CWG 2022: పతకాల పట్టికలో 56 దేశాలు ఆమె వెనకే..!
బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన 22వ కామన్వెల్త్ క్రీడల్లో ఆస్ట్రేలియా మహిళా స్విమ్మర్ ఎమ్మా మెక్కియోన్ ఓ ప్రత్యేకమైన రికార్డు నెలకొల్పింది. ఈ క్రీడల్లో 6 స్వర్ణాలు గెలిచిన ఎమ్మా.. పతకాల పట్టికలో 56 దేశాల కంటే ఎక్కువ పసిడి పతకాలు సాధించిన అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది. ఈ క్రీడల్లో మొత్తం 72 దేశాలు పాల్గొనగా.. కేవలం 13 దేశాలు మాత్రమే ఎమ్మాతో సమానంగా, అంత కంటే ఎక్కువ పసిడి పతకాలు సాధించాయి.
ఎమ్మా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా 67 స్వర్ణాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలువగా.. ఇంగ్లండ్ (57), కెనడా (26), భారత్ (22), న్యూజిలాండ్ (20), స్కాట్లాండ్ (13), నైజీరియా (12), వేల్స్ (8), సౌతాఫ్రికా (7), మలేషియా (7), నార్త్రన్ ఐర్లాండ్ (7), జమైకా (6), కెన్యా (6) దేశాలు వరుసగా 2 నుంచి 13 స్థానాల్లో నిలిచాయి. ఎమ్మా (6 స్వర్ణాలు సహా 8 పతాకలు) ఈ 13 దేశాల తర్వాత 14వ స్థానంలో నిలిచింది.
కాగా, ఎమ్మా గత మూడు కామన్వెల్త్ క్రీడల్లో ఏకంగా 14 స్వర్ణాలు సాధించి, ఈ క్రీడల చరిత్రలో అత్యధిక స్వర్ణాలు సాధించిన అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 4 పసిడి పతకాలు సాధించిన ఈ బంగారు చేప.. 2024 పారిస్ ఒలింపిక్స్ లక్ష్యంగా దూసుకుపోతుంది.
చదవండి: CWG 2022: ఈ స్వర్ణం కోసం ఎంతో నిరీక్షించాను.. ఎట్టకేలకు: సింధు