emcet leak
-
లీక్‌లో కోదాడ లింక్!
►సీఐడీ అదుపులో వైద్యుడు కోదాడ: ఎంసెట్-2 లీక్‌లో నల్లగొండ జిల్లా కోదాడకు లింక్ ఉన్నట్టు తెలుస్తోంది. శనివారం కోదాడకు చెందిన ఓ వైద్యుడిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తన కుమారుడి కోసం కోదాడకు చెందిన మరో సీనియర్ వైద్యుడి సాయంతో ఈయన ఎంసెట్-2 పేపర్‌ను కొనుగోలు చేసినట్లు తెలిసింది. పోలీసుల అదుపులో ఉన్న నిందితులు సమాచారం ఇవ్వడంతో కోదాడకు వచ్చిన సీఐడీ అధికారులు ఆ వైద్యుడిని ప్రశ్నించి తమతో పాటు తీసుకెళ్లినట్లు తెలిసింది. సీనియర్ వైద్యుడు గత కొన్నేళ్లుగా ఇదే దందాను కొనసాగిస్తూ ఇందులో ఆరితేరినట్లు పుకార్లు వస్తున్నాయి. పేపర్ కొనుగోలులో ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఈయన.. తనకు ఆప్తుడైన కోదాడకు చెందిన ఓ వ్యాపారి మనుమరాలికి కూడా ఎంసెట్-2 పేపర్‌ను అందించినట్లు సమాచారం. కోదాడలోనే చిన్నచిన్న కాంట్రాక్టు పనులు చేసే కాంట్రాక్టర్ కూడా తన కుమార్తె కోసం దళారుల వద్ద ఎంసెట్-2 పేపర్‌ను కొనుగోలు చేసినట్లు తెలిసింది. -
సీబీఐ విచారణ జరిపించాలి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీక్ ఉదంతంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం నేత జాజుల శ్రీనివాస్‌గౌడ్‌లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ లీకేజీ ద్వారా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. దీనిలో ప్రమేయమున్న పెద్ద చేపలను పట్టుకోవాలని వారు గురువారం ఒక ప్రకటనలో సీఎంని కోరారు. -
లీకేజీకి ప్రభుత్వానిదే బాధ్యత: సీపీఎం
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2 పేపర్ లీకేజీకి రాష్ర్ట ప్రభుత్వమే బాధ్యత వహించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలతో చర్చించి తదుపరి చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో కోరారు. లీకేజీలో అధికారుల హస్తమున్నట్లు సీఐడీ ప్రాథమిక విచారణలో తేలినా, ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న పెద్దలకు కూడా దీనిలో భాగముందనే అనుమానాలు బలంగా ఉన్నాయన్నారు.