వర్సిటీల్లో 1,061 పోస్టులు
- భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సీఎం కేసీఆర్
- ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడి
- కమిటీ నివేదిక రాగానే భర్తీకి చర్యలు
- విద్యా వలంటీర్ల వేతనాలు రూ.12 వేలకు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మొత్తంగా 1,551 ఖాళీలుండగా మొదటి దశలో 1,061 ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. సచివాలయంలో మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం కడియం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
ఆ నివేదిక రాగానే భర్తీ ప్రక్రియ
ఎనిమిది యూనివర్సిటీలకు 2017–18 బడ్జెట్‌లో రూ.420 కోట్లు కేటాయించాం. పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నాం. వర్సిటీల్లో ఔట్‌సోర్సింగ్‌పై పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది సేవల క్రమబద్ధీకరణ సాధ్యాసాధ్యాలు, వారికి చెల్లిస్తున్న గౌరవ వేతనాలపై అధ్యయనం చేసేందుకు మాజీ వీసీ ప్రొఫెసర్ తిరుపతి రావు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశాం. నెల రోజుల్లో నివేదిక వస్తుంది. అది అందగానే వర్సిటీల ఆధ్వర్యంలో పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తాం. కేంద్రం మంజూరు చేసిన 84 కొత్త కేజీబీవీలు, హైదరాబాద్, ఖమ్మం మినహా మిగితా జిల్లా కేంద్రాల్లో బాలురకు 29 అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లను (యూఆర్‌ఎస్) ప్రారంభిస్తాం.
8 వేల నుంచి రూ. 12 వేలకు పెంపు
ఇప్పటికే 8,792 ఉపాధ్యాయ నియామకాలకు సీఎం ఓకే చెప్పారు. అయితే గురుకులాల తరహాలో సమస్యలు తలెత్తకుండా జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం అర్హతలను ఖరారు చేస్తున్నాం. ఇందుకు సమయం పట్టనున్న నేపథ్యంలో విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే విద్యా వలంటీర్లను నియమించేలా చర్యలు చేపట్టాం. జిల్లాల వారీగా నోటిఫికేషన్ ఇచ్చి 11,428 మంది విద్యా వలంటీర్లను నియమిస్తాం. వారి గౌరవ వేతనం రూ.8 వేల నుంచి రూ. 12 వేలకు పెంచుతున్నాం.
2 రోజుల ముందు టెట్, తర్వాత డీఎస్సీ!
ఉపాధ్యాయ నియామకాలకు టెట్, డీఎస్సీ కలిపి నిర్వహించాలా? వేర్వేరుగా నిర్వహించాలా? అన్నది పరిశీలిస్తున్నాం. రెండు రోజుల ముందు టెట్ పెట్టి.. తర్వాత డీఎస్సీ నిర్వహించే అంశం పరిశీలనలో ఉంది.
ఇంటర్ ఆన్‌లైన్‌పై నిర్ణయించలేదు
ఇంటర్ ఆన్‌లైన్ ప్రవేశాల ప్రక్రియపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఉపాధ్యాయ బదిలీల విషయంలోనూ నిర్ణయం తీసుకోలేదు. ఏకీకృత సర్వీసు రూల్స్ త్వరలోనే వస్తాయని భావిస్తున్నాం. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల ఆవరణలోకి తెచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. కేయూ పీహెచ్‌డీ ప్రవేశాల్లో అవకతవకలపై విచారణ జరుగుతోంది.
ఈసారి ఆరు గురుకులాల్లో ఇంటర్మీడియెట్
విద్యాశాఖ పరిధిలో మౌలిక సదుపాయాలున్న పాఠశాలలను గురుకుల జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించాం. అన్ని వసతులున్న ఆరు గురుకులాల్లో ఇంటర్మీడియెట్ ప్రారంభించేందుకు సీఎం ఓకే చెప్పారు. 2017–18 విద్యా సంవత్సరంలో వికారాబాద్, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌లోని బాలానగర్, ఖమ్మంలోని వైరా, యాదాద్రిలోని రామన్నపేట బాలికల గురుకులాలు, మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని బాలుర గురుకులాల్లో ఈసారి ఇంటర్మీడియెట్‌ను ప్రారంభిస్తాం.