ఆదిలాబాద్ అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : భానుడు భగ్గుమంటున్నాడు. జిల్లా అగ్నిగుండంలా మారింది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. దాదాపు పది రోజుల నుంచి గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక జిల్లా లో శుక్రవారం 43.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జనం బయటకు రావడానికి జంకుతున్నారు. ఉపాధి కూలీలు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర పనులపై వెళ్లేవారు ఉదయాన్నే వెళ్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మళ్లీ సాయంత్రం ఆరు తర్వాత రహదారులు ప్రజలతో కిక్కిరిసిపోతున్నాయి. వడదెబ్బతో రెండు నెలల కాలంలో ఇప్పటివరకు దాదాపు 30 మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఇందులో ఉపాధి కూలీలే 11 మంది వరకు ఉన్నారు. వాతావరణంలో
తేమశాతం అధికంగా ఉండటంతో ఉక్కపోత ఉంటుంది.
ఊపిరితీస్తున్న ‘ఉపాధి’
ఉపాధి పనుల వద్ద కనీస వసతులు లేకపోవడంతో కూలీలు వడదెబ్బకు గురై మృత్యువాత పడుతున్నారు. మంచినీరు, సేదతీరడానికి టెంటు, అస్వస్థతకు గురైతే ప్రాథమిక చికిత్స కోసం కిట్టు కూడా లేవు. కూలీల పిల్లలు పని ప్రదేశంలో ఆడుకునేందుకు, వారి ఆలనా పాలన చూసుకునేందుకు ఆయాలను నియమించాలి. ఇందులో ఏ ఒక్కటి కూడా అమలు కావడం లేదు. కూలీలు వడదెబ్బకు గురై మృతిచెందుతుండటంతో వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఉపాధి హామీ సిబ్బంది సంబంధిత నివేదికలను సకాలంలో అందజేసి బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సి ఉండగా వారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండటంతో బాధితులకు పరిహారం అందడంలో జాప్యం జరుగుతోంది.
భానుడి కర్ఫ్యూ
Published Sat, May 24 2014 2:10 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement