2019 కల్లా భావ విప్లవం: గద్దర్
నకిరేకల్: ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడేళ్లు గడిచినా ప్రజల జీవనశైలిలో ఎలాంటి మార్పులు రాలేదు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు ఎలా ఉందో నేడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది.. 2019 వరకు తెలంగాణలో ఒక మహత్తరమైన భావ విప్లవాన్ని తీసుకువస్తాం’ అని ప్రజాయుద్ధ నౌక గద్దర్ అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్‌తో కలసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం పాలకపక్షానికి, ప్రతిపక్షానికి ఏమీ తేడా లేకుండా ఉందన్నారు.
ప్రజావ్యతిరేకంగా పాలన సాగుతున్నందున తెలంగాణలో ప్రత్నామ్నాయ శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. ‘పల్లెపల్లెకు పాట – పార్లమెంట్‌కు బాట’ అనే నినాదంతో ప్రజలను చైతన్యం చేసేందుకు తెలంగాణలోని అన్ని శక్తులు ఏకమై ముందుకు సాగుతామన్నారు. చెరుకు సుధాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఇంటి పార్టీ పురుడు పోసుకుందని ఆ పార్టీ తెలంగాణలోని ఇంటింటికీ వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఆ పార్టీ ముందుకు సాగేందుకు తమ మద్దతు ఉంటుందని గద్దర్ పేర్కొన్నారు.