ఈ వేసవిలో కోతలుండవు
రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డి.కె.శివకుమార్
బెంగళూరు : ఈ వేసవిలో కరెంటు కోతలుండబోవని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డి.కె.శివకుమార్ తెలిపారు. గురువారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.....ఈ వేసవిలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 300 నుంచి 500 మెగావాట్ల విద్యుత్ కొరత ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ కొరతను అధిగమించేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందని పేర్కొన్నారు. వేసవిలో కరెంటు కోతలను నివారించేందుకు గాను 500 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుందని తెలిపారు. మార్చి మొదటి వారం నుంచే విద్యుత్ కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు కరెంటు రాక, పోకలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్లు పంపించేందుకు గాను విద్యుత్ శాఖ నిర్ణయించిందని తెలిపారు. తద్వారా రైతులు తమ పొలాల్లోని పంపుసెట్ల వద్ద రాత్రింబవళ్లు పడిగాపులు కాసే ఇబ్బంది తప్పుతుందని పేర్కొన్నారు.
ఇందుకు గాను ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని రైతుల సెల్‌ఫోన్ నంబర్లను సేకరించే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. కాగా రాష్ట్ర విద్యుత్ శాఖ గత ఏడాది నుంచి అమలు చేస్తున్న ‘నవీకృత ఇంధన విధానానికి’ గాను జాతీయ స్థాయి అవార్డును గెలుచుకుందని డి.కె.శివకుమార్ పేర్కొన్నారు. విద్యుత్ నిర్వహణకు సంబంధించిన రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రస్తుతం అత్యుత్తమ పనితీరును కనబరుస్తోందనడానికి ఇదే ఉదాహరణ అని తెలిపారు.