న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ప్రైవేటీకరణ దిశగా మరో అడుగు ముందుకు పడింది. తాజా పరిణామం ప్రకారం.. ముందుగా అస్సాంలోని నుమాలీగఢ్ రిఫైనరీ (ఎన్‌ఆర్‌ఎల్) నుంచి బీపీసీఎల్ వైదొలగనుంది. ఎన్‌ఆర్‌ఎల్‌లో తనకున్న 61.65 శాతం వాటాను అస్సాం ప్రభుత్వం, ఆయిల్ ఇండియా, ఇంజినీర్స్ ఇండియా కన్సార్షియంనకు విక్రయించనుంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 9,876 కోట్లుగా ఉండనుంది. అస్సాం శాంతి ఒడంబడిక ప్రకారం ఎన్‌ఆర్‌ఎల్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కేంద్రం భావిస్తోంది.
ఈ నేపథ్యంలోనే.. ప్రైవేటీకరణ బాటలో ఉన్న బీపీసీఎల్ చేతుల నుంచి ఎన్‌ఆర్‌ఎల్‌ను పక్కకు తప్పించడం ద్వారా దాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించనున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ‘మార్చి 1న జరిగిన బోర్డు సమావేశంలో .. ఎన్‌ఆర్‌ఎల్‌లో బీపీసీఎల్‌కి ఉన్న మొత్తం 445.35 కోట్ల షేర్లను అస్సాం ప్రభుత్వం, ఆయిల్ ఇండియా, ఇంజినీర్స్ ఇండియాల కన్సార్షియంనకు విక్రయించే ప్రతిపాదనకు బోర్డు డైరెక్టర్లు ఆమోదముద్ర వేశారు’ అని స్టాక్ ఎక్సే్చంజీలకు బీపీసీఎల్ సోమవారం తెలియజేసింది. ‘ఎన్‌ఆర్‌ఎల్‌లో నియంత్రణాధికారాలను బదలాయించాలని బీపీసీఎల్ బోర్డు నిర్ణయించింది. దీనితో భారత్ పెట్రోలియం ప్రైవేటీకరణ ప్రక్రియ మరింత పుంజుకుంటుంది’ అని ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల శాఖ (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే.. ట్వీట్ చేశారు. ఎన్‌ఆర్‌ఎల్‌ను విక్రయించిన తర్వాత బీపీసీఎల్ చేతిలో మూడు రిఫైనరీలు (ముంబై, కొచ్చి, బీనా) మిగులుతాయి.
2021–22 ప్రథమార్ధంలో ప్రైవేటీకరణ..
బీపీసీఎల్‌ను ప్రైవేటీకరించడంలో భాగంగా కంపెనీలో తనకున్న మొత్తం 52.98 శాతం వాటాలను కేంద్రం విక్రయిస్తోంది. 2021–22 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వేదాంత గ్రూప్‌తో పాటు అపోలో గ్లోబల్, థింక్ గ్యాస్ తదితర సంస్థలు వీటిని కోనుగోలు చేసేందుకు పోటీపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment