ఏసీబీ వలలో ఎండపెల్లి వీఆర్వో
రైతు నుంచి రూ.4500 లంచం తీసుకుంటుండగా పట్టివేత
వెల్గటూరు :అది అర ఎకరం భూమి కూడా కాదు. దానిని ఇద్దరు అన్నదమ్ములు తల్లి నుంచి పొందారు. చెరి సగం పంచుకుని రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించుకునేందుకు వీఆర్వోను ఆశ్రయించారు. దీంతో ఆయన లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులను ఆశ్రయించడంతో వారు వలపన్ని వీఆర్వోను పట్టుకున్నారు.
మండలంలోని ఎండపెల్లి గ్రామ రెవెన్యూ అధికారి అయిన కె.ఆంజనేయులు.. రాజారాంపల్లి గ్రామానికి చెందిన తొట్ల మల్లయ్య అనే రైతు నుంచి రూ. 4500 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ కథనం ప్రకారం... మండలంలోని రాజారాంపల్లికి చెందిన తొట్ల బూదవ్వకు గ్రామంలో 18.20 గుంటల భూమి ఉంది. ఈ భూమిని ఆమె ఇద్దరు కుమారులైన తొట్ల మల్లయ్య, భీమయ్యకు గతేడాది 9.10 గుంటల చొప్పున విరాసత్ చేసింది.
దీనికి సంబంధించిన వివరాలను వన్‌బీ, కంప్యూటర్ పహణీలో నమోదు చే సేందుకు 20 రోజుల క్రితం అన్నదమ్ములిద్దరు వీఆర్వో ఆంజనేయును కలిశారు. దీంతో వీఆర్వో ఆంజనేయులు మల్లయ్యవద్ద రూ.6వేలు, భీమయ్య వద్ద రూ.3వేలు డిమాండ్ చేశాడు. బాధితుడైన మల్లయ్య వారం క్రితం రూ. 1500 అందించాడు. అవి తీసుకున్న తర్వాత వీఆర్వో పని చేయకుండా మిగిలిన డ బ్బు ఇవ్వాలని ఫోన్లు చేసి వేధిస్తున్నాడు. ఈ క్రమంలో సదరు రైతు ఏసీబీ అధికారులను కలిసి వీఆర్వోపై ఫిర్యాదు చేశాడు.
నిందితుడైన ఆంజనేయులు రాజారాంపల్లిలో తాను అద్దెకు ఉన్న గదిలో రైతు నుంచి రూ.4500 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం వీఆర్వోపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ గౌడ్ తెలిపారు.
మధ్యవర్తుల ద్వారా లంచం తీసుకున్నా కేసు నమోదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. అధికారులు లంచం కోసం వేధిస్తే తమకు ఫోన్ చేయాలని సూచించారు. సీఐలు రమణమూర్తి, వీరభద్రం, విజయ భాస్కర్, పీఆర్ ఏఈ ముత్తయ్య, జూనియర్ అసిస్టెంట్ ఐల్నేణి శ్రీనివాసరావు పాల్గొన్నారు.