‘భోజన ఉదంతం’పై విచారణ
హిందూపురం రూరల్ : నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపళ్లకు భోజనం ఏర్పాటు చేసిన ఉదంతంపై జిల్లా వృత్తి విద్యాధికారి చంద్రశేఖర్‌రావు గురువారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో విచారణ చేపట్టారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ప్రయోగ పరీక్షలు జంబ్లింగ్ విధానంపై నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. పట్టణంలోని ప్రైవేటు కళాశాలలకు చెందిన విద్యార్థులు స్థానిక బాలికల జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రానికి హాజరవుతారు. ఈ క్రమంలో గత నెల 26న ప్రిన్సిపల్ రంగనాయకులు, టైపిస్ట్ లక్ష్మణ్‌రావు కళాశాలలో ప్రైవేటు విద్యాసంస్థల ప్రిన్సిపళ్ల సమావేశంలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. దీని కోసం ప్రతి విద్యార్థి నుంచి రూ.300 వసూలు చేయాలని నిర్ణయించారు.
దీనిపై ప్రైవేటు కళాశాలల అసోషియేషన్ అధ్యక్షుడు సునీల్ ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఉదయలక్ష్మికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్ ప్రిన్సిపల్ ను విధుల నుంచి తప్పించి విజయవాడలో బోర్డుకు రిపోర్టు చేసుకోవాలని ఆదేశించారు. టైపిస్టును గుడిబండ కళాశాలకు తాత్కాలికంగా బదిలీ చేశారు. అనంతరం ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా వృత్తి విద్యాధికారి విచారించి భోజన ఉదంతంపై వారితో లిఖితపూర్వకంగా నివేదిక తీసుకున్నారు. రెండు రోజుల్లో నివేదికను ఇంటర్మీడియట్ బోర్డుకు అందజేయనున్నట్లు ఆయన వివరించారు. విచారణలో ఆయన వెంట సూపరింటెండెంట్ రూప్లేనాయక్, సీనియర్ అసిస్టెంట్ రాఘవేంద్రగౌడ్ ఉన్నారు.