emma morano
-
ఒంటరి బామ్మకు 117 ఏళ్లు
రోమ్: ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న వృద్ధురాలిగా రికార్డుల్లోకి ఎక్కిన ఇటలీ బామ్మ ఎమ్మా మొరానో మంగళవారం నాడు 117వ పుట్టిన రోజును జరుపుకున్నారు. ఫియట్ కార్ల తయారీ సంస్థ ఆవిర్భవించిన తొలినాళ్లలో పుట్టిన ఈ బామ్మ మూడు శతాబ్దాలకు ప్రత్యక్ష సాక్షిగా నేడు కూడా ఆరోగ్యంగానే ఉండడం ఓ అద్భుతం. ఈ అద్భుతం వెనకనున్న ఆరోగ్య రహస్యం ఏమిటంటే ఆమె మాత్రం తన భర్తను తన్ని తగలేసి, మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవించడమేనని ముసిముసిగా చెబుతారు. ఆమె ఇంతకాలం జీవించి ఉండడానికి కారణం ఆమె తీసుకుంటున్న డైటేనని ఆమెకు ఎంతో కాలంగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ కార్లో బావో చెప్పారు. ఆమెను తాను కలుసుకునే నాటికి ఆమె రోజు ఉదయం రెండు పచ్చి గుడ్లు తాగేదని, మధ్యాహ్నం ఒక గుడ్డు ఆమ్లెట్ వేసుకొని తినేదని, రాత్రికి చికెన్ తినేదని ఆయన తెలిపారు. యుక్త వయస్సులో ఆమె బలహీనంగా ఉన్నప్పుడు గుడ్లు బాగా తినాలని ఓ డాక్టర్ ఇచ్చిన సలహా మేరకు ఆమె గుడ్లు ఎక్కువ తినడం అలవాటు చేసుకున్నారట అని ఆయన వివరించారు. ఒంటరిగా జీవించడం ఎక్కువ కాలం బతకడానికి ఒక్క కారణం మాత్రమేనని, జన్యువులు, డైట్ కూడా తన ఆరోగ్యానికి దోహదం చేశాయని ఎమ్మా శతాధిక వృద్ధురాలిగా పుట్టిన రోజులు జరుపుకున్న సందర్భంగా వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తెలిపారు. తన తల్లి 91 ఏళ్ల వరకు, తన ఏడుగురు చెల్లెళ్లు వందేళ్లకు పైగా జీవించారని ఎమ్మా పేర్నొన్నారు. 90 ఏళ్ల వరకు పొద్దున రెండు గుడ్లు, మధ్యాహ్నం ఒక్క ఆమ్లెట్, రాత్రికి కూరగాయలు, అప్పుడప్పుడు పళ్లు తింటూ వచ్చానని ఆమె తెలిపారు. ఆ తర్వాత నుంచి రోజు ఉదయం రెండు గుడ్లు, రాత్రికి బిస్కట్లు తింటున్నానని ఆమె చెప్పారు. ఆమె జీవితం గురించి వివిధ పత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం ఎమ్మా మొరానో ఇటలీ పైడ్మాంట్ ప్రాంతంలో 1899, నవంబర్ 29వ తేదీన జన్మించారు ఆమె యుక్త వయసులో ఓ యువకుడిని ప్రేమించారు. అయితే మొదటి ప్రపంచ యుద్ధంలో ఆ యువకుడు మరణించడంతో ఆమె ఇక ఎవరిని ప్రేమించలేకపోయారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకోలేదు. కుటుంబం బలవంతం మీద 27వ ఏట పెళ్లి చేసుకున్నారు. కానీ సంసారం అన్యోన్యంగా సాగలేదు. ఆరునెలల వయస్సులో తన మగశిశువు మరణించడంతో 1938లో భర్తకు విడాకులు ఇచ్చారు. అయితే ఆయన 1978లో చనిపోయే వరకు విడిపోయినా ఎమ్మాతోనే కలసి జీవించారు. 1978 నుంచి ఎమ్మా పూర్తి ఒంటరిగానే జీవిస్తూ వచ్చారు. తనపై ఎవరి పెత్తనాన్ని తాను అంగీకరించనని, అందుకే ఒంటరిగా జీవించినా బాధ పడలేదని ఎమ్మా చెప్పారు. ఇప్పటికీ సొంత ఫ్లాట్‌లోనే నివసిస్తున్న ఆమెకు ఇరుగుపొరుగు వారు ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటారు. మంగళవారం 117 పుట్టిన రోజు సందర్భంగా వారంతా వచ్చి వేడుకను ఉన్నంతలో ఘనంగా జరిపించారు. ఆమె డాక్టర్ కార్లో కూడా అప్పుడప్పుడు వచ్చి యోగక్షేమాలు కనుక్కొని పోతుంటారు. బహూశా ఎమ్మా బామ్మకు మరణం లేకపోవచ్చని డాక్టర్ కార్లో వ్యాఖ్యానించారు. -
పచ్చి గుడ్లు, ఒంటరిగా ఉండటమే నా సీక్రెట్...
