బాల, బాలికలను సమానంగా చూడాలి
- తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం
- ఢిల్లీలో రెండోసారి సమావేశమైన ‘బాలిక విద్య’ కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: సమాజంలో బాల, బాలికలను సమానంగా చూడాలని, లింగవివక్ష చూపకుండా విద్య, ఉద్యోగాల్లో వారికి సమాన అవకాశాలు కల్పించాలని కేంద్ర బాలిక విద్య సలహా మండలి చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. దేశంలో బాలికలను విద్యలో ప్రోత్సహిం చడానికి అవసరమైన విధానాల రూపకల్పనకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన సబ్ కమిటీకి కడియం శ్రీహరి నేతృత్వం వహిస్తున్నారు. ఈ కమిటీ రెండో సమావేశం సోమవారం ఢిల్లీలో జరిగింది. దీనికి కమిటీలో సభ్యులైన అస్సాం, జార్ఖండ్ రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
బాలికల విద్యను ప్రోత్సహించడానికి ప్రస్తుతం రాష్ట్రాలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠ శాలల్లో బాలికల శాతం ఏ మేరకు ఉంది అన్న విషయాలపై ప్రధానంగా చర్చించినట్టు సమావేశం అనంతరం కడియం శ్రీహరి మీడియాకు తెలిపారు. బాల్య వివాహాలను అరికట్టినప్పుడే చదువులో బాలికల శాతం పెరుగుతుందని, విద్యాభ్యాసం వివిధ దశల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారంపై చర్చించామన్నారు. విద్యలో బాలికలను ప్రోత్సహించడానికి పాఠ్యపుస్తకాల్లో గొప్ప విజయాలు సాధించిన మహిళల జీవిత చరిత్రలను ప్రవేశపెట్టడం, పాఠశాలల్లో బాలికలకు భద్రత, సదుపాయాల మెరుగుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లోపు కేంద్రానికి నివేదిక సమర్పించనున్నట్టు ఆయన తెలిపారు.