సాక్షి, ఖైరతాబాద్: అత్యున్నత ప్రతిభ కనబరుస్తూ.. ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దుతూ.. ఎన్నెన్నో విజయాలను సొంతం చేసుకుంటూ.. నూరేళ్లు పూర్తి చేసుకుంది ‘ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్(ఐఈఐ)’.. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలతో పాటు యువ ఇంజినీర్లను ప్రోత్సహిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ చేపట్టిన అనేక కార్యక్రమాలతో ఉత్తమ స్టేట్ సెంటర్ అవార్డు సైతం అందుకుంది.
34వ ఇంజినీరింగ్ కాంగ్రెస్ సదస్సుకు హాజరైనరాష్ట్ర గవర్నర్ తమిళిసై (ఫైల్)
1920లో స్థాపించబడిన ‘ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్’ స్వర్ణోత్సవాలు తెలంగాణ స్టేట్ సెంటర్‌లో నిర్వహించాలని నిర్ణయించడంతో సెప్టెంబర్ 15, 2019 నుంచి సెప్టెంబర్ 13, 2020 వరకు ఏడాది పాటు అంతర్జాతీయ, జాతీయ సదస్సులు నిర్వహించారు. 34వ ఇంజినీరింగ్ కాంగ్రెస్‌ను 2019 డిసెంబర్‌లో నిర్వహించగా కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. క్లీన్ అండ్ సేఫ్టీ న్యూక్లియర్ పవర్ జనరేషన్‌పై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు అనూహ్య స్పందన వచ్చింది. కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మైనింగ్ రంగంలో ఎదురయ్యే సవాళ్లు, అధిగమించాల్సిన అంశాలు ఇలా అనేక సెమినార్లతో పాటు యువ ఇంజినీర్లను ప్రోత్సహిస్తూ చేపట్టిన అనేక కార్యక్రమాలు 2018–19కు గాను ఉత్తమ స్టేట్ సెంటర్‌గా అవార్డు దక్కింది.
అంతర్జాతీయ సదస్సులో సావనీర్ ఆవిష్కరిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
కరోనా పరిస్థితుల నేపథ్యంలో వెబినార్ల ద్వారా సదస్సులు నిర్వహించడంతో పాటు స్టేట్ సెంటర్ ఆధ్వర్యంలో సీఎం సహాయ నిధికి రూ.14 లక్షల చెక్కును అందజేశారు. రాబోయే రోజుల్లో ఎప్పటికప్పుడు యువతను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు దేశం, రాష్ట్రాభివృద్ధికి అవసరమయ్యే అంశాలపై సదస్సులు నిర్వహించి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఐఈఐ సెక్రటరి టి.అంజయ్య తెలిపారు. వందేళ్ల ముగింపు సందర్భంగా గౌవర కార్యదర్శి అంజయ్య, అదనపు గౌవర కార్యదర్శి ప్రొఫెసర్ డాక్టర్ రమణానాయక్, ప్రొఫెసర్ జి.రాధాకృష్ణ సిబ్బందితో
కలిసి కార్యాలయంలో అవార్డులు, రివార్డులను ప్రదర్శించారు.
ఉత్సాహంతో ముందుకు..
నాలెడ్జ్‌ను ఎప్పటికప్పుడు పంచుకోవడంతో పాటు ఐఈఐ వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలను మరింత ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ట్రాన్స్‌మీటర్ల ద్వారా విద్యుత్ సరఫరా చేసే టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న తరుణంలో మనం మరో వందేళ్లకు సరిపడా ఇంజినీర్లు ప్లానింగ్ చేసుకోవాలని, రాబోయే తరాలకు నాలెడ్జ్
అందించాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ జి.రామేశ్వర్‌రావు, ఐఈఐ తెలంగాణ స్టేట్ సెంటర్ చైర్మన్
నేడు ముగింపు వేడుక..
ఐఈఐ వందేళ్లు ముగింపు కార్యక్రమాన్ని ఆదివారం వెబినార్ ద్వారా నిర్వహిస్తున్నామని, కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కేటీఆర్, గెస్ట్ హాఫ్ హానర్‌గా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment