‘మోక్షగుండం’ను ఆదర్శంగా తీసుకోవాలి
తణుకు అర్బన్/కొవ్వూరు టౌన్, న్యూస్‌లైన్ :
ఇంజినీరింగ్ రంగంలో సమూల మార్పులతో అద్భుతాలను సృష్టించిన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఇంజినీర్లందరూ ఆదర్శంగా తీసుకోవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇంజినీర్స్ డేను ఆదివారం ఘనంగా నిర్వహించారు. తణుకు పంచాయతీ రాజ్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమైక్యాంధ్ర రిలే దీక్షా శిబిరంలో మోక్షగుండం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నరసాపురం పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ సాంకేతికంగా ఇంజనీరింగ్ వ్యవస్థను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత విశ్వేశ్వరయ్యకు మాత్రమే దక్కుతుందన్నారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం ఎన్నో ప్రాజెక్టులకు ఆయన రూపకల్పన చేసి భారత్ సత్తాను చాటారని కొనియాడారు. భావి ఇంజినీర్లు ఆయన బాటలో నడవాలని ఉద్భోదించారు. ఎన్జీవోస్ కన్వీనర్ పీవీ రమణ, జేఏసీ నాయకులు బసవ రామకృష్ణ, రిటైర్డ్ ఈఈ రామిరెడ్డి, మాజీ ఇంజినీర్ల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు కె.హనుమంతరావు, జిల్లా అధ్యక్షుడు సుబ్బారావు, డీఈలు సలీం, రమణ, ఏఈలు సూర్యప్రకాష్, అగస్టీన్ పాల్గొన్నారు.
ఇంజినీర్లకు సత్కారం
కొవ్వూరు టౌన్ : నవ సమాజ నిర్మాతలు ఇంజినీర్లని కొవ్వూరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పరిమి హరిచరణ్ అన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో ఇంజినీర్స్ డేను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజినీర్లు నెక్కంటి వెంకటేశ్వరావు, పెండ్యాల రంగారావు, నత్తా పరమ రాజేశ్వరరావు, ఉప్పులూరి ఆనందరామారావు, వై.దొరబ్బాయిలను ఘనంగా సత్కరించారు. లయన్స్ క్లబ్ జిల్లా కమిటీ చైర్మన్ జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, క్లబ్ కార్యదర్శి పాలెంపాటి చినబాబు, కోశాధికారి కలగర వెంకట్రావు, పాస్ట్ ప్రెసిడెంట్ బూరుగుపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.