Engineering Management
-
‘మేనేజ్మెంట్ కోటా వివరాలివ్వండి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్ల ప్రవేశాల్లో విద్యార్థుల నుంచి యాజమాన్యాలు క్యాపిటేషన్ ఫీజు వసూలు చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) స్పందించింది. మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ కోటా సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జాబితా, ఆ కోటాల్లో సీట్లు పొందిన విద్యార్థులు జాబితా, వారి ఎంసెట్ ర్యాంకులతో సహా కాలేజీ యాజమాన్యాలు తమకు అందజేయాలని టీఏఎఫ్ఆర్సీ స్పష్టం చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ కిందకి వచ్చే విద్యార్థులు ఎవరూ కాలేజీల్లో ప్రత్యేక ఫీజు చెల్లించవద్దని తెలిపింది. ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించని వారు మాత్రమే రూ. 5,500 స్పెషల్ ఫీజును చెల్లించాలని సూచించింది. ఎన్ఆర్ఐ కోటాలో చేరే విద్యార్థులు చెల్లించే ఫీజుల మొత్తం పోగా మిగతా మొత్తాన్ని మాత్రమే కాలేజీలకు విడుదల చేయాలని ప్రభుత్వానికి సూచించింది. -
నోట్లను బట్టే సీట్లు!
♦ అడ్డగోలుగా ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ ♦ రూ.6 నుంచి 12 లక్షల వరకు అమ్ముకుంటున్న వైనం ♦ కనీసం ఆన్లైన్లో దరఖాస్తు అవకాశమే ఇవ్వని కాలేజీలు ♦ దరఖాస్తు అవకాశమిచ్చినా.. సాకులు చెప్పి తిరస్కారం.. ♦ పట్టించుకోని ప్రభుత్వం.. కోరల్లేని పాములా విద్యా మండలి సాక్షి, హైదరాబాద్ : ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ప్రవేశాల్లో కాలేజీలు అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలు, హైకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి సీట్ల అమ్మకాలకు తెరలేపాయి. విద్యార్థులకు కనీసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదు. ప్రభుత్వ ఉత్తర్వులు, హైకోర్టు ఆదేశాల ప్రకారం యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కాలేజీలు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడంతోపాటు తమ వెబ్సైట్ ద్వారా, నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలి. కాని డొనేషన్ చెల్లించేందుకు ముందుకు వచ్చిన వారికే సీట్లను ఇస్తూ, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడం లేదు. డొనేషన్ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అడ్డగోలుగా దండుకుంటున్నాయి. టాప్ కాలేజీల్లో బ్రాంచీని బట్టి రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఒక్కో సీటుకు వసూలు చేస్తుండగా, మధ్య తరహా కాలేజీల్లో బ్రాంచీని బట్టి రూ.3 లక్షల నుంచి 6 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమాజ సేవ చేస్తున్నామంటూ నీతులు చెప్పే కొన్ని సొసైటీలు కూడా సీటుకు రూ.6 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించిన కొన్ని కాలేజీలు కూడా సీట్లు వచ్చిన విద్యార్థులకు వివిధ రకాల సాకులతో ప్రవేశాలను తిరస్కరిస్తున్నాయి. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు సీట్లు అమ్ముకుంటున్నాయి. ఇంత తంతు జరగుతున్నా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. అడ్డగోలు వసూళ్లకు దారులివి.. 12 వేలకు పైగా ర్యాంకు వచ్చిన ఓ విద్యార్థికి కన్వీనర్ కోటాలో ఓ మధ్య తరహా కాలేజీలో సీటు లభించింది. కానీ అందులో చేరేందుకు ఇష్టపడని ఆ విద్యార్థి ఆన్లైన్ రిపోర్టు చేయలేదు. ఘట్కేసర్ సమీపంలోని మంచి కాలేజీలో సీటు కావాలంటూ తండ్రిపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో మేనేజ్మెంట్ కోటా సీటు కోసం దరఖాస్తు చేసేందుకు ఆ కాలేజీ వెబ్సైట్లోకి వెళ్తే దరఖాస్తు లింకు లేదు. కాలేజీకి వెళ్లి అడిగితే దరఖాస్తు ఫారం ఇవ్వకపోగా.. సీట్లు లేవన్నారు. మధ్యలో ఓ బ్రోకర్ కల్పించుకొని ఒక్కటే సీటు ఉంది.. రూ. 8 లక్షలు ఇస్తే సీటు ఇప్పిస్తానన్నాడు. అంత డబ్బు చెల్లించలేని ఆ తండ్రి ఉసూరుమంటూ వెనక్కి వెళ్లిపోయాడు. మరో ప్రముఖ కళాశాల మేనేజ్మెంట్ కోటా సీట్లనూ స్పాట్ అడ్మిషన్లో భర్తీ చేస్తామని, ఈనెల 8న హాజరు కావాలంటూ 543 మంది విద్యార్థులను ఆహ్వానిస్తూ 4వ తేదీన తమ వెబ్సైట్లో నోటీసు పెట్టింది. 