Engineers India
-
‘నుమాలీగఢ్’కు బీపీసీఎల్ గుడ్‌బై!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ప్రైవేటీకరణ దిశగా మరో అడుగు ముందుకు పడింది. తాజా పరిణామం ప్రకారం.. ముందుగా అస్సాంలోని నుమాలీగఢ్ రిఫైనరీ (ఎన్ఆర్ఎల్) నుంచి బీపీసీఎల్ వైదొలగనుంది. ఎన్‌ఆర్‌ఎల్‌లో తనకున్న 61.65 శాతం వాటాను అస్సాం ప్రభుత్వం, ఆయిల్ ఇండియా, ఇంజినీర్స్ ఇండియా కన్సార్షియంనకు విక్రయించనుంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 9,876 కోట్లుగా ఉండనుంది. అస్సాం శాంతి ఒడంబడిక ప్రకారం ఎన్‌ఆర్‌ఎల్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ప్రైవేటీకరణ బాటలో ఉన్న బీపీసీఎల్ చేతుల నుంచి ఎన్‌ఆర్‌ఎల్‌ను పక్కకు తప్పించడం ద్వారా దాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించనున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ‘మార్చి 1న జరిగిన బోర్డు సమావేశంలో .. ఎన్‌ఆర్‌ఎల్‌లో బీపీసీఎల్‌కి ఉన్న మొత్తం 445.35 కోట్ల షేర్లను అస్సాం ప్రభుత్వం, ఆయిల్ ఇండియా, ఇంజినీర్స్ ఇండియాల కన్సార్షియంనకు విక్రయించే ప్రతిపాదనకు బోర్డు డైరెక్టర్లు ఆమోదముద్ర వేశారు’ అని స్టాక్ ఎక్సే్చంజీలకు బీపీసీఎల్ సోమవారం తెలియజేసింది. ‘ఎన్‌ఆర్‌ఎల్‌లో నియంత్రణాధికారాలను బదలాయించాలని బీపీసీఎల్ బోర్డు నిర్ణయించింది. దీనితో భారత్ పెట్రోలియం ప్రైవేటీకరణ ప్రక్రియ మరింత పుంజుకుంటుంది’ అని ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల శాఖ (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే.. ట్వీట్ చేశారు. ఎన్‌ఆర్‌ఎల్‌ను విక్రయించిన తర్వాత బీపీసీఎల్ చేతిలో మూడు రిఫైనరీలు (ముంబై, కొచ్చి, బీనా) మిగులుతాయి. 2021–22 ప్రథమార్ధంలో ప్రైవేటీకరణ.. బీపీసీఎల్‌ను ప్రైవేటీకరించడంలో భాగంగా కంపెనీలో తనకున్న మొత్తం 52.98 శాతం వాటాలను కేంద్రం విక్రయిస్తోంది. 2021–22 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వేదాంత గ్రూప్‌తో పాటు అపోలో గ్లోబల్, థింక్ గ్యాస్ తదితర సంస్థలు వీటిని కోనుగోలు చేసేందుకు పోటీపడుతున్నాయి. -
ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్‌కు వందేళ్లు..
సాక్షి, ఖైరతాబాద్: అత్యున్నత ప్రతిభ కనబరుస్తూ.. ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దుతూ.. ఎన్నెన్నో విజయాలను సొంతం చేసుకుంటూ.. నూరేళ్లు పూర్తి చేసుకుంది ‘ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్(ఐఈఐ)’.. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలతో పాటు యువ ఇంజినీర్లను ప్రోత్సహిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ చేపట్టిన అనేక కార్యక్రమాలతో ఉత్తమ స్టేట్ సెంటర్ అవార్డు సైతం అందుకుంది. 34వ ఇంజినీరింగ్ కాంగ్రెస్ సదస్సుకు హాజరైనరాష్ట్ర గవర్నర్ తమిళిసై (ఫైల్) 1920లో స్థాపించబడిన ‘ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్’ స్వర్ణోత్సవాలు తెలంగాణ స్టేట్ సెంటర్లో నిర్వహించాలని నిర్ణయించడంతో సెప్టెంబర్ 15, 2019 నుంచి సెప్టెంబర్ 13, 2020 వరకు ఏడాది పాటు అంతర్జాతీయ, జాతీయ సదస్సులు నిర్వహించారు. 34వ ఇంజినీరింగ్ కాంగ్రెస్‌ను 2019 డిసెంబర్లో నిర్వహించగా కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. క్లీన్ అండ్ సేఫ్టీ న్యూక్లియర్ పవర్ జనరేషన్‌పై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు అనూహ్య స్పందన వచ్చింది. కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మైనింగ్ రంగంలో ఎదురయ్యే సవాళ్లు, అధిగమించాల్సిన అంశాలు ఇలా అనేక సెమినార్లతో పాటు యువ ఇంజినీర్లను ప్రోత్సహిస్తూ చేపట్టిన అనేక కార్యక్రమాలు 2018–19కు గాను ఉత్తమ స్టేట్ సెంటర్‌గా అవార్డు దక్కింది. అంతర్జాతీయ సదస్సులో సావనీర్ ఆవిష్కరిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా పరిస్థితుల నేపథ్యంలో వెబినార్ల ద్వారా సదస్సులు నిర్వహించడంతో పాటు స్టేట్ సెంటర్ ఆధ్వర్యంలో సీఎం సహాయ నిధికి రూ.14 లక్షల చెక్కును అందజేశారు. రాబోయే రోజుల్లో ఎప్పటికప్పుడు యువతను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు దేశం, రాష్ట్రాభివృద్ధికి అవసరమయ్యే అంశాలపై సదస్సులు నిర్వహించి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఐఈఐ సెక్రటరి టి.