సాధికార స్వయంవరం
చెట్టు ఎక్కగలవా... ఓ వరుడా
మహిళా దినోత్సవం నేపథ్యంలో దేశంలో స్త్రీ సాధికారత గురించి చర్చ జరుగుతోంది. స్త్రీ ఆర్థిక, సామాజిక స్వేచ్ఛ అంశాలపై అనేక మంది గళాలు విప్పుతున్నారు. ఆ హడావుడి అలా ఉండగా.. ఇంకోవైపు ఇందూజ పిళ్లై అనే 23 ఏళ్ల బెంగళూరు అమ్మాయి పేరు మీడియాలో, సోషల్నెట్ వర్కింగ్ సైట్లలో మార్మోగుతోంది. ఈ బాబ్డ్ హెయిర్డ్ భారతనారి తగిన భర్తను వెదుక్కొనేందుకు చేసిన ప్రయత్నం సంప్రదాయ వాదులకు సంచలనమనిపిస్తోంది. సోషల్ నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. భర్తను వెదుక్కొనే ప్రయత్నంలో ప్రారంభించిన వెబ్‌సైట్‌తో వెలుగులోకి వచ్చిన ఆమె కథ దేశంలో వర్ధిల్లుతున్న స్త్రీ సాధికారతకు సిసలైన నిదర్శనంలాగుంది!
నిజాయితీతో ఉండే వాళ్లతో వేగడం కష్టం. మన అభిప్రాయాలను, ఇష్టాలను సూటిగా చెప్పేస్తే.. ‘అవతలి వారు ఇలా ఉంటేనే మాకు నచ్చుతారు..’ అని స్పష్టం చేస్తే.. ఆ తర్వాత మనం ఎవరికీ నచ్చకుండా పోతాం. మనక్కావలసినవారు కాస్త మొహమాటంగా, నెమ్మదైన తత్వంతో ఉండాలని కోరుకుంటారెవరైనా. ఎందుకంటే.. అలాంటి వారితో వ్యవహారం కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి. ఈ విషయం ఇందూజ పిళ్లైకి తెలియనిది కాదు. అయితే రాజీపడి బతికేయకూడదనేది ఆమె ఫిలాసఫీ. ప్రత్యేకించి భర్తను ఎంచుకునే విషయంలో మాత్రం పూర్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కోరుకుంది. తన భర్తగా ఉండాల్సిన వ్యక్తికి ఉండాల్సిన అర్హతలేమిటో చాలా స్పష్టంగా చెప్పింది. తనలోని యోగ్యతల గురించి.. తనకు కాబోయే వాడిలో ఉండాల్సిన గుణాల గురించి ఆమె సూటిగా చెబుతూ ఒక వెబ్సైట్ ప్రారంభించింది.
‘‘చిరు గడ్డంతో ఉండాలి. ప్రపంచాన్ని చుట్టేసే ఆసక్తి ఉండాలి.
సొంత కాళ్ల మీద నిలబడ్డ వ్యక్తి అయుండాలి. తన ఉద్యోగాన్ని ద్వేషించకూడదు. తన తల్లిదండ్రుల దగ్గర మొహమాటాలేమీ లేకుండా ఉండాలి. తను ఫ్యామిలీ గయ్ కాకుంటేనే మంచిది. పిల్లలు కనడం మీద ఆసక్తి లేని వ్యక్తై మరీ మంచిది. గంభీరమైన కంఠస్వరం, ఆకట్టుకొనే రూపాలు అదనపు అర్హతలు...’’ ఇవీ ఇందూజ తనకు భర్తగా రాబోయే యువకుడిలో కోరుకుంటున్న అర్హతలు. భర్త సొంత కాళ్లమీద నిలబడాలని, ఆకటుకునేలా ఉండాలని ఏ అమ్మాయి అయినా కోరుకోవడంలో తప్పులేదు. అయితే అతడు బాధ్యతలను మోసే ఫ్యామిలీ మ్యాన్ కాకూడదని, తన నుంచి పిల్లలను ఆశించకూడదని చెప్పడాన్ని సహజంగానే సంప్రదాయవాదులు సమ్మతించలేరు. మొదట పిళ్లై తల్లిదండ్రులు ఆమె ప్రొఫైల్‌ను ఒక వివాహ సంబంధాల వెబ్‌సైట్‌కు ఇచ్చారు. తమ కూతురు సంప్రదాయబద్ధమైన అమ్మాయి అని చెబుతూ వారు వరుడి వేటలో పడ్డారు. అయితే ఇందూజ మాత్రం దానికి సమ్మతించలేదు. ఆ వెబ్సైట్నుంచి తన ప్రొఫైల్‌ను తీయించేసి తనే ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. కేవలం వరుడికి ఉండాల్సిన అర్హతలు మాత్రమే కాదు.. తన గురించి కూడా ఇందూజ పూర్తి వివరాలను మొహమాటమేమీ లేకుండా చెప్పేసింది.
‘‘నేను నాస్తికురాలిని. సంప్రదాయబద్ధమైన అమ్మాయిని కాను. జుట్టును పొడవుగా పెంచను. కచ్చితంగా మ్యారేజ్ మెటీరియల్‌ను అయితే కాదు..’’అని స్పష్టం చేసింది ఇందూజ. వరుడి వేటలో తను ప్రారంభించిన ఈ వెబ్‌సైట్‌ను అబ్బాయిలు తమ తల్లిదండ్రులకు చూపించాలనేది ఇందూజ కండిషన్! ఈ విధంగా తన వివరాలను, క్వాలిటీలను తెలియజేసి, తనకు కావాల్సిన గుణగణాల గురించి వివరించి వరుడి వేటలో ఉంది ఇందూజ. మొదట ఈ సైట్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన తల్లిదండ్రులు తర్వాత ఆమెతో ఏకీభవించారు. ఈ సైట్‌కు భలే పాపులారిటీ వచ్చింది. సైట్లోనే తన ఫేస్బుక్, ట్వీటర్, ఇన్‌స్టాగ్రమ్, గూగుల్ ప్లస్ అడ్రస్‌లను ఇచ్చి.. వాటి ద్వారా తనను సంప్రదించవచ్చని ఇందూజ ప్రకటించింది. ప్రస్తుతానికి అయితే వేల సంఖ్యలో స్పందనలున్నాయట. కేవలం ఇండియా నుంచి మాత్రమే గాక విదేశాల నుంచి కూడా ఇందూజ కోరుకుంటున్న క్వాలిటీలు ఉన్న కుర్రాళ్లు ఆమె నిబంధనలకు సమ్మతం తెలియజేస్తూ.. పెళ్లికి రెడీ అంటున్నారని తెలుస్తోంది.
మరి ఇందూజ స్వయంవరం రైటా.. తప్పా అంటే సమాధానం చెప్పలేం. ఈ ప్రయత్నంలో తను కోరుకున్న భర్త దొరికి వైవాహిక జీవితం సంతృప్తినిస్తే ఆమె రూట్ కచ్చితంగా కరెక్టే అవుతుంది.
- జీవన్