6వ తేదీన 78 సీట్లు ఉన్నట్లు జాబితా ప్రకటించింది. అయితే 8వ తేదీన వచ్చిన వారికి మెరిట్ ప్రకారం సీట్లు కేటాయించకుండా, ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం రూ.6 లక్షలకు పైగా డబ్బు చెల్లించిన వారికి సీట్లను కేటాయించింది. జేఈఈ ర్యాంకర్ అయిన ఓ విద్యార్థికి ముందుగా ఓ మధ్య తరహా కాలేజీలో సీటు లభించింది. అక్కడ ఒరిజినల్ సర్టిఫి కెట్లు ఇచ్చాడు. అయితే అంతకంటే మంచి కాలేజీ కోసం ప్రయ త్నించాడు. ఓ టాప్ కాలేజీలో దరఖాస్తు చేసుకున్నాడు. ‘నీకు సీటు వచ్చింది.. వచ్చి అడ్మిషన్ తీసుకో’ అని యాజమాన్యం నుంచి సమాచారం వచ్చింది. కాలేజీకి వెళ్లిన విద్యార్థికి.. ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని రమ్మని చెప్పారు. సదరు విద్యార్థి తొలుత చేరిన కాలేజీకి వెళ్లి.. తనకు టాప్ కాలేజీలో సీటు వచ్చిందని.. ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని వెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లాక ‘నీవు నిర్ణీత సమ యంలో ఒరిజినల్ సర్టిఫికె ట్లతో రాలేదు.. సీటు లేదు’ అంటూ చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో ఆ విద్యార్థికి అక్కడ ప్రవే శం లభించకపోగా.. తొలుత చేరిన సీటు కూడా పోయింది. కాలేజీ యాజమాన్యం ముడుపులు ముట్టజెప్పిన మరొకరికి ఆ సీటును అమ్ముకుంది. నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. 2014 ఆగస్టు 14న ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల (జీవో 14) ప్రకారం యాజమాన్య కోటా సీట్లను కూడా ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించి మెరిట్ ప్రకారం భర్తీ చేయాలి. అయితే ఆ నిబంధనలు అమలు కాకున్నా.. అధికారుల్లో మాత్రం ఎలాంటి స్పందన లేదు. రాష్ట్రంలోని 200కు పైగా ఇంజనీరింగ్ కాలేజీల్లోని దాదాపు 30 వేల మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి ఉన్నత విద్యా మండలి గత నెలలో నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ యాజమాన్యాలు అంతకుముందు నుంచే సీట్లను బేరానికి పెట్టాయి. దీన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సాంకేతిక విద్యా శాఖ ఉన్నా లేనట్టుగానే వ్యవహరిస్తోంది. ఉన్నత విద్యా మండలి కోరల్లేని పాములా తయారైంది. -
భర్తీ ఆన్లైన్లోనే..
♦ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటాపై ఉన్నత విద్యామండలి ♦ సాక్షి కథనంపై స్పందన.. ♦ ఈ విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి తెస్తాం ♦ అఫిలియేషన్లు ఇంకా రాలేదు.. ఎన్ని వస్తాయో తెలియదు ♦ కన్వీనర్ నోటిఫికేషన్ తర్వాతే మేనేజ్మెంట్ కోటా భర్తీ: పాపిరెడ్డి ♦ ముందుగా డబ్బులు కట్టి ఇబ్బందుల్లో పడొద్దని తల్లిదండ్రులకు సూచన సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో ఆన్లైన్ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. 2017–18 విద్యా సంవత్సరం నుంచి ఆన్లైన్ విధానం అమల్లోకి తెస్తామని చెప్పారు. ‘సీటుకో రేటు.. అడ్గగోలుగా ఇంజనీరింగ్ సీట్ల అమ్మకాలు’శీర్షికన శుక్రవారం సాక్షిలో ప్రచురితమైన కథనంపై ఉన్నత విద్యా మండలి స్పందించింది. కాలేజీ యాజమాన్యాలు మేనేజ్మెంట్ కోటా సీట్లను ఇష్టారాజ్యంగా అమ్ముకోవడానికి వీల్లేదని, అలాంటి కాలేజీలపై చర్యలు తప్పవని çఆయన స్పష్టం చేశారు. ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. అది పూర్తయ్యాక అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితా, సీట్ల వివరాలు తమకు అందుతాయన్నారు. అనంతరం సీట్ల భర్తీకి కన్వీనర్ నోటిఫికేషన్ జారీ చేస్తారని చెప్పారు. అప్పటివరకు యాజమాన్యాలు మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ చేయొద్దని స్పష్టంచేశారు. తల్లిదండ్రులు కూడా అప్పటివరకు మేనేజ్మెంట్ కోటా సీట్లలో తమ పిల్లలను చేర్చవద్దని సూచించారు. తాము ఆన్లైన్ భర్తీ విధానం అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నందున వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. ‘‘అనాలోచితంగా ఇప్పుడే మేనేజ్మెంట్ కోటా సీట్లలో చేరితే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎన్ని కాలేజీలకు అనుబంధ గుర్తింపు వస్తుందో.. ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు. ముందుగానే డబ్బులు కట్టి తల్లిదండ్రులు ఇబ్బందులు పడవద్దు. ఏవైనా కాలేజీ యాజమాన్యాలు సీట్లు అమ్ముకుంటున్నట్లు తల్లిదండ్రులకు తెలిస్తే.. మాకు ఫిర్యాదు చేయాలి. అలాంటి కాలేజీలపై కఠిన చర్యలు చేపడతాం’’ అని ఆయన స్పష్టం చేశారు. -
మేనేజ్మెంట్ కోటా భర్తీ హుళక్కే!
