ఆశపై అశనిపాతం
♦ పోస్టుల్లేకుంటే ఉద్వాసనే
♦ త్రిశంకు స్వర్గంలో కాంట్రాక్టు లెక్చరర్లు
♦ కొంపముంచిన మంజూరీ పోస్టుల నిబంధన
♦ ఎనిమిదేళ్లుగా కొత్త కాలేజీలకు పోస్టులివ్వని ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ తాజా ఉత్తర్వు కాంట్రాక్టు ఉద్యోగుల్లో కలవరం సృష్టిస్తోంది. ఉద్యోగాల క్రమబద్ధీకరణ ప్రక్రియపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యే ప్రమాదం పొంచి ఉంది. కొత్త కాలేజీల్లో పనిచేస్తున్నవారి పాలిట అశనిపాతంగా మారనుంది. దాదాపు 632 మంది కాంట్రాక్టు లెక్చరర్లు వీధినపడే ప్రమాదముంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో అమల్లో ఉన్న ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్(రెగ్యులరైజేషన్ టు అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ పాటర్న్ అండ్ పే స్ట్రక్చర్) యాక్ట్ 1994ను తెలంగాణకు వర్తింపజేస్తూ ప్రభుత్వం (జీవో నం.16) ఉత్తర్వులు జారీ చేసింది.
దీనికి అనుగుణంగా రాష్ట్ర ఆర్థిక శాఖ 2014 జూన్ 2 నాటికి ప్రభుత్వశాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల జాబితాను కోరింది. రెండు వారాల్లోగా ఈ జాబితాలను పంపాలని ఈ నెల 4న అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సూచించారు. మంజూరైన పోస్టుల్లో కాంట్రాక్టు పద్ధతిన నియమితులైనవారు, మంజూరు పోస్టుల్లో నెలనెలా వేతనాలు పొందినవారిని మాత్రమే అర్హులుగా పరిగణించాలన్నది ప్రభుత్వ ఉత్తర్వు సారాంశం. దాని ఆధారంగా అన్ని శాఖలు కాంట్రాక్టు ఉద్యోగుల జాబితాలను సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంజూరు కాని పోస్టుల్లో ఏళ్లకొద్దీ పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు నష్టపోయే పరిస్థితి తలెత్తింది. ప్రధానంగా కొత్త కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు ఈ నిబంధన ముప్పు తెచ్చిపెట్టింది.
2008లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం 79 కొత్త జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేసింది. వీటిలో 11 కాలేజీలకు మాత్రమే పోస్టులు మంజూరు చేసింది. మిగతా 68 కాలేజీల్లో దాదాపు 632 మంది కాంట్రాక్టు లెక్చరర్లు ఈ కాలేజీల్లో పనిచేస్తున్నారు. వీరందరూ తాజా ఉత్తర్వులతో డీలాపడ్డారు. మరోవైపు 2012లో ఐదేళ్లు వరుసగా ఒకే కాలేజీలో పని చేసినవారిని ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో అప్పటి వరకు మంజూరీ పోస్టుల్లో ఉన్న కొందరు కాంట్రాక్టు లెక్చరర్లు కొత్త కాలేజీలకు బదిలీ అయ్యారు. వీరందరూ మంజూరీ పోస్టుల నిబంధనతో నష్టపోయే పరిస్థితి తలెత్తింది. కొత్త కాలేజీల్లో పోస్టులు మంజూరు చేయకపోవటం తమ తప్పేలా అవుతుందని, ప్రభుత్వం ఈ నిబంధనపై పునరాలోచించి తమకు న్యాయం చేయాలని కాంట్రాక్టు లెక్చరర్లు కోరుతున్నారు.