న్యూయార్క్: గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిది.. ఇది తరచుగా అందరికీ వైద్యులు చెప్పేమాట. ఇదే మాట 115 ఏళ్ల 3 నెలల యూరప్ బామ్మ చెప్పింది. ఇందులో విశేషమేముంది అనుకుంటున్నారా... పచ్చి గుడ్డు తాగడమే తన అధిక ఆయుష్షుకు కారణమంటుంది. దీంతో పాటు అధికకాలం ఒంటరిగా ఉండటం కూడా తన జీవితకాలాన్ని పెంచిందని యూరోప్ లోనే అధిక వయస్కురాలైన ఇటలీకి చెందిన బామ్మ ఎమ్మా మోరానో చెప్తోంది. ఇంకో విశేషమేమంటే ప్రపంచంలోనే అధిక వయసున్న వారి జాబితాలో ఆమె ఐదో స్థానంలో ఉంది. తాను టీనేజ్ లో ఉన్నప్పుడు ఓ డాక్టర్ గుడ్డు తాగమని ఆరోగ్యానికి మంచిదని ముఖ్యంగా ఎనీమియా తగ్గిస్తుందని సలహా ఇచ్చాడట... అప్పటినుంచి రోజుకు కచ్చితంగా 3 గుడ్లు తీసుకుంటున్నానని బామ్మ తెలిపింది. ఇబ్బందులతో కూడిన తన వైవాహిక జీవితాన్ని 1938లో కూమారుడు చనిపోవడంతోనే వదులుకున్నానని ఆమె తెలిపింది. తనపై వేరొకరు పెత్తనం చేయడం ఇష్టం లేక రెండో పెళ్లి చేసుకోలేదని ఎమ్మా మోరానో అన్నారు. అప్పటి నుంచి వెర్బానియాలో కేవలం రెండు గదుల ఇంట్లో ఉంటున్నానని, కొన్నిసార్లు అనారోగ్యానికి గురయినప్పటికీ ఆసుపత్రిలో కాలుపెట్టడానికి నిరాకరించనన్నారు. ఎమ్మాకు రక్తం మార్పిడి చేయడం, ఇతర చికిత్స నిమిత్తం తానే ఆ ఇంటికి వెళ్లానని డాక్టర్ కార్లొ బవ తెలిపారు. ఆ బామ్మకు 90 ఏళ్లు ఉన్నప్పటి నుంచి ట్రీట్ మెంట్ ఇస్తున్నానని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్ చెప్పడం విశేషం. -
ఆమెకు 115 ఏళ్లు.. అయినా ఒంటరి
ఇటలీ రాచరిక వ్యవస్థ నుంచి రిపబ్లిక్‌గా అవతరించడాన్ని ఆమె కళ్లారా చూశారు. ఏడు దశాబ్దాల కాలంలో దాదాపు 70 ప్రభుత్వాలు మారడాన్నీ చూశారు. చరిత్రలో నెత్తుటి మరకల్ని తప్ప మరేమీ మిగ ల్చని ఫాసిజం పెను భూతానికి ఆమె సాక్షీభూతం. రెండు ప్రపంచ యుద్ధాలు సృష్టించిన భయానక పరిస్థితుల్లోనూ ఆమె జీవించారు. ఇప్పటీకీ ఆమె జీవించే ఉన్నారు. ఆమే.. ఎమ్మా మొరానో. ఆమె వయస్సు సరిగ్గా 115 ఏళ్ల, మూడు నెలలు. ఇటలీలో, ఆ మాటకొస్తే మొత్తం యూరప్‌లోనే అత్యధిక వయస్సుగల శతాధిక వృద్ధురాలు.