అక్కడ కొందరిదే పెత్తనం!
శ్రీకాకుళం:చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరతతో పనులు సజావుగా సాగడం లేదు. ఖర్చు తగ్గింపు పేరుతో ప్రభుత్వం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇంటికి పంపేస్తోంది. మిగతా శాఖ మాటేమోగానీ.. ఒక శాఖలో మాత్రం కొందరు రెగ్యులర్ ఉద్యోగులనే ఖాళీగా కూర్చోబెడుతున్నారు. సాధారణంగా ఏ శాఖలోనైనా ఉన్న ఉద్యోగుల సంఖ్యను బట్టి పని విభజన చేసి బాధ్యతలు అప్పగిస్తారు. అదనంగా ఉన్నారని భావిస్తే ప్రభుత్వానికి అప్పగించడమో.. వేరే విభాగానికి పంపడమో జరుగుతుంటుంది. కానీ జిల్లా పంచాయతీ కార్యాలయంలో సుమారు 8 మంది ఉద్యోగులకు ఏ పనులూ అప్పగించకుండా ఖాళీగా ఉంచేస్తున్నారు.
దీంతో వారు రోజూ కార్యాలయానికి వచ్చి హాజరు పట్టీలో సంతకాలు చేసి సొంత పనులు చూసుకుంటున్నారు. గత రెండుమూడేళ్లుగా జరుగుతున్న ఈ వ్యవహారం వెనుక పెద్ద కథే ఉందన్న ఆరోపణలు ఆ శాఖ ఉద్యోగుల నుంచే వినిపిస్తున్నాయి. సుమారు మూడేళ్లపాటు పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన నడిచిన విషయం తెలిసిందే. స్పెషల్ ఆఫీసర్లు ఇతర బాధ్యతలు కూడా ఉండటంతో నిధుల మంజూరు, పనుల ఖరారు వంటి ‘కీలక’ వ్యవహారాలన్నీ జిల్లా పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలోనే జరిగేవి. వీటన్నింటినీ కేవలం నమ్మకస్తులైన ముగ్గురు నలుగురు ఉద్యోగులే చక్కబెట్టేవారు.
మిగతా ఉద్యోగులకు అప్పగిస్తే తమ మాట వినరేమో.. చెప్పినట్లు చేయరేమోనన్న అనుమానంతోపాటు తమ వ్యవహారాలు తెలిసిపోతాయన్న భయంతో మిగతా ఏడెనిమిది మంది ఉద్యోగులకు పనులు అప్పగిచంకపోవడంతో వారు గోళ్లు గిల్లుకోవాల్సి వస్తోంది. వీటన్నింటి వెనకు ఒక ‘సీనియర్’ చక్రం తిప్పుతున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. చివరికి ఈ విషయంలో ఉద్యోగుల మధ్య మనస్పర్థలు ప్రారంభమయ్యాయి. చినికిచినికి గాలివాన అయినట్లు పరస్పరం రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసుకునే స్థాయికి పెరిగాయి. దీంతో ఉలిక్కిపడిన జిల్లా అధికారులు సిబ్బందికి నచ్చజెప్పే పనిలో పడ్డారు. కార్యాలయంలో ఇటువంటి పరిస్థితి రావడానికి ఓ చిరు ఉద్యోగే కారణమని బాధిత ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈయన చెప్పిందే అందరికీ వేదమైందని వాపోతున్నారు.
లెక్కతేలని ఎన్నికల ఖర్చు
గత ఏడాది జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇప్పటికీ ఓ కొలిక్కిరాలేదు. దీనిపైనా పరస్పర విరుద్ధమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ఉద్యోగులు కావాలనే తమ వద్దనున్న వివరాలను ఇవ్వకుండా జాప్యం చేస్తున్నట్లు ఓ వర్గం ఉద్యోగులు ఆరోపిస్తుండగా.. ఇందులో వాస్తవం లేదని ఖర్చును ఎక్కువగా చూపించేందుకు ఎప్పటికప్పుడు బిల్లులను మారుస్తూ వస్తున్నారని ఇంకోవర్గం ఉద్యోగులు చెబుతున్నారు. ఇందులో ఎవరిది వాస్తవమన్నది అటుంచితే జిల్లాకు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు విడుదలైన రూ.4.8 కోట్ల లెక్కలను ఓ కొలిక్కి తెచ్చేందుకు ఇటీవల బదిలీ అయిన ఓ ఉన్నతాధికారి వద్దకు కొన్ని ఫైళ్లతో ఓ ఉద్యోగి వెళ్లి సంతకాలు చేయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
అన్నీ సక్రమంగానే..:డీపీవో
ఈ విషయాలను జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా.. ఇద్దరు ఉద్యోగులు అనారోగ్యంతో ఉండటం వల్ల ఒకటి రెండు నెలలు మాత్రం బాధ్యతలు అప్పజెప్పలేదని బదులిచ్చారు. వారిని అవసరం మేరకు ఏదో ఒక పనికోసం వినియోగించుకున్నామని తెలిపారు. ఎన్నికల ఖర్చుల నివేదిక ఎప్పుడో సిద్ధమైందన్నారు. ఇటీవల బదిలీ అయిన కలెక్టర్ జిల్లాలో తన హయాంలో జరిగిన కొన్ని కార్యక్రమాల వివరాలు, కరపత్రాలు అడిగారని వాటిని ఈ-మెయిల్ ద్వారా పంపించామే తప్ప ఉద్యోగిని పంపించలేదని, ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు.