స్టాక్స్ వ్యూ
ఇంజినీర్స్ ఇండియా
బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్
ప్రస్తుత ధర: రూ.155
టార్గెట్ ధర: రూ.182
ఎందుకంటే: ఈ నవరత్న ప్రభుత్వ రంగ కంపెనీ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ, ఈపీసీ కంపెనీ. భారత హైడ్రోకార్బన్స్, పెట్రోకెమికల్స్ కన్సల్టెన్సీ రంగాల్లో అగ్రస్థానంలో ఉంది. భారత్‌లో ఏర్పాటైన 22 రిఫైనరీల్లో 19 రిఫైనరీలు ఈ కంపెనీ సేవలతో ఏర్పాటైనవే. ఎలాంటి రుణభారం లేని ఈ కంపెనీకి ఆదాయం, నికర లాభం పరంగా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. 2006–16 కాలానికి ఆదాయం 11 శాతం, నికరలాభం 7 శాతం, నెట్‌వర్త్ 11 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి. రెండేళ్లలో ఆదాయం 18 శాతం, నికర లాభం 29 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని భావిస్తున్నాం.
కీలకమైన, భారీ ప్రభుత్వ ప్రాజెక్ట్‌లు సహజంగానే ఈ కంపెనీకి లభించడం సానుకూలాంశం. రానున్న కొన్నేళ్లలో భారత హైడ్రో కార్బన్ కంపెనీలు రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నాయి. దీంతో ఈ కంపెనీకి రూ.11,000 కోట్ల మేర కన్సల్టెన్సీ ఆర్డర్లు వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నాం. ఈపీసీ విభాగం అంతంత మాత్రంగానే ఉన్నా కన్సల్టెన్సీ విభాగం మంచి వృద్ధి సాధిస్తోంది. ఆదాయంలో 65 శాతానికి మించి ఉన్న కన్సల్టెన్సీ విభాగం 30 శాతం ఇబిటా మార్జిన్ సాధిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల కాలానికి రూ.5,024 కోట్ల ఆర్డర్లను సాధించింది.
శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్
బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్
ప్రస్తుత ధర: రూ.2,061
టార్గెట్ ధర: రూ.2500
ఎందుకంటే: రిటైల్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)ల్లో మంచి స్థానంలో ఉన్న కంపెనీల్లో ఇదొకటి. అధిక వృద్ధి, మంచి లాభదాయకత, తక్కువ పోటీ ఉన్న వ్యాపార విధానాన్ని కంపెనీ అనుసరిస్తోంది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం తగ్గుతోంది. వచ్చే నెల నుంచి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్నాం. ఈ కంపెనీ విలువ మదింపులో పరిగణనలోకి తీసుకోని హౌసింగ్ పైనాన్స్ వ్యాపార విబాగం 3–4 ఏళ్లలో మంచి విలువను సాధిస్తుందని అంచనా. గత నెలలో లఘు, చిన్న, మధ్య తరహా వాణిజ్య సంస్థలకు రుణ మంజూరీలు పుంజుకున్నాయి.
కంపెనీ పీసీఆర్(ప్రొవిజనల్ కవరేజ్ రేషియో–మొండి బకాయిలను కవర్ చేయడానికి కేటాయించే నిధులు) 81 శాతంగా ఉన్నాయి. ఇది ఇతర ఎన్‌బీఎఫ్‌సీల పీసీఆర్ కంటే అధికం. ఫలితంగా మరో రెండేళ్ల వరకూ మొండి బకాయిలకు భారీ కేటాయింపుల అవసరం ఉండదని భావిస్తున్నాం. రుణ వృద్ధి పటిష్టంగా ఉండడం, కేటాయింపు వ్యయాలు తక్కువగా ఉండడంతో లాభదాయకత జోరుగా ఉండగలదని అంచనా వేస్తున్నాం. రెండేళ్లలో రిటర్న్ ఆన్ అసెట్(ఆర్‌ఓఏ) 3 శాతం నుంచి 3.8 శాతానికి, రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్‌ఓఈ) 12.3 శాతం నుంచి 17.6 శాతానికి చేరగలదని భావిస్తున్నాం.