ఏసీబీ వలలో అవినీతి చేప
రూ.10వేలు లంచం తీసుకుంటూ చిక్కిన దేవాదాయ శాఖ ఉద్యోగి
జీతం బకాయిల కోసం ఉద్యోగినికి వేధింపులు
విజయవాడ సిటీ : దేవాదాయ శాఖలో లంచం రుచిమరిగిన తిమింగలాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. విజయవాడలోని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఇ.వెంకట సుబ్బారావు శనివారం రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికారు. అతని వద్ద నుంచి లంచం మొత్తం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఏసీబీ డీఎస్పీ ఆర్.విజయపాల్ కథనం ప్రకారం.. కృష్ణలంక ఫైర్‌స్టేషన్ సమీపంలోని అభయాంజనేయ స్వామి దేవాలయం గ్రేడ్-2 కార్యనిర్వహణాధికారిగా పని చేస్తున్న వి.నాగజ్యోతికి గత మార్చిలో పదోన్నతి లభించింది.
ఆమెకు రూ.1,70,500 జీతం బకాయిలు రావాల్సి ఉంది. వాటి కోసం పలుమార్లు కార్యాలయానికి తిరిగినా దేవాదాయశాఖ అధికారులు పట్టించుకోలేదు. జీతం బకాయి బిల్లును తయారు చేసి ఖజానాకు పంపాలంటే.. బిల్లు మొత్తంలో 10శాతం లంచం ఇవ్వాలని కార్యాలయం సూపరింటెండెంట్ వెంకట సుబ్బారావు డిమాండ్ చేశారు. ఆమె పలుమార్లు ప్రాధేయపడగా రూ.10 వేలు ఇస్తే సర్దుకుంటానని చెప్పారు. దీంతో నాగజ్యోతి అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు.
దొరికిందిలా...
నాగజ్యోతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ముందుగా సూపరింటెండెంట్ వెంకట సుబ్బారావు వ్యవహారశైలిపై ఇన్స్పెక్టర్ ఎస్ఎస్వీ నాగరాజుతో విచారణ జరిపించారు. విచారణలో తేలిన అంశాల ఆధారంగా సూపరింటెండెంట్‌పై కేసు నమోదు చేశారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో నాగజ్యోతి పోలీసు కంట్రోల్ రూమ్ సమీపంలోని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయంలోని మొదటి అంతస్తుకు వెళ్లి రూ.10 వేలను సూపరింటెండెంట్‌కు అందజేశారు. ఆ మొత్తాన్ని తీసుకున్న సుబ్బారావు తన టేబుల్ డ్రాయర్ సొరుగులో పెట్టారు.
ఆమె కిందకు వచ్చి ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. రసాయన పరీక్షల్లో పాజిటివ్ రిపోర్టు వచ్చిందని డీఎస్పీ తెలిపారు. విద్యుత్ శాఖ ఏడీఈ మధ్యవర్తిగా పంచనామా జరిపి వెంకట సుబ్బారావుపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు డీఎస్పీ చెప్పారు. అతని ఇంటిపై కూడా మరో బృందంతో దాడి చేశామని, అక్కడ ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు వెల్లడైతే మరో కేసు నమోదు చేస్తామని తెలిపారు. దాడుల్లో ఇన్స్పెక్టర్లు ఎం.శ్రీనివాస్, ఎస్ఎస్వీ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
డబ్బు ఇవ్వకుంటే బిల్లు పంపనన్నాడు
జీతం బకాయిల కోసం ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదు. ముందు 10 శాతం ఇవ్వమన్నాడు. కాదంటే రూ.10 వేలు ఇస్తేనే బిల్లు చేసి పంపుతానన్నాడు. న్యాయంగా రావాల్సిన బకాయిలకు లంచం ఎందుకు ఇవ్వాలని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాను. అధికారులు స్పందించి పట్టుకున్నారు. ఇలాంటి వారికి తగిన శిక్ష పడాల్సిందే.
వి.నాగజ్యోతి, గ్రేడ్-2 ఈవో, అభయాంజనేయస్వామి దేవస్థానం.