ఎమ్మా మొరానోలో ఇప్పటికీ చెదరని నగుమోము చూస్తుంటే, బతుకు పట్ల ఆమెకు గల ప్రేమ, అమితమైన ఆత్మ విశ్వాసం మనకు కనిపిస్తోంది. ఇంతటి ఆరోగ్యానికి కారణం ఏమిటని ఆమెను ప్రశ్నిస్తే. చిన్నప్పటి నుంచి ఇప్పటికీ రోజుకు మూడు పచ్చి కోడిగుడ్లు తినడమేనని సమాధానం చెబుతోంది. మొరానోకు 115 ఏళ్లంటే ఆమెకు గంపెడంత మంది పిల్లలు, మనవళ్లు, ముని మనవళ్లు, వారికి పిల్లలు, ఆ పిల్లలకు పిల్లలు ఇలా వంశవృక్షం ఓ ఊరంతా పెరిగిపోయి ఉండవచ్చనే ఆలోచనలు కలుగుతాయి. కానీ ఆమె ఒంటరిది. వరసకు మేన కోడలు మినహా ప్రస్తుతం ఎవరూ లేరు. ఇటలీలోని సివియాస్కో గ్రామంలో జన్మించిన మొరానోకు 1938లో ఓ మగ శిశువు జన్మించి చనిపోయాడు. ఈ విషయంలో భర్తతో గొడవలు రావడంతో ఆదే సంవత్సరంలో ఆమె భర్తను వదిలేశారు. తర్వాత చాలా అందంగా ఉండే ఆమెవెంట ఎంతో మంది యువకులు తిరిగినా, ఎవరినీ కనికరించలేదు. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయారట. 'నేను ఎవరి ఆధిపత్యాన్ని అంగీకరించను అందుకే పెళ్లి చేసుకోలేదు. ఒంటరిగా బతకటానికే ఇష్టపడ్డాను' అని ఆమె ఇప్పటికీ చెబుతారు. మూడు గదుల ఇంటిలో ఒంటరిగా ఉండే మొరానోకు మేనకోడలు వరుసైన ఓ స్థానిక స్కూల్ టీచర్ ప్రస్తుతం ఆమెకు అవసరమైన సూప్, గుడ్లతో కూడిన ఆహారం, ఓ అరటి పండు తెచ్చి ఇస్తారట. అనారోగ్యానికి గురైనప్పుడు ఆస్పత్రికి వెళ్లడం ఆమెకు అసలు ఇష్టం ఉండదు. ఆ సమయంలో ఇరుగు పొరుగు వచ్చి సహాయం చేస్తారు. ఎప్పటి నుంచో తెల్సిన డాక్టర్ వచ్చి వైద్యం చేస్తారు. ఆమె 110వ పుట్టిన రోజు చేసుకున్నప్పుడు మొత్తం ప్రపంచానికి ఆమె గురించి తెలిసిపోయింది. అప్పటినుంచి వైద్యరంగానికి చెందిన నిపుణులు, మీడియా ప్రతినిధులు ఆమె ఇంటికి వస్తూ పోతున్నారు. అంతకాలం ఆరోగ్యంగా మొరానో బతకడానికిగల కారణాలపై ఎవరి విళ్లేషణలు వారు ఇచ్చారు. రోజు మూడు కోడి గుడ్లు తినటమే ఆమె ఆరోగ్య రహస్యమని కొందరు చెప్పగా, ఆమెలోని జన్యువులే అందుకు కారణమని, ఆమె సోదరి ఒకరు 102 ఏళ్లు, మరో సోదరి 92 ఏళ్లు జీవించడమే అందుకు ఉదాహరణని వైద్య నిపుణలు పేర్కొన్నారు. ఆమె మళ్లీ పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటించడమే ఆమె దీర్ఘాయువుకు అసలు కారణమని కొంత మంది సామాజిక కార్యకర్తలు విశ్లేషించారు.