ఆన్లైన్లో ఇంజనీరింగ్ ఈసారికి పాత పద్ధతిలో యాజమాన్యాలకే సీట్ల భర్తీ చాన్స్ సాక్షి, హైదరాబాద్ : ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో ఈసారి ఆన్లైన్ విధానం అమలు చేయడం కష్టమన్న భావనకు ఉన్నత విద్యాశాఖ వచ్చింది. ఇప్పటికిప్పుడు ఉత్తర్వుల మార్పు సాధ్యం కాదని, ఈసారికి యాజమాన్యాలే పాత పద్ధతిలో మేనేజ్మెంట్ కోటా సీట్లను భర్తీ చేసుకునేలా అవకాశం కల్పించాలనుకుంటోంది. ఆన్లైన్ ద్వారా యాజమాన్య కోటా సీట్లనూ భర్తీ చేయడం వల్ల మెరిట్ విద్యార్థులకు సీట్లు వచ్చేలా చూడొచ్చని భావించినా ఆ దిశగా చర్యలు చేపట్టలేకపోయింది. పైగా ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న విద్యాశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ నెల 17న రాష్ట్రానికి తిరిగొచ్చాక మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి అనుసరించాల్సిన మార్గదర్శకాలు, నిబంధనలను ఆయనకు వివరించి మార్చాలన్నా కనీసం 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమవగా ఈ నెల 16న సీట్లను కేటాయించేందుకు ప్రవేశాల కమిటీ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఉత్తర్వుల్లో మార్పులు చేయడం వెంటనే సాధ్యం కాదని అధికారులు భావిస్తున్నారు. అందువల్ల కడియం రాష్ట్రానికి రాగానే ఆయనతో చర్చించి పాత పద్ధతిలో యాజమాన్యాలే సీట్లు భర్తీ చేసుకునేలా నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోటా సీట్లకు కాలేజీల బేరాలు... ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్లకు ఉన్నత విద్యా మండలి ఇంకా నోటిఫికేషన్ జారీ చేయనప్పటికీ కాలేజీల యాజమాన్యాలు మాత్రం ఇప్పటికే తల్లిదండ్రులతో బేరాలు కుదుర్చుకొని సీట్లను విక్రయానికి పెట్టాయి! రూ. 8 లక్షల నుంచి రూ. 14 లక్షల వరకు డొనేషన్లు వసూలు చేస్తున్నట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈసారి 86 కాలేజీలకు అనుబంధ గుర్తింపు లేకపోవడం, అనుబంధ గుర్తింపు లభించిన 185 కాలేజీల్లో బ్రాంచీలు, సీట్లకు భారీగా కోత పడటంతో టాప్ కాలేజీల్లోని మేనేజ్మెట్ కోటా సీట్లకు డిమాండ్ పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకున్న యాజమాన్యాలు చివరకు ఎన్ఆర్ఐ/ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా సీట్లనూ అమ్మకానికి పెట్టాయి. వాస్తవానికి ఎన్ఆర్ఐ/ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా ఫీజును ఏఎఫ్ఆర్సీ 5 వేల అమెరికన్ డాలర్లుగా నిర్ణయించింది. కానీ వాటి భర్తీలోనూ మెరిట్‌ను పక్కన పెట్టి భారీగా డొనేషన్లు చెల్లించే వారికే సీట్లను ఇస్తున్నట్లు సమాచారం.