డీఈఓ కార్యాలయాలకు తరలిన ఉద్యోగులు
విద్యారణ్యపురి : హన్మకొండలోని డీఈఓ కార్యాలయం నుంచి మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల విద్యాశాఖ అధికారి కార్యాలయాలకు కేటాయించిన పలువురు ఉద్యోగులు శుక్రవారం తరలివెళ్లారు. వారు ఆయా రెండు డీఈఓ కార్యాలయాలకు కేటాయించిన ఫర్నిచర్, ఫైళ్లు, బీరువాలు, కంప్యూటర్లు తీసుకొని వెళ్లారు. డీఈఓ కార్యాలయం, సర్వశిక్షాభియాన్ కార్యాలయంలోని ఉద్యోగులను కలిపి సీనియార్టీ ప్రకారం నూతన జిల్లాలకు ఇప్పటికే కేటాయించారు. ఈనెల 11వ తేదీ దసరా రోజున కార్యాలయాల్లో ఉద్యోగులు విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని, అందువల్ల నూతన జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో అన్నీ సర్దుకునేందుకు ముందుగానే తరలివెళ్లారు. జనగామ జిల్లాకు ఒకటి రెండు రోజుల్లో ఉద్యోగులు, ఫైళ్లు, వస్తుసామగ్రిని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జనగామ ఎమ్మార్సీ భవనంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే అది సరిపోదని వేరేచోట చూడాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది.