ఎక్సైజ్‌శాఖ ఉద్యోగోన్నతుల్లో వివక్ష
నల్లగొండ : ఎక్సైజ్‌శాఖ కల్పిస్తున్న ఉద్యోగోన్నతుల్లో కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు తీవ్ర వివక్షకు గురవుతున్నారు. ఏళ్ల తరబడి సర్వీసులు ఉన్న వారిని దూరంగా ఉంచి..తక్కువ కాలంలో ఉద్యోగాల్లో చేరిన ఎల్డీసీలకు ఎస్ఐ, సీఐలుగా ఉద్యోగోన్నతులు కల్పిస్తుండడం పట్ల కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగోన్నతులకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో అమలుచేసిన విధానాలకు స్వస్తి చెప్పి తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరిగేలా మార్గదర్శకాల్లో మార్పులు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్నవారు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇస్తుంటారు. అలా వారు కానిస్టేబుల్‌గా కాకుండా ఎల్డీసీలుగా చేరుతున్నారు. ఉమ్మడి రాష్ట్రం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం ఎస్ఐ, సీఐ పోస్టుల్లో 50శాతం పోస్టులను నేరుగా రిక్రూట్ చేస్తున్నారు. మిగతా 50శాతం పోస్టులు ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు.
దీనిలో ఎల్డీసీ కోటా 30శాతం, కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లకు 20 శాతం పోస్టులను కేటాయిస్తారు. వాస్తవానికి దీనికంటే ముందున్న జీఓ ప్రకారం అయితే ఎల్డీసీలకు, కానిస్టేబుళ్లకు అందరికీ ఉద్యోగోన్నతుల్లో సమన్యాయం జరిగింది. కానిస్టేబుల్ నుంచి హెడ్‌కానిస్టేబుల్..ఆ తర్వాత ఎస్ఐగా ఉద్యోగోన్నతి వచ్చేది. కానీ కమిషనర్‌స్థాయిలోనే మార్గదర్శకాల్లో మార్పులు చేయడం వల్ల ప్రస్తుతం ఉద్యోగోన్నతుల్లో ఎల్డీసీలు లబ్ధిపొందుతున్నారు తప్ప, కానిస్టేబుళ్లకు సకాలంలో ఉద్యోగోన్నతి లభించడం లేదు. పలు సందర్భాల్లో ఉద్యోగోన్నతి పొందకుండానే హెడ్‌కానిస్టేబుళ్లు పదవీ విరమణ పొందుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కావాలని కొందరు ఈ జీఓ తెచ్చి తమను నిర్లక్ష్యం చేస్తున్నారని కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎల్డీసీలదే పైచేయి..
జిల్లాలో ఇప్పటివరకు చేపట్టిన ఉద్యోగోన్నతుల్లో ఎల్డీసీలు ఎక్కువశాతం లబ్ధిపొందారు. నల్లగొండ ఈఎస్ కార్యాలయంలో పనిచేస్తున్న ఎల్డీసీల్లో ఇద్దరు ఎస్ఐలుగా ప్రమోషన్ పొంది హుజూర్నగర్, సూర్యాపేటలో విధులు నిర్వర్తిస్తున్నారు. మరో ఎల్డీసీ సీఐగా ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు. అదే కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్ల విషయానికొస్తే 23 ఏళ్లనుంచి సర్వీసులో ఉన్నవారికి ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషనూ లభించలేదు.
వివక్షపై ఉద్యమిస్తాం : సీహెచ్.శంకరయ్య, హెడ్‌కానిస్టేబుల్, నల్లగొండ
ఏపీ ఎక్సైజ్ కమిషనర్ ఆఫీసులో ఉద్యోగులు ఏకమై దొంగ జీఓ తీసి కానిస్టేబుళ్లకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఎల్డీసీ నుంచి వచ్చిన వారికి మాత్రమే ఎస్ఐగా ఉద్యోగోన్నతి కల్పిస్తున్నారు. పోలీస్, అగ్నిమాపక, అటవీ శాఖల్లో ఎక్కడా కూడా ఈ విధానం అమల్లో లేదు. ఉద్యోగోన్నతుల్లో మా వాటా దక్కించుకునేందుకు త్వరలో ఉద్యమబాట పట్టాలని నిర్ణయించాం.