ఆమెకు 115 ఏళ్లు.. అయినా ఒంటరి
ఇటలీ రాచరిక వ్యవస్థ నుంచి రిపబ్లిక్‌గా అవతరించడాన్ని ఆమె కళ్లారా చూశారు. ఏడు దశాబ్దాల కాలంలో దాదాపు 70 ప్రభుత్వాలు మారడాన్నీ చూశారు. చరిత్రలో నెత్తుటి మరకల్ని తప్ప మరేమీ మిగ ల్చని ఫాసిజం పెను భూతానికి ఆమె సాక్షీభూతం. రెండు ప్రపంచ యుద్ధాలు సృష్టించిన భయానక పరిస్థితుల్లోనూ ఆమె జీవించారు. ఇప్పటీకీ ఆమె జీవించే ఉన్నారు. ఆమే.. ఎమ్మా మొరానో. ఆమె వయస్సు సరిగ్గా 115 ఏళ్ల, మూడు నెలలు. ఇటలీలో, ఆ మాటకొస్తే మొత్తం యూరప్‌లోనే అత్యధిక వయస్సుగల శతాధిక వృద్ధురాలు.ఎమ్మా మొరానోలో ఇప్పటికీ చెదరని నగుమోము చూస్తుంటే, బతుకు పట్ల ఆమెకు గల ప్రేమ, అమితమైన ఆత్మ విశ్వాసం మనకు కనిపిస్తోంది. ఇంతటి ఆరోగ్యానికి కారణం ఏమిటని ఆమెను ప్రశ్నిస్తే. చిన్నప్పటి నుంచి ఇప్పటికీ రోజుకు మూడు పచ్చి కోడిగుడ్లు తినడమేనని సమాధానం చెబుతోంది.
మొరానోకు 115 ఏళ్లంటే ఆమెకు గంపెడంత మంది పిల్లలు, మనవళ్లు, ముని మనవళ్లు, వారికి పిల్లలు, ఆ పిల్లలకు పిల్లలు ఇలా వంశవృక్షం ఓ ఊరంతా పెరిగిపోయి ఉండవచ్చనే ఆలోచనలు కలుగుతాయి. కానీ ఆమె ఒంటరిది. వరసకు మేన కోడలు మినహా ప్రస్తుతం ఎవరూ లేరు. ఇటలీలోని సివియాస్కో గ్రామంలో జన్మించిన మొరానోకు 1938లో ఓ మగ శిశువు జన్మించి చనిపోయాడు. ఈ విషయంలో భర్తతో గొడవలు రావడంతో ఆదే సంవత్సరంలో ఆమె భర్తను వదిలేశారు. తర్వాత చాలా అందంగా ఉండే ఆమెవెంట ఎంతో మంది యువకులు తిరిగినా, ఎవరినీ కనికరించలేదు. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయారట. 'నేను ఎవరి ఆధిపత్యాన్ని అంగీకరించను అందుకే పెళ్లి చేసుకోలేదు. ఒంటరిగా బతకటానికే ఇష్టపడ్డాను' అని ఆమె ఇప్పటికీ చెబుతారు. మూడు గదుల ఇంటిలో ఒంటరిగా ఉండే మొరానోకు మేనకోడలు వరుసైన ఓ స్థానిక స్కూల్ టీచర్ ప్రస్తుతం ఆమెకు అవసరమైన సూప్, గుడ్లతో కూడిన ఆహారం, ఓ అరటి పండు తెచ్చి ఇస్తారట. అనారోగ్యానికి గురైనప్పుడు ఆస్పత్రికి వెళ్లడం ఆమెకు అసలు ఇష్టం ఉండదు. ఆ సమయంలో ఇరుగు పొరుగు వచ్చి సహాయం చేస్తారు. ఎప్పటి నుంచో తెల్సిన డాక్టర్ వచ్చి వైద్యం చేస్తారు.
ఆమె 110వ పుట్టిన రోజు చేసుకున్నప్పుడు మొత్తం ప్రపంచానికి ఆమె గురించి తెలిసిపోయింది. అప్పటినుంచి వైద్యరంగానికి చెందిన నిపుణులు, మీడియా ప్రతినిధులు ఆమె ఇంటికి వస్తూ పోతున్నారు. అంతకాలం ఆరోగ్యంగా మొరానో బతకడానికిగల కారణాలపై ఎవరి విళ్లేషణలు వారు ఇచ్చారు. రోజు మూడు కోడి గుడ్లు తినటమే ఆమె ఆరోగ్య రహస్యమని కొందరు చెప్పగా, ఆమెలోని జన్యువులే అందుకు కారణమని, ఆమె సోదరి ఒకరు 102 ఏళ్లు, మరో సోదరి 92 ఏళ్లు జీవించడమే అందుకు ఉదాహరణని వైద్య నిపుణలు పేర్కొన్నారు. ఆమె మళ్లీ పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటించడమే ఆమె దీర్ఘాయువుకు అసలు కారణమని కొంత మంది సామాజిక కార్యకర్తలు విశ్లేషించారు.