endowment Commissioner
-
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
సాక్షి, తిరుమల: తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా పలువురు ప్రముఖులు కలియుగ వైకుంఠ దైవం శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, చెల్లుబోయిన వేణు గోపాల్, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, కర్ణాటక ఎండోమెంట్ కమిషనర్ రోహిణీ సింధూరి తదితరులు బుధవారం స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఐటీ శాఖమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నామని, కోవిడ్ నుంచి ప్రజలకు విముక్తి కలగాలని దేవుడిని ప్రార్థించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వెంకన్నను మొక్కుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలకు అందిస్తున్న ఫలాలు చూసి ప్రధాన ప్రతిపక్షం రాక్షస ఆనందం పొందుతోందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. పేదలకు ఉచిత ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిద్ధం అవుతుంటే కోర్టులు ద్వారా అడ్డుకుని కుట్రలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి శ్రీవారి అనుగ్రహం ఉందని, డిక్లరేషన్ పేరుతో వివాదం చేసి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కర్ణాటక ఎండోమెంట్ కమిషనర్ రోహిణీ సింధూరి మాట్లాడుతూ ‘మైసూర్ మహారాజు కాలం నుండి తిరుమలలో 7 ఎకరాల్లో కర్ణాటక రాష్ట్ర ఛారిటీస్ ఉన్నాయి. 14 శతాబ్దం నుండి కర్ణాటక భక్తులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చేవారు. ప్రభుత్వం తరపున ప్రతిరోజు శ్రీవారికి నిత్య హారతి అందిస్తారు. 1964లో అప్పటి ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి కర్ణాటక సత్రాలకు భూమిపూజ చేశారు. ఇప్పుడు రూ.200 కోట్లతో తిరుమలలో కర్ణాటక ఛారిటీస్‌కు సంబంధించి 5 కాంప్లెక్స్‌లు నిర్మించనున్నాం. రోజుకు 1800 మంది భక్తులకు వసతి కలిగించేలా నిర్మాణం చేపట్టనున్నాం. రేపు ఉదయం 8.10 గంటలకు కర్ణాటక సత్రాల నూతన సముదాయానికి ఏపీ సీఎం వైఎస్ జగన్, కర్ణాటక సీఎం యడియూరప్ప భూమిపూజ చేయనున్నారు’ అని తెలిపారు. ఇక అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ వరదుడు, సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజు ఉదయం మోహినీ రూపంలో పల్లకిలో ఊరేగుతూ భక్తులకు ఏకాంతంగా దర్శనం ఇచ్చారు. క్షీరసాగర మథనం సమయంలో వెలువడిన అమృతాన్ని దేవతలు అందరికి దక్కేలా చేసిన అవతారమిది. సాక్షాత్తు పరమశివుడు సైతం సమ్మోహన పరిచిన మోహినీ రూపంలో పల్లకీలో ఎదురుగా అద్దంలో తన ముగ్ద మనోహరమైన సుందర రూపాన్ని చూసి మురిసిపోతూ ఊరేగుతూ పల్లకీలో ఊరేగుతూ భక్తులకు ఏకాంతంగా దర్శనమిచ్చారు. -
పురోహితులపై ఆంక్షలు లేవు
దేవాదాయ శాఖ కమిషనర్ అనూరాధ విజయవాడ(వన్‌టౌన్) : పుష్కరాల్లో భాగంగా పిండ ప్రదానాలు, పుష్కర సంకల్పం నిర్వహించే పురోహితులపై ఎటువంటి ఆంక్షలు విధించలేదని రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ వైవీ అనూరాధ అన్నారు. పుష్కరాల్లో భాగంగా దేవాదాయ ధర్మదాయ కమిషనర్ అనూరాధ నగరంలోని పున్నమి, దుర్గా, కృష్ణవేణి, పద్మావతి, భవానీ ఘాట్లను శనివారం పరిశీలించారు. అనంతరం దుర్గాఘాట్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ పురోహితులు అన్ని పుష్కర ఘాట్లలో అందుబాటులో ఉండాలన్నారు. యాత్రికుల సంక్పలం, పిండ ప్రదానం తదితర క్రతువుల నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. హైకోర్టు జారీ చేసిన ఆదేశాల దృష్ట్యా పురోహితులు ఏ ఘాట్లలోనైనా తమ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చన్నారు. అయితే రద్దీగా ఉన్న ఘాట్లలలోనే పురోహితులు అందరూ ఉంటే మిగిలిన ఘాట్లలోని పుష్కర యాత్రికులకు పురోహితులు దొరకక పలు ఇబ్బందులకు గురవుతారన్నారు. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో మొదటి రోజున 38 వేల పిండ ప్రదానాలను పుష్కర యాత్రికులు నిర్వహించారన్నారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 27 వేలు, గుంటూరు జిల్లాలో 9600, కృష్ణాజిల్లాలో 1400 పిండ ప్రదానాలు చేశారని వివరించారు. -
‘నలుగురుండి ఏం చేస్తున్నారు’
రాజానగరం : అన్నదాన సత్రానికి ఆస్తులు అధికంగా ఉన్నా, ఆదాయం అంతంత మాత్రంగా ఉండడంపై దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వైవీ అనురాధ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్యాణ మంటపం నిర్మిస్తామంటూ గ్రామంలోని శ్రీరాజాకాండ్రేగుల జోగిజగన్నాథరావు బహుదూర్ పంతులు అన్నదాన సత్రాన్ని నేలకూల్చిన ప్రాంతాన్ని గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సత్రానికి ఉన్న ఆస్తులు, వస్తున్న ఆదాయాన్ని పరిశీలించారు. అధికారులపై మండిపడ్డారు. ఏడు గ్రామాల్లో 142 ఎకరాలు ఉంటే దానిలో సాగు భూమిగా ఉన్న 80 ఎకరాలకు రూ.ఎనిమిది లక్షల 20 వేలు మాత్రమే ఆదాయం రావడంపై ఆరా తీశారు. ‘నాలుగు ఎకరాలకు కనీసం రూ. లక్ష ఆదాయం రావలసిన తరుణంలో 80 ఎకరాలకు రూ.ఎనిమిది లక్షలా?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. నలుగురు ఉద్యోగులు ఉండి ఏం లాభం అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తక్షణం నిబంధనల మేరకు ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని, పన్నుల వసూలుపై దృష్టిని సారించాలని సూచించారు. కూల్చి వే సిన సత్రం స్థల ంలో కల్యాణ మంటపాన్ని నిర్మించడం వల్ల ఏ విధమైన ప్రయోజనం ఉంటుందనే విషయమై చర్చించారు. రెండు అంతస్తులతో భవనాన్ని నిర్మించి, దిగువన కల్యాణాలకు, ఎగువ భోజన వసతులకు ఏర్పాట్లు చేస్తే బాగుంటుందన్నారు. దాతలు ఇచ్చిన భూములను కూడా కాపాడలేని స్థితిలో ఉద్యోగులు ఉండడం విచారకరమంటూ ఆక్రమణలపై ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సర్వే చేయించి, గ్రామంలో దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఉన్న ఆస్తులను ఆక్రమణల నుంచి కాపాడుకోవాలన్నారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ సూరిబాబు, అసిస్టెంట్ కమిషనర్ రమేష్‌బాబు, ఈఈ సుబ్బారావు, ఆర్జేసీ అజాద్, స్థానిక ఉద్యోగులు ఉన్నారు.