మంచిర్యాలటౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మార్చి మాసంలోనే ఎండలు తీవ్రంగా మండుతుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం 10 గంటలకే ఎండ తీవ్రత పెరిగి పోతుండడంతో బయటకు వెళితే ముచ్చెమటలు పడుతున్నాయి. ఇక వచ్చేది ఏప్రిల్, మే నెలల్లో మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండడంతో, ఎండలపై ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది.
రోజురోజుకూ పెరుగుతున్న ఎండ తీవ్రత నేపథ్యంలో ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పెరగనున్న ఉష్ణోగ్రతలతో వడదెబ్బ బారినపడి చిన్నా,పెద్దా అల్లాడిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అసలు వడదెబ్బ అంటే ఏమిటి? దాని లక్షణాలు... నివారణ మార్గాలు మీ కోసం.
వడదెబ్బ అంటే..
ఎక్కువ ఉష్ణోగ్రతల తాకిడికి గురైతే శరీరంలోని వేడిని నియంత్రించే విధానం విఫలమై ప్రాణాపా య పరిస్థితి ఏర్పడడాన్ని వడదెబ్బ అంటారు. వేడి వాతావరణం లేదా చురుకైన పనులతో కలిగే అధిక వేడిని శరీరం తట్టుకోలేనప్పుడు ఇది సంభవిస్తుంది. అధిక ఉష్ణోగ్రతలతో శరీర ప్రాథమిక అవయవాలు విఫలమయ్యేలా చేస్తుంది.
లక్షణాలివీ...
కాళ్ల వాపులు రావడం, కళ్లు తిరగడం, శరీర కండరాలు పట్టుకోవడం, తీవ్ర జ్వ రం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అధిక చెమట పట్ట డం, తల తిరిగి పడిపోవడం వంటి వి జరిగితే వెంటనే స్థానిక ఆసుపత్రికి త రలించి వైద్యం అందించాలి.
ప్రాథమిక చికిత్స
►వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడకు తీసుకెళ్లాలి. చల్లని నీరు, ఐస్‌తో ఒళ్లంతా తుడవాలి. వదులుగా ఉన్న నూలు దుస్తులు వేయాలి.
►ఫ్యాను గాలి/ చల్లని గాలి తగిలేలా ఉంచాలి.
►ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరిబోండాం లేదా చిటికెడు ఉప్పు, చక్కర కలిపిన నిమ్మరసం, గ్లూకోజు ద్రావణం లేదా ఓరల్ రీ హైడ్రేషన్ ద్రావణము (ఓ.ఆర్.ఎస్) తాగించవచ్చు.
►వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో ఉన్న రోగిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించాలి.
బారిన పడకుండా
►వేసవి కాలంలో డీహైడ్రేషన్ అధికంగా ఉంటుంది. రోజుకు కనీసం 15 గ్లాసుల నీళ్లు తాగాలి. భోజనం మితంగా చేయాలి.
►ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నీడన/చల్లని ప్రదేశంలో ఉండేందుకు ప్రయత్నించండి.
►గుండె/ఊపిరితిత్తులు/మూత్రపిండ సమస్యలు కలిగి ఉన్నవారి శరీరాలకు అధిక సూర్యరశ్మి ప్రభావించే వారి శరీరం త్వరగా డీ హైడ్రేషన్‌కు గురై వ్యాధి తీవ్రతలు అధికంగా ఉంటాయి.
►ఆల్కాహాల్/సిగరేట్/కార్పొనేటెడ్ వంటి ద్రావణాలకు దూరంగా ఉండండి.
►ఎండలో వెళ్లేటప్పుడు కళ్లకు సన్ గ్లాసెస్, తలకు టోపీ వంటివి ధరించండి.
►వేసవిలో ఉదయం/సాయంత్రం సమయాల్లో బయటికి వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి.
►వేడి వాతావరణంలో శారీరక శ్రమ కార్యక్రమాలు చేయడం మంచిది కాదు. ఒకవేళ చేస్తే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఒక 5 నిమిషాలు నీడలో ఉండేలా చూసుకోవాలి.
►ఆహారంలో ఎక్కువగా ద్రవపదార్థాలు ఉండేలా చూసూకోవాలి.
►ప్రయాణాల్లో సోడియం, ఎలక్ట్రోలైట్ వంటి ద్రావణాలను తాగడం మంచిది.
చేయకూడని పనులు
►మండు వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రత సమయంలో ఎక్కువగా తిరగరాదు.
►రోడ్లపై చల్లని రంగు పానీయాలు తాగవద్దు.
►రోడ్లపై విక్రయించే కలుషిత ఆహారం తినకుండా, ఇంట్లో వండుకున్నవే తినాలి.
►మాంసాహారం తగ్గించి, తాజా కూరగాయల్ని ఎక్కువగా ఆహారం తీసుకోవాలి.
ఈ ఆహారం మేలు
►నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. పుచ్చ, కీర, కర్బూజ, తాటి ముంజలు, బీర, పొట్ల వంటి వాటిలో నీటి శాతం పుష్కలంగా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. దీంతో కడుపు నిండినట్లుగా ఉండి, డైట్ కంట్రోల్ అవుతుంది.
►శీతల పానీయాలు, అధికంగా షుగర్ వేసిన జ్యూస్‌లు, మ్యాంగో, సపోటా వంటివి తీసుకుంటే బరువు తగ్గకపోగా, కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి.
►వేసవిలో ఆకలి తక్కువగాను, దాహం ఎక్కువగాను ఉంటుంది. డైట్ పాటించాలి. నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకోవాలి.
అత్యవసరమైతేనే బయటకు..
ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడం ఒక్కటే వడదెబ్బ నివారణకు ఏకైక మార్గం. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. అత్యవసరం అయితే మాత్రమే తలకు టోపి ధరించి వెళ్లాలి. చెమట రూపంలో శరీరంలోని లవణాలు బయటకు పోతాయి. అందుకే లవణాలతో కూడిన ద్రవాన్ని తీసుకోవాలి. కొబ్బరి నీరు, ఉప్పు, చెక్కర, నిమ్మరసంతో కలిపిన నీటిని తాగాలి.
– డాక్టర్ కొమ్మెర వినయ్, జనరల్ ఫిజిషీయన్, జిల్లా ఆసుపత్రి వైద్యుడు
పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి
పిల్లలను ఎండ వేడికి బయటకు పంపించవద్దు. 3 లీటర్లకు పైగా నీటిని తాగాలి. నవజాత శిశువులను పూర్తిగా కప్పి ఉంచకుండా, పల్చటి గుడ్డతో సగం వరకు కప్పి ఉంచాలి. పుట్టిన బిడ్డకు 6నెలల వరకు తల్లిపాలనే ఇవ్వాలి. ఇంట్లోనే ఉండే పిల్లలకు వేడి తగలకుండా, చల్లగా ఉండేలా జాగ్రత్తలను తీసుకోవాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులను వేయాలి. కాచి చల్లార్చిన నీరు, ఫిల్టర్ నీటినే పిల్లలకు ఇవ్వాలి.
– డాక్టర్ బొలిశెట్టి కళ్యాణ్‌కుమార్, పిల్లల వైద్యుడు, జిల్లా ఆసుపత్రి
Comments
Please login to add a commentAdd a comment