తప్పుదోవ పట్టించి.. తరలింపు!
పోలీసులను విశాఖకు.. మావోలను మల్కన్‌గిరికి
సంఘటన ఒడిశాలో జరిగిందంటూ మావోలు అక్కడికే తరలింపు
అదే సంఘటనలో గాయపడిన గ్రేహౌండ్స్ సిబ్బందిని మాత్రం విశాఖకు
పోలీసుల ద్వంద్వ వైఖరితో అనుమానాలకు మరింత బలం
మల్కన్‌గిరి నుంచి సాక్షి ప్రతినిధి:రెండు రాష్ట్రాలను కుదిపేసి.. తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన భారీ ఎన్కౌంటర్.. అదే స్థాయిలో అనుమానాలను రేపుతోంది. పోలీసుల తీరు వాటిని మరింత బలపరుస్తోంది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో సోమవారం తెల్లవారు జామున మావోయిస్టులు, పోలీసుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఎన్నడు లేని విధంగా మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. కాగా ఈ ఎన్కౌంటర్ బూటకమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండించింది. మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించి అక్కడే పోస్టుమార్టం నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై తర్జనభర్జన పడ్డ విశాఖ, మల్కన్‌గిరి ఎస్పీలు ఒడిశా రాష్ట్రంలో సంఘటన జరిగిందనే కారణం చూపుతూ మల్కన్‌గిరి ఎస్పీ కార్యాలయానికి మృతదేహాలను తరలించారు. అనంతరం అక్కడే పోస్టుమార్టం కూడా నిర్వహించారు. మరో పక్క ఏపీ హైకోర్టు ఈ నెల 27వరకు మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌లో భద్రపరచాలని తీర్పు ఇచ్చింది. ఇరు రాష్ట్రాల పోలీసులు దాన్ని బుట్టదాఖలు చేసేశారు. అదే కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన గ్రేహౌండ్స్ కమెండోలు అబూబాకర్, సతీష్‌లను విశాఖపట్నం ఆస్పత్రులకు తరలించారు. వీరిలో బాకర్ మరణించారు. పోలీసులను మాత్రం విశాఖకు తరలించి.. మావోల మృతదే హాలను ఒడిశాకు తరలించడంలో అంత్యర్యం ఏమిటి?.. పోలీసులకు ఈ నిబంధనలు వర్తించవా..? అని పౌర హక్కుల నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఎన్కౌంటర్ జరిగిన అనంతరం మృతదేహాలను ఎక్కడకు తరలిస్తారన్న దానిపై స్పష్టత కోసం మీడియా ప్రతినిధులు, ప్రజలు, పౌర హక్కులు నేతలు ఉత్కంఠంగా ఎదురు చూడగా పోలీసులు వారిని తప్పుదోవ పట్టించారు. మృతదేహాలను విశాఖపట్నం తరలిస్తే వారి బంధువులు, పౌరహక్కుల నేతలు ఎన్ కౌంటర్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తారన్న భయంతోనే ఒడిశాకు తరలించారని తెలుస్తోంది. అయితే ఈ ఎన్కౌంటర్లో ఎంతమంది పోలీసులు పాల్గొన్నారన్న ప్రశ్నను సాక్షి ప్రతినిధి ఎస్పీలను మీడియా సమావేశంలో ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. ఈ ఎన్కౌంటర్లో ఏడు పోలీసు బృందాలు పాల్గొన్నాయని చెప్పినప్పటికి స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. మావోయిస్టు మృతుల్లో ఎక్కువమంది యుక్త వయస్సు వారే ఉన్నారు.