నోట్లను బట్టే సీట్లు! | Engineering Management Quota Seat replacement | Sakshi
Sakshi News home page

నోట్లను బట్టే సీట్లు!

Published Thu, Jul 13 2017 1:35 AM | Last Updated on Mon, Aug 20 2018 3:21 PM

నోట్లను బట్టే సీట్లు! - Sakshi

నోట్లను బట్టే సీట్లు!

అడ్డగోలుగా ఇంజనీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీ
రూ.6 నుంచి 12 లక్షల వరకు అమ్ముకుంటున్న వైనం
కనీసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు అవకాశమే ఇవ్వని కాలేజీలు
దరఖాస్తు అవకాశమిచ్చినా.. సాకులు చెప్పి తిరస్కారం..
పట్టించుకోని ప్రభుత్వం.. కోరల్లేని పాములా విద్యా మండలి


సాక్షి, హైదరాబాద్‌ : ఇంజనీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రవేశాల్లో కాలేజీలు అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలు, హైకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి సీట్ల అమ్మకాలకు తెరలేపాయి. విద్యార్థులకు కనీసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదు. ప్రభుత్వ ఉత్తర్వులు, హైకోర్టు ఆదేశాల ప్రకారం యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కాలేజీలు పేపర్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడంతోపాటు తమ వెబ్‌సైట్‌ ద్వారా, నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలి. కాని డొనేషన్‌ చెల్లించేందుకు ముందుకు వచ్చిన వారికే సీట్లను ఇస్తూ, ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడం లేదు. డొనేషన్ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అడ్డగోలుగా దండుకుంటున్నాయి.

టాప్‌ కాలేజీల్లో బ్రాంచీని బట్టి రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఒక్కో సీటుకు వసూలు చేస్తుండగా, మధ్య తరహా కాలేజీల్లో బ్రాంచీని బట్టి రూ.3 లక్షల నుంచి 6 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమాజ సేవ చేస్తున్నామంటూ నీతులు చెప్పే కొన్ని సొసైటీలు కూడా సీటుకు రూ.6 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించిన కొన్ని కాలేజీలు కూడా సీట్లు వచ్చిన విద్యార్థులకు వివిధ రకాల సాకులతో ప్రవేశాలను తిరస్కరిస్తున్నాయి. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు సీట్లు అమ్ముకుంటున్నాయి. ఇంత తంతు జరగుతున్నా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు.

అడ్డగోలు వసూళ్లకు దారులివి..
12 వేలకు పైగా ర్యాంకు వచ్చిన ఓ విద్యార్థికి కన్వీనర్‌ కోటాలో ఓ మధ్య తరహా కాలేజీలో సీటు లభించింది. కానీ అందులో చేరేందుకు ఇష్టపడని ఆ విద్యార్థి ఆన్‌లైన్‌ రిపోర్టు చేయలేదు. ఘట్‌కేసర్‌ సమీపంలోని మంచి కాలేజీలో సీటు కావాలంటూ తండ్రిపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో మేనేజ్‌మెంట్‌ కోటా సీటు కోసం దరఖాస్తు చేసేందుకు ఆ కాలేజీ వెబ్‌సైట్‌లోకి వెళ్తే దరఖాస్తు లింకు లేదు. కాలేజీకి వెళ్లి అడిగితే దరఖాస్తు ఫారం ఇవ్వకపోగా.. సీట్లు లేవన్నారు. మధ్యలో ఓ బ్రోకర్‌ కల్పించుకొని ఒక్కటే సీటు ఉంది.. రూ. 8 లక్షలు ఇస్తే సీటు ఇప్పిస్తానన్నాడు. అంత డబ్బు చెల్లించలేని ఆ తండ్రి ఉసూరుమంటూ వెనక్కి వెళ్లిపోయాడు.

మరో ప్రముఖ కళాశాల మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లనూ స్పాట్‌ అడ్మిషన్‌లో భర్తీ చేస్తామని, ఈనెల 8న హాజరు కావాలంటూ 543 మంది విద్యార్థులను ఆహ్వానిస్తూ 4వ తేదీన తమ వెబ్‌సైట్‌లో నోటీసు పెట్టింది. 6వ తేదీన 78 సీట్లు ఉన్నట్లు జాబితా ప్రకటించింది. అయితే 8వ తేదీన వచ్చిన వారికి మెరిట్‌ ప్రకారం సీట్లు కేటాయించకుండా, ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం రూ.6 లక్షలకు పైగా డబ్బు చెల్లించిన వారికి సీట్లను కేటాయించింది.

జేఈఈ ర్యాంకర్‌ అయిన ఓ విద్యార్థికి ముందుగా ఓ మధ్య తరహా కాలేజీలో సీటు లభించింది. అక్కడ ఒరిజినల్‌ సర్టిఫి కెట్లు ఇచ్చాడు. అయితే అంతకంటే మంచి కాలేజీ కోసం ప్రయ త్నించాడు. ఓ టాప్‌ కాలేజీలో దరఖాస్తు చేసుకున్నాడు. ‘నీకు సీటు వచ్చింది.. వచ్చి అడ్మిషన్‌ తీసుకో’ అని యాజమాన్యం నుంచి సమాచారం వచ్చింది. కాలేజీకి వెళ్లిన విద్యార్థికి.. ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకొని రమ్మని చెప్పారు. సదరు విద్యార్థి తొలుత చేరిన కాలేజీకి వెళ్లి.. తనకు టాప్‌ కాలేజీలో సీటు వచ్చిందని.. ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకొని వెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లాక ‘నీవు నిర్ణీత సమ యంలో ఒరిజినల్‌ సర్టిఫికె ట్లతో రాలేదు.. సీటు లేదు’ అంటూ చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో ఆ విద్యార్థికి అక్కడ ప్రవే శం లభించకపోగా.. తొలుత చేరిన సీటు కూడా పోయింది. కాలేజీ యాజమాన్యం ముడుపులు ముట్టజెప్పిన మరొకరికి ఆ సీటును అమ్ముకుంది.

నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
2014 ఆగస్టు 14న ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల (జీవో 14) ప్రకారం యాజమాన్య కోటా సీట్లను కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించి మెరిట్‌ ప్రకారం భర్తీ చేయాలి. అయితే ఆ నిబంధనలు అమలు కాకున్నా.. అధికారుల్లో మాత్రం ఎలాంటి స్పందన లేదు. రాష్ట్రంలోని 200కు పైగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లోని దాదాపు 30 వేల మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి ఉన్నత విద్యా మండలి గత నెలలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. కానీ యాజమాన్యాలు అంతకుముందు నుంచే సీట్లను బేరానికి పెట్టాయి. దీన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సాంకేతిక విద్యా శాఖ ఉన్నా లేనట్టుగానే వ్యవహరిస్తోంది. ఉన్నత విద్యా మండలి కోరల్లేని పాములా తయారైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement