మెట్రో అత్యవసర వైద్యసేవలు భేష్
న్యూఢిల్లీ: అత్యవసర వైద్య సదుపాయాలు కల్పించడంలోనూ ఢిల్లీ మెట్రో ప్రయాణికుల నుంచి ప్రశంసలందుకుంటోంది. రోజుకు ప్రయాణించే లక్షలాదిమందిలో ఏదో ఒక రైళ్లో, ఎప్పుడో ఒకప్పుడు అస్వస్థతకు గురవుతూనే ఉంటారు. వీరిలో కొందరికి గుండెనొప్పి, కడుపునొప్పి, తీవ్రమైన తలనొప్పి, హైపర్టెన్షన్ వంటి ప్రాణాంతక సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే ఇటువంటివారిని గుర్తించి, వారికి ముందుగా అవసరమైన ప్రథమ చికిత్స చేసి, వెనువెంటనే ఆస్పత్రికి తరలించాల్సి ఉంటుంది. ఈ బాధ్యతలను మెట్రో సిబ్బంది చాలా సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. 2012 నుంచి ఇప్పటిదాకా 1,850 మంది ప్రాణాలను కాపాడారు.
సంబంధిత అధికారి ఒకరు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రయాణికుల్లో ఎవరికి అత్యవసర వైద్య సేవలు అవసరమో ముందుగా గుర్తించాలి. గుర్తించినవారికి ముందుగా ప్రథమ చికిత్సనందించి, ఆస్పత్రికి తరలించాలి. ఇందుకోసం డీఎంఆర్సీ ప్రత్యేకంగా ప్రతి స్టేషన్లో కొంతమందిని నియమించింది. విధుల్లో చేరేముందే వారంరోజులపాటు సిబ్బందికి ప్రత్యేక శిక్షణనిచ్చాం. ఫలితంగా రెండేళ్లలో 100 హృద్రోగుల ప్రాణాలను కాపాడారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయే అత్యవసర పరిస్థితి నుంచి వారిని గట్టెక్కించాం. ఇక ఛాతీనొప్పి, కడుపునొప్పి, పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్న 340 మందికి ప్రథమచికిత్సనందించి, సమీపంలోని ఆస్పత్రులకు తరలించాం.
వికారంతో తీవ్ర అస్వస్థతకు గురైన 105 మందిని, తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న 25 మంది, మూర్చపోయిన 65 మందిని, నిర్జలీకరణనానికి లోనైన మరికొందరిని మెట్రో సిబ్బంది కాపాడారు. ఇలా అత్యవసర వైద్యసహాయం అవసరమైనవారిలో ఎక్కువమంది ఒంటరిగా ప్రయాణం చేస్తున్నవారు కావడంతోనే మెట్రో సిబ్బంది స్పందించాల్సి వచ్చింది. సహాయకులుగా ఉన్నవారు కోరిన వెంటనే వైద్య సదుపాయాన్ని సమకూర్చేందుకు మెట్రో సిబ్బంది ఎప్పుడూ సిద్ధంగా ఉంటార’ని చెప్పారు.