Employment of staff
-
భానుడి కర్ఫ్యూ
ఆదిలాబాద్ అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : భానుడు భగ్గుమంటున్నాడు. జిల్లా అగ్నిగుండంలా మారింది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. దాదాపు పది రోజుల నుంచి గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక జిల్లా లో శుక్రవారం 43.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జనం బయటకు రావడానికి జంకుతున్నారు. ఉపాధి కూలీలు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర పనులపై వెళ్లేవారు ఉదయాన్నే వెళ్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మళ్లీ సాయంత్రం ఆరు తర్వాత రహదారులు ప్రజలతో కిక్కిరిసిపోతున్నాయి. వడదెబ్బతో రెండు నెలల కాలంలో ఇప్పటివరకు దాదాపు 30 మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఇందులో ఉపాధి కూలీలే 11 మంది వరకు ఉన్నారు. వాతావరణంలో తేమశాతం అధికంగా ఉండటంతో ఉక్కపోత ఉంటుంది. ఊపిరితీస్తున్న ‘ఉపాధి’ ఉపాధి పనుల వద్ద కనీస వసతులు లేకపోవడంతో కూలీలు వడదెబ్బకు గురై మృత్యువాత పడుతున్నారు. మంచినీరు, సేదతీరడానికి టెంటు, అస్వస్థతకు గురైతే ప్రాథమిక చికిత్స కోసం కిట్టు కూడా లేవు. కూలీల పిల్లలు పని ప్రదేశంలో ఆడుకునేందుకు, వారి ఆలనా పాలన చూసుకునేందుకు ఆయాలను నియమించాలి. ఇందులో ఏ ఒక్కటి కూడా అమలు కావడం లేదు. కూలీలు వడదెబ్బకు గురై మృతిచెందుతుండటంతో వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఉపాధి హామీ సిబ్బంది సంబంధిత నివేదికలను సకాలంలో అందజేసి బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సి ఉండగా వారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండటంతో బాధితులకు పరిహారం అందడంలో జాప్యం జరుగుతోంది. -
‘ఉపాధి’లో అక్రమాల వెల్లువ
కోటపల్లి, న్యూస్‌లైన్ : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన ఏడోవిడత సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఉపాధి సిబ్బంది అక్రమాలు బయటపడ్డాయి. ఆరు నెలల్లో చేపట్టిన రూ.1.22 కోట్ల విలువైన పనులపై సామాజిక తనిఖీ బృందాలు చేసిన తనిఖీ వివరాలు వెల్లడించాయి. ప్రజావేదికకు అడిషనల్ పీడీ గణేష్‌జాదవ్, విజిలెన్స్ మేనేజర్ రమేష్‌రెడ్డి, అడిషనల్ పీడీ అంజయ్య, ఏపీడీలు సురేష్, అనిల్‌చౌహాన్ హాజరయ్యారు. స్థానిక ఎస్సార్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తనిఖీ బృందం వివరాలు వెల్లడించింది. షట్పల్లి క్షేత్రసహాయకుడు రాజబాపు మరుగుదొడ్ల నిర్మాణాల్లో అక్రమాలకు పాల్పడ్డాడ ని వెల్లడి కావడంతో ఆయన్ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఏపీడీ చెప్పారు. లబ్ధిదారులకు తెలియకుండా బినామీ పేర్లతో డబ్బులు స్వాహా చేశాడని పేర్కొన్నారు. ఆయన నుంచి రూ.90 వేలు రికవరీ చేయనున్నట్లు వివరించారు. కొండంపేట గ్రామపంచాయతీలో రూ.20 వేల నిధులు దుర్వినియోగమయ్యాయని, రికవరీకి ఆదేశాలిచ్చామని తెలిపారు. రికార్డుల నిర్వహణ సరిగా లేనందుకు 12 మంది ఎఫ్‌ఏలకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించామన్నారు. వీటితోపాటు పింఛన్ల పంపిణీలో అక్రమాలు బయటపడగా నిధుల రికవరీకి ఆదేశాలు జారీ చేశారు. ఆయా గ్రామపంచాయతీలకు సంబంధించిన తనిఖీ వివరాలను డీఆర్పీలు చదివి వినిపించారు. ప్రజావేదికలో ఎంపీడీవో శంకరమ్మ, ఏపీవోలు వెంకటేశ్వర్లు, రామ్మోహన్, ఏపీఎం ఉమారాణి, సర్పంచులు దుర్గం మహేష్, విద్యాసాగర్‌గౌడ్, వెంకటస్వామి, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.