అంజయ్య తెలిపారు. వందేళ్ల ముగింపు సందర్భంగా గౌవర కార్యదర్శి అంజయ్య, అదనపు గౌవర కార్యదర్శి ప్రొఫెసర్ డాక్టర్ రమణానాయక్, ప్రొఫెసర్ జి.రాధాకృష్ణ సిబ్బందితో కలిసి కార్యాలయంలో అవార్డులు, రివార్డులను ప్రదర్శించారు. ఉత్సాహంతో ముందుకు.. నాలెడ్జ్‌ను ఎప్పటికప్పుడు పంచుకోవడంతో పాటు ఐఈఐ వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలను మరింత ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ట్రాన్స్మీటర్ల ద్వారా విద్యుత్ సరఫరా చేసే టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న తరుణంలో మనం మరో వందేళ్లకు సరిపడా ఇంజినీర్లు ప్లానింగ్ చేసుకోవాలని, రాబోయే తరాలకు నాలెడ్జ్ అందించాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ జి.రామేశ్వర్రావు, ఐఈఐ తెలంగాణ స్టేట్ సెంటర్ చైర్మన్ నేడు ముగింపు వేడుక.. ఐఈఐ వందేళ్లు ముగింపు కార్యక్రమాన్ని ఆదివారం వెబినార్ ద్వారా నిర్వహిస్తున్నామని, కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కేటీఆర్, గెస్ట్ హాఫ్ హానర్‌గా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు. -
స్టాక్స్ వ్యూ
ఇంజినీర్స్ ఇండియా బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ.155 టార్గెట్ ధర: రూ.182 ఎందుకంటే: ఈ నవరత్న ప్రభుత్వ రంగ కంపెనీ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ, ఈపీసీ కంపెనీ. భారత హైడ్రోకార్బన్స్, పెట్రోకెమికల్స్ కన్సల్టెన్సీ రంగాల్లో అగ్రస్థానంలో ఉంది. భారత్‌లో ఏర్పాటైన 22 రిఫైనరీల్లో 19 రిఫైనరీలు ఈ కంపెనీ సేవలతో ఏర్పాటైనవే. ఎలాంటి రుణభారం లేని ఈ కంపెనీకి ఆదాయం, నికర లాభం పరంగా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. 2006–16 కాలానికి ఆదాయం 11 శాతం, నికరలాభం 7 శాతం, నెట్‌వర్త్ 11 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి. రెండేళ్లలో ఆదాయం 18 శాతం, నికర లాభం 29 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని భావిస్తున్నాం. కీలకమైన, భారీ ప్రభుత్వ ప్రాజెక్ట్‌లు సహజంగానే ఈ కంపెనీకి లభించడం సానుకూలాంశం. రానున్న కొన్నేళ్లలో భారత హైడ్రో కార్బన్ కంపెనీలు రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నాయి. దీంతో ఈ కంపెనీకి రూ.11,000 కోట్ల మేర కన్సల్టెన్సీ ఆర్డర్లు వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నాం. ఈపీసీ విభాగం అంతంత మాత్రంగానే ఉన్నా కన్సల్టెన్సీ విభాగం మంచి వృద్ధి సాధిస్తోంది. ఆదాయంలో 65 శాతానికి మించి ఉన్న కన్సల్టెన్సీ విభాగం 30 శాతం ఇబిటా మార్జిన్ సాధిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల కాలానికి రూ.5,024 కోట్ల ఆర్డర్లను సాధించింది. శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.2,061 టార్గెట్ ధర: రూ.2500 ఎందుకంటే: రిటైల్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)ల్లో మంచి స్థానంలో ఉన్న కంపెనీల్లో ఇదొకటి. అధిక వృద్ధి, మంచి లాభదాయకత, తక్కువ పోటీ ఉన్న వ్యాపార విధానాన్ని కంపెనీ అనుసరిస్తోంది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం తగ్గుతోంది. వచ్చే నెల నుంచి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్నాం. ఈ కంపెనీ విలువ మదింపులో పరిగణనలోకి తీసుకోని హౌసింగ్ పైనాన్స్ వ్యాపార విబాగం 3–4 ఏళ్లలో మంచి విలువను సాధిస్తుందని అంచనా. గత నెలలో లఘు, చిన్న, మధ్య తరహా వాణిజ్య సంస్థలకు రుణ మంజూరీలు పుంజుకున్నాయి. కంపెనీ పీసీఆర్(ప్రొవిజనల్ కవరేజ్ రేషియో–మొండి బకాయిలను కవర్ చేయడానికి కేటాయించే నిధులు) 81 శాతంగా ఉన్నాయి. ఇది ఇతర ఎన్‌బీఎఫ్‌సీల పీసీఆర్ కంటే అధికం. ఫలితంగా మరో రెండేళ్ల వరకూ మొండి బకాయిలకు భారీ కేటాయింపుల అవసరం ఉండదని భావిస్తున్నాం. రుణ వృద్ధి పటిష్టంగా ఉండడం, కేటాయింపు వ్యయాలు తక్కువగా ఉండడంతో లాభదాయకత జోరుగా ఉండగలదని అంచనా వేస్తున్నాం. రెండేళ్లలో రిటర్న్ ఆన్ అసెట్(ఆర్‌ఓఏ) 3 శాతం నుంచి 3.8 శాతానికి, రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) 12.3 శాతం నుంచి 17.6 శాతానికి చేరగలదని భావిస్తున్నాం.