందిన ‘హ్యూమన్ ఫర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియాలోజి అథారిటీ’ షరతులతోని అనుమతి మంజూరు చేసింది. ‘ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ (ఐవీఎఫ్)’ ద్వారా గర్భం పొంది ఆ గర్భం అవసరం లేదనుకొని దానం చేసిన మానవ పిండాలపై మాత్రమే పరిశోధనలు జరపాలని సూచించింది. ఆ ప్రయోగాలను కూడా 14 రోజులకు మించి జరపరాదని, ఆ తార్వత ఆ పిండాలను చంపేయాలని పేర్కొంది.
పిండం ఎదుగుదలలో వచ్చే మార్పులను, మార్పు చేసిన జన్యువుల అభివృద్ధిని అర్థం చేసుకునేందుకు తమకు ప్రస్తుతం ఈ 14 రోజుల కాలవ్యవధి సరిపోతుందని డాక్టర్ కేథీ తెలియజేశారు. పిండంలోని డీఎన్ఏలో మార్పులు, చేర్పులు చేయడానికి ‘క్రిస్పర్-కేస్9’ (సీఆర్ఐఎస్పీఆర్-సీఏఎస్9) సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని ఆయన వివరించారు.
ఈ పరిజ్ఞానాన్ని అమెరికాకు చెందిన కెమిస్ట్రీ ప్రొఫెసర్ జెన్నీఫర్ డౌడ్నా, ఫ్రాన్స్‌కు చెందిన ప్రొఫెసర్ ఎమ్యాన్వెల్లీ కార్పెంటియర్లు కనుగొన్నారు. ఆ ప్రొఫెసర్లు ఇద్దరు ఇప్పుడు బ్రిటన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. తాము కనిపెట్టిన క్రిస్పర్ టెక్నాలజీ రెండు దిక్కుల పదునైన కత్తిలాంటిదని వారు చెబుతున్నారు. మానవ పిండం జన్యుకణాల డీఎన్ఏలో మార్పులు, చేర్పుల చేయడం ద్వారా పుట్టే బిడ్డలను ‘జీఎం బేబీస్’ అని పిలుస్తారు.