మేనేజ్‌మెంట్ కోటా భర్తీ హుళక్కే!
ఆన్‌లైన్‌లో ఇంజనీరింగ్
ఈసారికి పాత పద్ధతిలో యాజమాన్యాలకే సీట్ల భర్తీ చాన్స్
సాక్షి, హైదరాబాద్ : ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీలో ఈసారి ఆన్‌లైన్ విధానం అమలు చేయడం కష్టమన్న భావనకు ఉన్నత విద్యాశాఖ వచ్చింది. ఇప్పటికిప్పుడు ఉత్తర్వుల మార్పు సాధ్యం కాదని, ఈసారికి యాజమాన్యాలే పాత పద్ధతిలో మేనేజ్‌మెంట్ కోటా సీట్లను భర్తీ చేసుకునేలా అవకాశం కల్పించాలనుకుంటోంది. ఆన్‌లైన్ ద్వారా యాజమాన్య కోటా సీట్లనూ భర్తీ చేయడం వల్ల మెరిట్ విద్యార్థులకు సీట్లు వచ్చేలా చూడొచ్చని భావించినా ఆ దిశగా చర్యలు చేపట్టలేకపోయింది. పైగా ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న విద్యాశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ నెల 17న రాష్ట్రానికి తిరిగొచ్చాక మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి అనుసరించాల్సిన మార్గదర్శకాలు, నిబంధనలను ఆయనకు వివరించి మార్చాలన్నా కనీసం 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమవగా ఈ నెల 16న సీట్లను కేటాయించేందుకు ప్రవేశాల కమిటీ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఉత్తర్వుల్లో మార్పులు చేయడం వెంటనే సాధ్యం కాదని అధికారులు భావిస్తున్నారు. అందువల్ల కడియం రాష్ట్రానికి రాగానే ఆయనతో చర్చించి పాత పద్ధతిలో యాజమాన్యాలే సీట్లు భర్తీ చేసుకునేలా నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కోటా సీట్లకు కాలేజీల బేరాలు...
ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు ఉన్నత విద్యా మండలి ఇంకా నోటిఫికేషన్ జారీ చేయనప్పటికీ కాలేజీల యాజమాన్యాలు మాత్రం ఇప్పటికే తల్లిదండ్రులతో బేరాలు కుదుర్చుకొని సీట్లను విక్రయానికి పెట్టాయి! రూ. 8 లక్షల నుంచి రూ. 14 లక్షల వరకు డొనేషన్లు వసూలు చేస్తున్నట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈసారి 86 కాలేజీలకు అనుబంధ గుర్తింపు లేకపోవడం, అనుబంధ గుర్తింపు లభించిన 185 కాలేజీల్లో బ్రాంచీలు, సీట్లకు భారీగా కోత పడటంతో టాప్ కాలేజీల్లోని మేనేజ్‌మెట్ కోటా సీట్లకు డిమాండ్ పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకున్న యాజమాన్యాలు చివరకు ఎన్‌ఆర్‌ఐ/ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్ కోటా సీట్లనూ అమ్మకానికి పెట్టాయి. వాస్తవానికి ఎన్‌ఆర్‌ఐ/ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్ కోటా ఫీజును ఏఎఫ్‌ఆర్‌సీ 5 వేల అమెరికన్ డాలర్లుగా నిర్ణయించింది. కానీ వాటి భర్తీలోనూ మెరిట్‌ను పక్కన పెట్టి భారీగా డొనేషన్లు చెల్లించే వారికే సీట్లను ఇస్తున్నట్లు సమాచారం.