నేడు మండ మెలిగె
ఏర్పాట్లు పూర్తిచేసిన పూజారులు
చుట్టాలతో కళకళలాడుతున్న మేడారం
ములుగు : మేడారం మహా జాతరకు వారం రోజుల ముందు నిర్వహించే పండుగ మండ మెలిగె. బుధవారం ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా వన దేవతల పూజారులు మండమెలిగె పండుగను నిర్వహించనున్నారు. మండమెలిగె అనంతరం సరిగ్గా వారానికి (వచ్చే బుధవారం) సారలమ్మ తల్లి గద్దెపైకి రావడంతో మహాజాతర ప్రారంభమవుతుంది. మేడారంలోని సమ్మక్క ఆలయం, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో మండమెలిగె పండుగను ఘనంగా నిర్వహించేందుకు పూజారులు సిద్ధమయ్యారు. ఉదయం మహిళలు తమ ఇళ్లను ముస్తాబుచేస్తారు. పుట్టమట్టితో అలుకుతారు. ఆ తర్వాత అడవికి వెళ్లి గడ్డిని సేకరించి తీసుకొస్తారు. గడ్డిని గుడిపై పెడతారు. అక్కడి నుంచి మేడారం ప్రారంభ ద్వారం వద్ద, ఆలయ ప్రవేశమార్గం ముందు దొరటంబాలు (దిష్టితగల కుండా ఏర్పాటు చేసే ద్వార స్తంభం) లేపుతా రు.
ద్వారానికి ఆనక్కాయ, మామిడి తోరణం, కోడిపిల్లను కడతారు. అక్కడి నుంచి గ్రామ దేవతలకు మొక్కు చెల్లిస్తారు. పూజారి సిద్ధబోయిన మునీందర్ఇంట్లో నుంచి పూజా సామగ్రిని సమ్మక్క గుడికి తీసుకెళ్తారు. అనంతరం అక్కడ అమ్మకు ప్రత్యేక పూజ నిర్వహించి గద్దెల పైకి తీసుకెళ్తారు. మహిళలు రోజంతా ఉపవాసం ఉంటారు. మునీందర్ ఇంటి నుంచి సమ్మక్క ఆలయానికి తీసుకెళ్లే పూజా సామగ్రిని ఇంటిలోని కుటుంబ సభ్యులు మంగళవారం సిద్ధం చేశారు. కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలోనూ ఇదే తీరుగా మండమెలిగె పూజలు నిర్వహిస్తారు.
ఊరంతా కళకళ..
మండమెలిగె పండుగకు ఇంటి ఆడపడుచులు, ఇతర చుట్టాలను ఇళ్లకు పిలవడం(కేకేయడం) ఇక్కడి ఆదివాసీల ఆనవాయితీ. ప్రస్తుతం మేడారంలో ఏ ఇళ్లు చూసినా చుట్టాలతో కళకళలాడుతోంది. ఇళ్లన్నీ నూతన శోభతో దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఇంటికి వచ్చిన ఆడపడుచును జాతర ముగిసిన తరువాతే తిరిగి అత్తారింటికి పంపిస్తామని గ్రామస్తులు తెలిపా రు. అత్తారింటికి పంపేటప్పుడు అల్లుడు, కూ తురు, వారి పిల్లలకు బట్టలు, అమ్మవారి ప్రసాదం(బెల్లం) ఇచ్చి సాగనంపుతారు.